అమ్ముదామంటే అగ్గువకు అడుగుతున్నరు

అమ్ముదామంటే అగ్గువకు అడుగుతున్నరు
  • రాష్ట్రంలో 45 లక్షల టన్నుల దిగుబడి
  • రూ.1800 లోపే చెల్లిస్తున్న మిల్లర్లు 
  • క్వింటాలుకు రూ.500 పైగా లాస్

మంచిర్యాల, వెలుగు:ధాన్యం కొనుగోళ్లపై మొన్నటిదాకా మొండికేసిన సర్కారు ‘సన్న’ రైతులను నిండా ముంచింది. యాసంగిలో వరి వేయొద్దని, వడ్లు కొనబోమని చెప్పడంతో దిక్కుతోచని రైతులు మిల్లర్లపై ఆశతో సన్నాలు పండించారు. తీరా పంట చేతికొచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. ప్రభుత్వం ఎట్టకేలకు కొనుగోలు కేంద్రాలు తెరిచినా సన్నవడ్లు కొంటలేదు.

దొడ్డు వడ్ల కొనుగోళ్లు పూర్తయ్యాక సన్నాలు సంగతి చూస్తామని ఆఫీసర్లు అంటున్నారు. ఇదే అదునుగా మిల్లర్లు సైతం చేతులెత్తేశారు. అక్కడక్కడ సెంటర్ల నుంచి వచ్చిన సన్నవడ్లను మిల్లుల్లో దించుకోవడం లేదు. నూక శాతం ఎక్కువగా వస్తుందని చెప్పి వాపస్ పంపుతున్నారు.  
క్వింటాలుకు రూ.1800 లోపే... 
ఈ ఏడాది యాసంగిలో రాష్ర్టంలో 36 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. మొత్తం 65 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు అమ్మకానికి వస్తాయని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో 17 లక్షల ఎకరాల్లో సన్నాలు వేయడంతో 35 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుంది. సెంటర్లకు వచ్చే వడ్లలో దాదాపు సగం సన్నాలే. కానీ ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో సన్నాలు కొంటలేరు. రైతులు సెంటర్లలో కుప్పలు పోసి నెలరోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఆఫీసర్లకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటున్నారు.

దిక్కుతోచని రైతులు నేరుగా మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. రైతుల అసహాయతను ఆసరా చేసుకున్న మిల్లర్లు రేటును అమాంతం తగ్గించారు. రెండు మూడేండ్ల కింద మద్దతు ధర కంటే ఎక్కువ రేటుకు కొన్నా, ప్రస్తుతం క్వింటాలుకు రూ.1700 నుంచి రూ.1800 లోపే చెల్లిస్తున్నారు. వాస్తవానికి ఓపెన్ మార్కెట్​లో రూ.2200 నుంచి రూ.2300 ధర ఉంటే తప్ప రైతులకు గిట్టుబాటు కాదు. ఈ లెక్కన క్వింటాలుకు రూ.500లకు పైగా నష్టం రావడంతో పెట్టుబడులు కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. 
పట్టించుకోని సర్కారు
రాష్ర్టంలో మెజారిటీ ప్రజలు సన్నబియ్యం తినడంతో మొదటి నుంచీ వాటికే డిమాండ్ ఎక్కువ. కానీ కేంద్రం సన్నవడ్లు, దొడ్డు వడ్లు అని కాకుండా గ్రేడ్​వన్, కామన్ రకాలుగా విభజించి ఎంఎస్పీ(కనీస మద్దతు ధర) ప్రకటిస్తుంది. దీంతో రెండేండ్ల క్రితం వరకు ఉమ్మడి కరీంనగర్, నల్గొండ తదితర జిల్లాల్లో మిల్లర్లు మద్దతు ధరకు మించి రేటు పెట్టి సన్నాలు కొన్నారు. 2019–20 లో క్వింటాలు వడ్లకు కేంద్రం రూ.1835 ఎంఎస్పీ ప్రకటిస్తే మిల్లర్లు రూ.2300 చెల్లించారు. ఇది ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కన్నా రూ.465  ఎక్కువ. మరుసటి ఏడాది కరోనా వల్ల మార్కెట్లు దెబ్బతిన్నాయనే సాకుతో మిల్లర్లు సన్నవడ్ల రేట్లను ఏకంగా రూ.300 వరకు తగ్గించారు. ఈ దశలో జోక్యం చేసుకొని సన్నవడ్లకు ఎక్కువ రేటు వచ్చేలా చూడాల్సిన రాష్ట్ర సర్కారు ఆ పని చేయలేదు. పైగా కొనుగోలు కేంద్రాల్లో సన్నవడ్లను కొనే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. దీంతో దొడ్డు వడ్లను పండించిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే..సన్నాలు పండించిన రైతులకు వడ్లు అమ్ముకునేందుకు మిల్లర్లు తప్ప వేరే దిక్కులేకుండా పోయింది. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 

మద్దతు ధర ఇప్పించాలె... 
సర్కారు వరి వేయొద్దని చెప్పడంతో బయట అయినా అమ్ముకుందామని 30 ఎకరాల్లో సన్నాలు పెట్టిన. 800 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వడ్లు సెంటర్​లో పోసి నెలరోజులైంది. మిల్లర్లు సన్నాలు దించుకుంట లేరని సెంటర్​లో కొంటలేరు. ఇప్పటికే రెండుసార్లు వానకు వడ్లు తడిసినయి. కుప్పల మీద కప్పనీకి కవర్ల కిరాయి, వడ్లు ఆరబోసుడు, మల్లా కుప్పలు జేయనీకి రూ.50వేల ఖర్చయింది. మిల్లర్లు 1800 కంటే ఎక్కువ రేటు పెడ్తలేరు. కనీసం మద్దతు ధర అయినా ఇప్పించి ఆదుకోవాలె.  - కొట్టె రవి, కర్ణమామిడి

రైతులు లాస్ అయితున్నరు
పడ్తనపల్లి సెంటర్ పరిధిలో చాలా మంది రైతులు సన్నాలు పెట్టిన్రు. నెలరోజుల నుంచి వడ్లు సెంటర్​కు తెస్తున్నరు. కాంటా పెడుదామంటే మిల్లర్లు సన్నాలు తీసుకుంటలేరు. బయట క్వింటాలుకు రూ.1800 లోపే కొంటున్నరు. మద్దతు ధర కూడా రాక రైతులు లాస్ అయితున్నరు. నేను చొరవ తీసుకొని సుల్తానాబాద్​లోని మిల్లర్లతో మాట్లాడిన. క్వింటాలుకు రూ.1900 పెడ్తమన్నరు. రెండు రోజుల్లో కాంటా చేసి పంపుతం. రైతులకు ఎంతో కొంత మేలు జరుగుతది. - రామారావు, పడ్తనపల్లి సింగిల్​విండో చైర్మన్