ఇంజినీరింగ్ కాలేజీల్లో రూ.350 కోట్ల దోపిడీ!

ఇంజినీరింగ్ కాలేజీల్లో రూ.350 కోట్ల దోపిడీ!

ఇంజినీరింగ్ కాలేజీల్లో కొత్త సీట్లతో దోపిడీ!
రూ.350 కోట్ల దందాకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
కొత్తగా 14 వేల సీట్లకు పర్మిషన్
వాటిల్లో 30%  మేనేజ్​మెంట్ కోటాలోనే భర్తీ
గతేడాది కొత్త సీట్లకు పర్మిషన్ ఇవ్వని సర్కార్
ఈఏడాది ఎలాంటి షరతుల్లేకుండానే అనుమతులు

ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో కొత్తగా సీట్లు పెంచుకునేందుకు ఎలాంటి షరతుల్లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​ ఇచ్చేసింది. డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్సులకు సంబంధించిన సీట్లు పెంచుతూ జీవో జారీ చేయడంతో ఇంజినీరింగ్​ కాలేజీలు సీట్ల దందాకు తెరలేపాయి. ఆయా కోర్సుల్లో మేనేజ్​మెంట్ కోటా సీట్లకు ఫుల్ డిమాండ్ ఉంది. డొనేషన్ల పేరుతో ఒక్కో సీటుకు రూ.8లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఈ లెక్కన సుమారు రూ.350 కోట్ల సీట్ల దందాకు సర్కారు అధికారికంగా పర్మిషన్ ఇచ్చినట్టు స్పష్టమవుతున్నది.

హైదరాబాద్, వెలుగు : ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల దోపిడీకి సర్కారు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతేడాది కొత్త సీట్లు పెంచేందుకు వివిధ కారణాలతో పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం.. ఈ ఏడాది ఎలాంటి షరతుల్లేకుండానే అనుమతి ఇచ్చేసింది. డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్సుల సీట్లను పెంచుతూ జీవో ఇచ్చింది. సీట్లు పెంచాలని గతేడాది ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు సర్కార్​ను కోరితే.. ఫీజు రీయింబర్స్​మెంట్ భారాన్ని సాకుగా చూపించి తప్పించుకుంది. కాలేజీల మేనేజ్​మెంట్లు సీట్ల పెంపుపై హైకోర్టు కు పోతే, సర్కారుకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఈఏడాది కొత్త సీట్లకు పర్మిషన్ ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కన్వర్షన్ సీట్లు 6,930 

రాష్ట్రంలో టీఎస్ ఎంసెట్ అడ్మిషన్ షెడ్యూల్​లో భాగంగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి రాష్ట్రంలో 137 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలున్నాయని, వాటిలో 80,091 సీట్లున్నాయని సర్కారు ప్రకటించింది. దీంట్లో 56,064 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది. వెబ్ ఆప్షన్ల చివరి రోజు మరిన్ని కాలేజీలకు పర్మిషన్ ఇచ్చింది. దీనికితోడు వెబ్​ఆప్షన్ల గడువు కూడా పెంచింది. 5 రోజుల కింద 14,565 సీట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. దీంట్లో గతంలో కాలేజీల్లోని 6,930 సీట్లను మేనేజ్​మెంట్లు తగ్గించుకుని.. వాటి స్థానంలో ఇతర కోర్సుల సీట్లు (కన్వర్షన్) తెచ్చుకున్నాయి. దీనికితోడు కొత్తగా 7,635 సీట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ లెక్కన మొత్తం 14,565 సీట్లు పెరిగాయి. ఇవన్నీ బాగా డిమాండ్ ఉన్న కోర్సులకు సంబంధించిన సీట్లే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 155 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలుండగా, వాటిలో మొత్తం 1,00,286 సీట్లున్నట్టు మరోసారి వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 70,200 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. కొత్త సీట్లకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయం కావడంతో వసూళ్ల కోసమే ప్రభుత్వం అధికారికంగా అనుమతులిచ్చినట్టు విమర్శలు వస్తున్నాయి.

మేనేజ్​మెంట్ కోటాలో 4,369 సీట్లు

కొత్తగా 14,565 సీట్లకు పర్మిషన్ ఇవ్వగా, వీటిలో 4,369 సీట్లు మేనేజ్‌మెంట్​ కోటాలో భర్తీ చేసుకునే అవకాశముంది. ఈ సీట్లన్నీ దాదాపు కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీకి సంబంధించినవి కావడంతో ఆరోపణలకు మరింత బలాన్ని చేర్చాయి. ఆయా కోర్సుల్లో మేనేజ్​మెంట్ కోటా సీట్లకు ఫుల్ డిమాండ్ ఉంది. డొనేషన్ల పేరుతో ఒక్కో సీటుకు రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఈ లెక్కన సుమారు రూ.350 కోట్ల సీట్ల దందాకు సర్కారు అధికారికంగా పర్మిషన్ ఇచ్చినట్టు స్పష్టమవుతున్నది. మేనేజ్​మెంట్ కోటా సీట్ల భర్తీ విధానంలోనూ ఏ కాలేజీ.. నిబంధనలు అమలు చేయడం లేదు. దీనిపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు, వర్సిటీలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం కాలేజీల్లో సీట్ల పెంపునకు అనుగుణంగా ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్ ఉన్నాయా.. లేదా.. అనే వివరాలు కూడా సేకరించలేదని లెక్చరర్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

నిరుడు ఇవ్వలేమని.. ఈయేడు ఎట్ల ఇచ్చిన్రు?

నిరుడు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లు పెంచాలని మేనేజ్‌మెంట్లు సర్కారుకు ప్రతిపాదన పంపించాయి. కానీ, అప్పట్లో ఫీజు రీయింబర్స్​మెంట్ భారమని ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో మేనేజ్‌మెంట్లు హైకోర్టును ఆశ్రయించగా, సర్కారుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో మేనేజ్‌మెంట్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతున్నది. గతేడాది లాగానే ఈ ఏడాది కూడా సీట్లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరగా,  వెంటనే కొత్త సీట్లకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసింది. ఇంజినీరింగ్ కాలేజీల మేనేజ్​మెంట్లు కొంత మంది ప్రజాప్రతినిధులను మధ్యవర్తులుగా పెట్టుకుని ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నది. అయితే, గతేడాది వచ్చిన సమస్య.. ఈ ఏడాది ఎందుకు రాలేదని స్టూడెంట్ యూనియన్లు ప్రశ్నిస్తున్నాయి. దీని వెనుక పెద్ద డీల్ జరిగిందని ఆరోపిస్తున్నాయి. సర్కారుకు దమ్ముంటే.. నిబంధనల ప్రకారం మేనేజ్‌మెంట్‌ కోట సీట్లను భర్తీ చేయాలని, లేదంటే కన్వీనర్ కోటా మాదిరిగానే మేనేజ్‌మెంట్​ సీట్లనూ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.