- ప్రస్తుత లీజుదారులకే అమ్మకం.. వాళ్లు కాదంటేనే ఇతరులకు
- అసెంబ్లీలో సవరణ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నడిబొడ్డున అత్యంత విలువైన ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా భూములను సర్కారు అమ్మకానికి పెట్టింది. ఈ భూముల అమ్మకం ద్వారా కనీసం రూ.3 వేల కోట్ల ఆదాయం తెచ్చుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకోసం అసెంబ్లీలో ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా లీజుల రెగ్యులరైజేషన్ సవరణ బిల్లును ప్రవే శపెట్టింది. మంగళవారం ఈ బిల్లుపై సభలో చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా 136 ఎకరాల్లో విస్తరించి ఉంది. వీఎస్టీ, బయోలాజికల్ -ఈతో పాటు పలు సం స్థలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న ఈ పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించాలని గతంలోనే నిర్ణయించారు. దీంతో సవరణ బిల్లును సభ ముందుకు తెచ్చారు.
గజం రూ.1.20 లక్షలు
1918లో ఆజామాబాద్‌లో అప్పటి హైదరాబాద్ సంస్థానం పారిశ్రామికవాడను నెలకొల్పింది. క్రమేణా అక్కడ అనేక పరిశ్రమలు ఏర్పడ్డాయి. 1992లో ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్టానికి సవరణ తెచ్చి లీజులు పునరుద్ధరించారు. ఆ లీజుల కాలవ్యవధి కొంతకాలం క్రితం పూర్తయింది. దీంతో ఇక్కడి పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలికి తరలించి అక్కడ కొత్తగా స్థలాలు అలాట్ చేయనున్నారు. ఇప్పుడు ఆజామాబాద్‌లోని 136 ఎకరాల్లో లీజులు పొంది ఉన్న పారిశ్రామికవేత్తలకే ఆయా స్థలాలపై శాశ్వత హక్కులు కల్పించి రెగ్యులరైజ్ చేయనున్నారు. ఎవరైనా స్థలాలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తే వాటిని వేరే వారికి అసైన్ చేసే అవకాశమున్నట్టు తెలిసింది. ఆజామాబాద్ ఏరియాలో గజం స్థలం ధర రూ.50 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు పలుకుతున్నది. గతంలో ఇండస్ట్రీలకు అప్పగించిన భూమిని గంపగుత్తగా ఆయా సంస్థలకే కట్టబెట్టినా సర్కారుకు రూ.3 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. ఈ సవరణ బిల్లుకు మంగళవారం అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తెలిపిన తర్వాత.. భూముల రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు చెప్తున్నారు.
