తెలంగాణలోనూ డ్యామ్​ సేఫ్టీ చట్టం.?

తెలంగాణలోనూ డ్యామ్​ సేఫ్టీ చట్టం.?
  • ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్న అధికారులు
  • 174 డ్యాములపైనా మానిటరింగ్​ చేసేలా చర్యలు 
  • పైలెట్​ ప్రాజెక్టుగా తొలి రెండేండ్లు ఐదింటిపై పర్యవేక్షణ

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో డ్యాములు, బ్యారేజీల భద్రత కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. అందుకు తగ్గట్టుగా డ్యామ్​ సేఫ్టీ కోసం చట్టం చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులతో సమాలోచనలు చేస్తున్నట్టు, ప్రతిపాదనలను కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్​హౌస్​లు మునిగిపోవడం, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వంటి ఘటనల నేపథ్యంలో డ్యామ్​ల సేఫ్టీ కోసం చట్టం తేవాలని సర్కారు భావిస్తున్నది. కావాల్సిన గైడ్​లైన్స్​ను ప్రిపేర్​ చేసే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు.   స్టేట్​ డ్యామ్​ మెయింటెనెన్స్​, ఆపరేషన్స్  అండ్​ సేఫ్టీ యాక్ట్​ (ఎస్​డీఎంఓఎస్​ఏ) పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అది కాకపోతే వేరే పేరునూ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోపు దీనికి సంబంధించిన పూర్తి డ్రాఫ్ట్​ను సిద్ధం చేసి పంపేలా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. 

ఎక్స్​పర్ట్స్​తో టీమ్

రాష్ట్రంలోని 174 డ్యాములు, బ్యారేజీల రక్షణ కోసం అన్నింటినీ చట్టం పరిధిలోకి తీసుకొచ్చేందుకు సర్కారు యోచిస్తున్నట్టు సమాచారం. పైలెట్​ప్రాజెక్టు కింద తొలి రెండేండ్లు ఐదు ప్రాజెక్టులను మానిటరింగ్​ చేసే అవకాశం ఉంది. ఆ ఫలితాలను బట్టి ఆ తర్వాత మిగతా అన్ని డ్యాములు, బ్యారేజీలనూ చట్టం కింద మానిటర్​ చేస్తారని తెలిసింది. డ్యాముల మానిటరింగ్​ కోసం 20 మందితో ఒక కోర్​ టీమ్​ను కూడా ఏర్పాటు చేసే చాన్స్​ ఉంది.  ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లోని జియోగ్రాఫికల్​ ఇన్ఫర్మేషన్​ సిస్టమ్​ (జీఐఎస్​)పై పట్టున్న ఉన్నతాధికారులను కోర్​టీమ్​లో భాగం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.  

ఎప్పటికప్పుడు ఫ్లడ్​ అంచనాలు

డ్యాములు, బ్యారేజీల్లో ఎప్పటికప్పుడు వరదల అంచనాలను తెలుసుకునేలా సరికొత్త పద్ధతిని తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధాన నదులపై ఉన్న డ్యాములు, బ్యారేజీల ప్రాంతాల్లోని క్యాచ్​మెంట్​ ఏరియాలను ఓ గ్రిడ్​గా చేసి అక్కడ కొన్నేండ్ల ఫ్లడ్​ యావరేజ్​ ఆధారంగా రియల్​టైం ఫ్లడ్  అంచనాలను రూపొందించేందుకు చర్యలు చేపడ్తున్నట్లు తెలిసింది. అక్కడి నేల పరిస్థితులు, హైడ్రాలజీ అంశాలపైనా అప్​టు డేట్​ ఉండేలా చూసుకుంటున్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టుగా ఓ సాఫ్ట్​వేర్​ ఆధారంగా మానిటర్​ చేస్తారని తెలిసింది.

ప్రస్తుతం జాతీయ స్థాయిలోనే చట్టం

ప్రస్తుతం జాతీయ స్థాయిలోనే డ్యాముల భద్రతపై చట్టం ఉంది. డ్యామ్​ సేఫ్టీ యాక్ట్​ను 2021లో కేంద్రం తీసుకొచ్చింది. దేశంలోని పది మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తున్న డ్యాములు, బ్యారేజీల భద్రత, పర్యవేక్షణ, ఆపరేషన్​, మెయింటెనెన్స్​ వంటి వాటిని ఈ చట్టం ద్వారా మానిటర్​ చేస్తున్నారు. అయితే, రాష్ట్రాలకు మాత్రం ప్రత్యేకంగా చట్టమంటూ ఏమీ లేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఒక చట్టం తీసుకొస్తే డ్యాములు, బ్యారేజీలను పటిష్ఠంగా నిర్వహించొచ్చన్న ఆలోచనతోనే రాష్ట్ర సర్కారు దీనిపై వేగంగా కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తున్నది. మీడియం, మేజర్​ డ్యాములతో పాటు మైనర్​ ఇరిగేషన్​ ప్రాజెక్టులను కూడా చట్టంలో చేర్చొచ్చన్న ఉద్దేశంతో చట్టం కోసం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.