టీఎస్పీఎస్సీ బోర్డును సక్కదిద్దలే!

టీఎస్పీఎస్సీ బోర్డును సక్కదిద్దలే!

గ్రూప్ 1 నిర్వహణపై అనేక అభ్యంతరాలు
కేవలం ఒక అధికారిని నియమించిన సర్కారు
కమిషన్ లో మిగతా వాళ్లంతా పాతవాళ్లే..!
దశాబ్ది పేరిట ఇన్ సర్వీస్ వాళ్లకు నో లీవ్స్

హైదరాబాద్ : ప్రశ్నపత్రాల లీకేజీ సంఘటన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ పాలక మండలిని ప్రక్షాళన చేయాలని డిమాండ్ ను ప్రభుత్వం పక్కన పెట్టింది. ఐఏఎస్ అధికారి బీఎం సంతోష్​ ను కంట్రోలర్ ఆఫ్​ ఎగ్జామినేషన్స్ గా నియమించి పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. ఉన్నత స్థాయిలో ఎలాంటి మార్పులు చేయకుండా కింది సిబ్బందిని కొంచం అటు, ఇటు మార్చి ప్రభుత్వం గ్రూప్ 1 ప్రిలిమినరీ నిర్వహణకు తేదీలను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గ్రూప్1 ప్రిలిమ్స్ తో పాటు పలు ప్రశ్నపత్రాలు లీకైన విషయం తెలిసిందే. వాటిని అంగట్లో పెట్టి అగ్గువకు అమ్మారన్న సంచలన నిజాలు సిట్ దర్యాప్తులోనే బయటికి వస్తున్నాయి.

ఈ వ్యవహారానికి ఒకరిద్దరిని బాధ్యులుగా చేసి చేతులు దులుపుకుందామని ప్రభుత్వం భావించింది. కానీ అక్రమాల చిట్టా తవ్వినకొద్దీ బయటపడుతున్నది. ఈ కేసులో దాదాపు 50 మందిని సిట్ అరెస్టు చేసింది. టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణ డొల్లతనమంతా బయటపడింది. కమిషన్ పాలక మండలిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. టీఎస్పీఎస్సీ ఆఫీసును ముట్టడించినా ప్రభుత్వం స్పందించలేదు. ఓ వైపు సిట్ విచారణ సాగుతుండగానే ఆదరాబాదరగా గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని ప్రకటించింది. 

ఈ నెల 11న రాష్ట్రంలోని 995 కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ నెల 2 నుంచి ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 20 రోజుల పాటు వివిధ అంశాల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రస్ఫటింప జేసేలా ఉత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 22వ తారీఖు వరకు అధికారులు, పంచాయితీ కార్యదర్శులు, ఉద్యోగులెవరూ సెలవులు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ ఎవరైనా హద్దు మీరి వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించింది. దీంతో ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్లు పరీక్షలు రాయలేని పరిస్థితి నెలకొంది. కోర్టు ఉత్త్వరుల దరిమిలా పిటిషనర్లు అప్పీల్ కు వెళ్తారా..? లేదా..? అనేది తేలాల్సి ఉంది.