ఆగమేఘాలపై గందరగోళంగా నోటిఫికేషన్లు

ఆగమేఘాలపై గందరగోళంగా నోటిఫికేషన్లు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సర్కార్​ కొలువుల భర్తీ విషయంలో ప్రభుత్వం రూల్స్​ బ్రేక్​ చేస్తున్నది. ఎనిమిదేండ్లుగా ఆలస్యం చేస్తూ వచ్చిన రాష్ట్ర సర్కార్​.. ఇప్పుడు పొలిటికల్​ మైలేజీ కోసం ఆగమేఘాల మీద ఆర్డర్లు వేస్తూ అప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇప్పిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమైన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టే తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (టీఎస్​పీఎస్సీ)పై ఒత్తిడి తెస్తున్నది. రాష్ట్ర సర్కార్​ వ్యవహార తీరుతో టీఎస్​పీఎస్సీ గందరగోళంలో పడింది. ఒక పరీక్షకు, ఇంకో పరీక్షకు మధ్య ఎంత వ్యవధి ఉంటుందనేది క్లారిటీ లేకపోవడంతో, దేనిమీద కూడా పూర్తిస్థాయిలో దృష్టిసారించి చదవలేని పరిస్థితి తలెత్తుతున్నదని అభ్యర్థులు అంటున్నారు. గత నెల 25న ఆర్థిక శాఖ ఆమోదం పొందిన 9,168  గ్రూప్ 4​  పోస్టులకు వారం రోజుల వ్యవధిలోనే టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్​ ఇచ్చింది.

ఈ నెలఖారులో రావాల్సిన నోటిఫికేషన్​ను.. రాష్ట్రంలో రాజకీయ అలజడి పెరగడం, ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరును ఎండగడుతుండటంతో ఒకటో తేదీన నోటిఫికేషన్​ ఇచ్చారనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి ఇండెంట్​ రాకుండానే, రోస్టర్​ ఫిక్స్​ చేయకుండానే, న్యాయ పరిశీలన పూర్తి కాకముందే గ్రూప్​ 4 నోటిఫికేషన్​ ప్రకటన వచ్చేసింది. అన్నీ సిద్ధమైతే డిసెంబర్​ 23న డీటెయిల్డ్​ నోటిఫికేషన్​ వస్తుందని టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే.. పొలిటికల్​ మైలేజ్​, ఇష్యూ డైవర్షన్​ కోసం రూల్స్ అన్నీ పక్కన పెట్టి టీఎస్​పీఎస్సీతోటి ప్రభుత్వం ఆగమేఘాల మీద ఈ నెల 1న నాలుగైదు లైన్ల నోటిఫికేషన్​ ప్రకటన చేయించిందని అభ్యర్థులు అంటున్నారు. 

ఇండెంట్​ రాకుండానే..!

సాధారణంగా ఆర్థిక శాఖ ఆమోదం పొందిన పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్​పీఎస్సీతో పాటు సంబంధిత రిక్రూట్​మెంట్​ బోర్డులకు అప్పగిస్తారు. దాని ప్రకారం ఏ పోస్టులు ఏయే డిపార్ట్​మెంట్ల నుంచి ఉన్నాయి ? వాటి వేకెన్సీ వివరాలు, జోనల్​ వ్యవస్థ, రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్లు అన్నీ తెప్పించుకుని నోటిఫికేషన్​ రెడీ చేస్తారు. ఇదంతా సంబంధిత డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లతో రెండు, మూడు దఫాలుగా సమావేశమై ఫైనల్​ చేస్తారు. ఆ తర్వాత నోటిఫికేషన్​తో లీగల్​ ఇష్యూస్​ ఏమీ రాకుండా దానిని ఒకసారి లీగల్​ వెరిఫై చేయిస్తారు.  సెంట్రల్​ ఎగ్జామ్స్​ ఏమైనా ఉన్నాయా? రాష్ట్ర పరిధిలో జరుగుతున్న పరీక్షల తేదీలు ఏమిటి? అనే వివరాలు తెప్పించుకుంటారు.

అప్లికేషన్లు, ఎగ్జామ్​ నిర్వహించే తేదీలను కూడా నిర్ణయించి నోటిఫికేషన్​ ఇస్తారు. అయితే గ్రూప్​ 4 విషయంలో ఇవేమీ జరగకుండానే నోటిఫికేషన్ ఇచ్చేశారు. ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతో గ్రూప్​ 4 ఇండెంట్​ జిల్లాలవారీగా, రోస్టర్​, ఇతర వివరాలేమి పూర్తి చేయకుండానే నోటిఫికేషన్​ విడుదల చేశారు. ఇప్పుడు ఆఫీసర్లను పరుగులు పెట్టిస్తూ.. కేవలం గ్రూప్​ 4 పోస్టుల వివరాలను ఫైనల్​ చేసే పనిలోనే పెట్టారు. దీంతో మూడు, నాలుగు నెలల కిందట పర్మిషన్  వచ్చి సగానికిపైగా నోటిఫికేషన్​ ప్రక్రియ పూర్తి చేసుకున్న ఇతర జాబ్స్​ భర్తీని ఇప్పుడు పక్కన పెట్టినట్లు తెలిసింది.

ఏ ఎగ్జామ్​ ఎప్పుడు ? ఎట్లా ?

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రం కావడం..చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఏండ్ల తరబడి ప్రిపేర్​ అవుతూ వస్తున్నారు. కొందరు గ్రూప్స్​ కోసం, మరికొందరు పోలీస్​, టీచర్​ పోస్టుల కోసం చదువుతున్నారు. ఇప్పుడు వరుస పెట్టి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్​ చేసింది. అయితే ఈ క్రమంలో పొలిటికల్​ మైలేజ్​ పేరుతో ఇష్టారీతిన ఒకేసారి నోటిఫికేషన్లు ఇచ్చేలా టీఎస్​పీఎస్సీ, రిక్రూట్​మెంట్​ బోర్డులపై ఒత్తిడి తెస్తే మొదటికే మోసం వచ్చే చాన్స్​ ఉందని అభ్యర్థులు అంటున్నారు. చాలా మంది నాలుగైదు రకాల కాంపిటీటివ్​ ఎగ్జామ్స్​కు ప్రిపేర్​ అవుతుంటారు. వాటన్నింటి మధ్య గ్యాప్​ లేకుంటే తమకు నష్టం కలుగుతుందని అభ్యర్థులు అంటున్నారు.