ఆదివాసీల కోసం గవర్నర్ కీలక నిర్ణయం

ఆదివాసీల కోసం గవర్నర్ కీలక నిర్ణయం
  • ఆదివాసీలకు బలమైన తిండి పెట్టేందుకు గవర్నర్ చొరవ
  • ఆదిలాబాద్, భద్రాద్రి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని ఆరు గూడేల ఎంపిక
  • రాజ్​భవన్ ఆదేశాలతో ఎన్ఐఎన్, ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, రెడ్​క్రాస్​ సొసైటీ సర్వే
  • పోషకాహారం లేక 55 ఏండ్లకు మించి ఎవ్వరూ బతుకుతలేరని వెల్లడి
  • విషయం తెలిసి చలించిపోయిన తమిళిసై.. న్యూట్రిషన్​ఫుడ్ అందించేలా ప్లాన్

ఆదిలాబాద్, వెలుగు: ఏజెన్సీ జిల్లాల్లో తరతరాలుగా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ఆదివాసీల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ముందడుగు వేశారు. ఐటీడీఏ, ఐసీడీఎస్​ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్రంలో అత్యధికంగా గిరిజనులు ఉండే ఆదిలాబాద్, భద్రాద్రికొత్తగూడెం, నాగర్​కర్నూల్ జిల్లాల్లో నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ (ఎన్ఐఎన్), ఈఎస్ఐ మెడికల్​కాలేజ్, రెడ్​క్రాస్ సొసైటీల సహకారంతో యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. ఈ మూడు జిల్లాల్లో రెండు గ్రామాల చొప్పున ఎంపిక చేసి.. అక్కడ స్థానికంగా దొరికే ఆహారపదార్థాలతో న్యూట్రిషన్ ఫుడ్ అందించేలా కార్యాచరణ రూపొందించారు. ఈ న్యూట్రిషన్​ ప్లాన్​కు సంబంధించి ఇప్పటికే రాజ్​భవన్​లో సంబంధిత ఆఫీసర్లతో రివ్యూలు చేసిన గవర్నర్.. త్వరలో ఈ ఆరు గ్రామాల్లోని గిరిజనులతో భేటీ కానున్నారు.
 

40 ఏండ్లకే వృద్ధుల్లా..
ఆదిలాబాద్ జిల్లాలోని బుర్కి, మంగ్లి.. కొత్తగూడెం జిల్లాలోని గోగులపుడి, పూసుకుంట.. నాగర్​కర్నూల్​జిల్లాలోని అప్పాపూర్, బావురాపూర్ గ్రామాల్లో ఎన్ఐఎన్, ఈఎస్ఐ మెడికల్​కాలేజ్, రెడ్​క్రాస్ సొసైటీ ప్రతినిధులు ఇప్పటికే సర్వే పూర్తిచేశారు. ఇంటింటికీ వెళ్లి తాము పరిశీలించిన అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్​కు వివరించారు. ఈ ఆరు గ్రామాల్లో చేసిన సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. గూడేల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా ఉంది. అక్కడ ఉంటున్న గిరిజనుల్లో ఎవరూ 55 ఏండ్లకు మించి బతకడం లేదు. 40 ఏండ్లకే వృద్ధుల్లా కనిపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే దొడ్డు బియ్యంలో తొక్కు, కారం లాంటివి కలుపుకొని తింటున్నారు. అనారోగ్యమైతే ఆసుపత్రికి పోవడంలేదు. గర్భిణుల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటోంది. ఇండ్లలోనే డెలివరీలు జరుగుతున్నాయి. ప్రతి పది ప్రసవాల్లో పుట్టిన బిడ్డ లేదా తల్లి ఎవరో ఒకరు చనిపోవడం కామన్​గా మారింది. ఇంకా బావి, ఊటనీరే తాగుతున్నారు. ప్రభుత్వం టాయిలెట్స్ కట్టించినా.. మల, మూత్ర విసర్జనకు బయటకే వెళ్తున్నారు. ఈ విషయాలన్నీ తెలిసి గవర్నర్ చలించిపోయారు.

కొన్ని నెలలుగా ఏం ఇస్తలే
ఐటీడీఏ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఇచ్చే పౌష్టికాహారం గిరిజనులకు సరిగ్గా అందడం లేదు. కాంట్రాక్టర్లకు సర్కారు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. దీంతో గర్భిణులు, బాలింతలకు గుడ్లు, పాలు సప్లై కావట్లేదు. కొన్ని నెలలుగా పల్లీపట్టీలు కూడా రావట్లేదు. దీంతో ఏజెన్సీలోని వేలాది మంది గర్భిణులు, బాలింతలు, పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఫలితంగా ఉట్నూర్, ఏటూరు నాగారం, భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని జిల్లాల్లో మాతాశిశు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలకు స్పెషల్ న్యూట్రిషన్ ఫుడ్ అందించి, ఆదివాసీలను ఆదుకోవాలంటూ అనేక జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు సిఫార్సు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

స్పెషల్ మెనూ
ఎన్ఐఎన్​ ఆఫీసర్లతో పలు దఫాలు చర్చించాక పోషకాహార లోపాన్ని నివారించేందుకు న్యూట్రిషన్ ప్లాన్​ను గవర్నర్ తమిళిసై రెడీ చేశారు. అందులో భాగంగా ఈ ఆరు గ్రామాల్లో ఆదివాసీలకు పోషకాహారం ఇవ్వనున్నారు. మహిళలు, పిల్లలకే కాకుండా కుటుంబంలోని అందరికీ ప్రత్యేకంగా రెడీ చేసిన ఫుడ్ అందజేస్తారు. ఇందులో ప్రతి ఒక్కరికీ రోజూ గుడ్డు, పాలు, పల్లీ, నువ్వుల ఉండలు, ఇప్ప పువ్వు లడ్డూలు, చిరుధాన్యాలతో చేసిన వంటకాలు ఉండనున్నట్లు ఓ అధికారి చెప్పారు. ప్రస్తుతం ఈ మెనూపై ఎన్ఐఎన్ కసరత్తు చేస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఫైనల్​ అవుతుందని రాజ్​భవన్​వర్గాలు వెల్లడించాయి. మరుగుదొడ్ల వాడకం, బయటకు వెళ్లొచ్చాక చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవడం లాంటి ఆరోగ్య అలవాట్లను నేర్పిస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు.

బాలింతల వార్డులోకి నల్లత్రాచు
ఇది ఆదిలాబాద్​ రిమ్స్​లోని బాలింతలు, గర్భిణుల (మెటర్నిటీ) వార్డు. చంటిపిల్లల తల్లులు, ప్రసవానికి వచ్చిన వారితో నిండిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ పెద్ద నల్ల త్రాచు పాము ఆ వార్డులోకి వచ్చింది. అంత పెద్ద పామును చూసిన బాలింతలు, గర్భిణులు భయంతో పరుగులు పెట్టారు. దీంతో ఆ పాము బాత్రూంలోకి జొరబడింది. వెంటనే అక్కడున్న వారిని వేరే వార్డుకు తరలించారు. పాములు పట్టేవారిని పిలిపించారు. కానీ, పాము ఎక్కడా కనిపించలేదు. మొన్నటికిమొన్న ఎంఐసీయూలో మంటలు చెలరేగడం, ఇప్పుడు పెద్ద త్రాచు పాము రావడంతో.. ఆస్పత్రి నిర్వహణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం రోగులు, వారి వెంట ఉన్న వారికి ప్రాణ సంకటంగా మారుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
- ఆదిలాబాద్​ అర్బన్​, వెలుగు
 

రాజ్​భవన్​కు తీసుకెళ్తం
ఆదిలాబాద్ ఏజెన్సీ పరిధిలోని గూడేల్లో పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉంది. రాజ్​భవన్ ఆదేశాల మేరకు బుర్కి, మంగ్లి గ్రామాలను న్యూట్రిషన్ ప్లాన్​కు ఎంపిక చేశారు. ఈ గ్రామాల నుంచి 10 మంది చొప్పున త్వరలో రాజ్​భవన్​కు తీసుకెళ్తం. గవర్నర్ తమిళిసై వాళ్లతో మాట్లాడుతారు. ఎన్ఐఎన్ ఎక్స్​పర్ట్స్, డాక్టర్స్ కూడా ఈ మీటింగ్​కు హాజరై, వాళ్లందరికీ సూచనలు, సలహాలు ఇస్తారు.
- విజయ్​బాబు, స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్, రెడ్​క్రాస్ సొసైటీ