
భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వా మ్యానికి ఆత్మనిర్భర్ భరతుకు నిలువుటద్దంగా బెంగళూరుకు చెందిన గెలాక్స్ ఐ అనే అంకుర సంస్థ దృష్టి అనే వినూత్న ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే మొదటి బహుళ సెన్సార్ భూపరిశీలన ఉపగ్రహం కావడం విశేషం.
మొదటి ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ప్రయోగించనున్నారు. వచ్చే నాలుగు సంవత్సరాల్లో 8 నుంచి 10 ఉపగ్రహాలతో కూడిన ఒక ఉపగ్రహ మండలిని ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. ఇందులో సింక్ ఫ్యూజ్డ్ ఆస్ట్రోసార్ అనే ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇది సింథటిక్ అపెర్చర్ రాడార్, మల్టీ స్పెక్ట్రల్ సెన్సార్ల నుంచి వచ్చే డేటాను ఏకీకృతం చేస్తుంది.
ఉపగ్రహ వివరాలు
రిజల్యూషన్: 1.5 మీటర్లు. అంటే భూమిపై 1.50 మీటర్ల పరిమాణంలో ఉన్న వస్తువును కూడా స్పష్టంగా గుర్తించగలదు.
ప్రత్యేకత: భారతదేశ ప్రైవేట్ రంగం నిర్మించిన ఉపగ్రహాల్లో ఇదే అతి పెద్దది. అత్యంత ఎక్కువ రిజల్యూషన్ గలది.
అనువర్తనాలు :
సరిహద్దుల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, రక్షణ, వ్యవసాయం, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ వంటి అనేక వ్యూహాత్మక, పౌర అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.
భూ పరిశీలన ఉపగ్రహాలు : ఇవి భూమి భౌతిక, రసాయన, జీవ వ్యవస్థల గురించి సమాచారాన్ని సేకరించడానికి రూపొందించిన ఉపగ్రహాలు. ఇవి సాధారణంగా సూర్య అనువర్తన ధ్రువకక్ష్యలో పరిభ్రమిస్తాయి. తద్వారా ప్రతిరోజూ ఒకే స్థానిక సౌర సమయంలో భూమిలోని ఏ ప్రాంతాన్నైనా గమనించగలవు.