రాజస్తాన్ పై గుజరాత్ విక్టరీ

రాజస్తాన్ పై గుజరాత్ విక్టరీ

నావి ముంబై: బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ లో నాలుగో విక్టరీని సొంతం చేసుకుంది. గురువారం రాజస్తాన్ రాయల్స్ ను 37 రన్స్ తేడాతో చిత్తుచేసిన టైటాన్స్ మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (52 బాల్స్ లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 నాటౌట్), అభినవ్ మనోహర్ (28 బాల్స్ లో 43)తో పాటు చివర్లో మిల్లర్ ( 14 బాల్స్ లో 31 నాటౌట్) రాణించడంతో 20 ఓవర్లలో 192/4 భారీ స్కోరు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్ (1/51), చహల్ (1/32), పరాగ్ (1/12) చెరో వికెట్ తీశారు. ఛేజింగ్ లో ఫెర్గుసన్ (3/23), ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న యశ్ దయాల్ (3/40) అదరగొట్టడంతో 20 ఓవర్లలో 155/9 స్కోరు చేసిన రాజస్తాన్ ఓడిపోయింది. బట్లర్ (24 బాల్స్ లో  8 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) మెరుపులు వృథా అయ్యాయి. పాండ్యాకు ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​ లభించింది.

పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్

మొదట బ్యాటింగ్ లో గుజరాత్ కు కెప్టెన్ హార్దిక్ భారీ స్కోరు అందించాడు. 15/2 దశలో క్రీజులోకి వచ్చిన అతడు సూపర్ పెర్ఫామెన్స్ తో జట్టును ఆదుకున్నాడు. ఓపెనర్ వేడ్ (12) మొదటి ఓవర్లోనే మూడు ఫోర్లతో టైటాన్స్ కు దూకుడైన ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ రెండో ఓవర్లోనే అతడు రనౌట్ కాగా, ఆ తర్వాతి ఓవర్లో విజయ్ శంకర్ (2) వెనుదిరగడంతో టైటాన్స్ ఇబ్బందుల్లో పడింది. ఆపై క్రీజులోకి వచ్చిన హార్దిక్, గిల్ (13) తో కలిసి ఇన్నింగ్స్ ను ఆదుకున్నాడు. ఐదో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన పాండ్యా మంచి టచ్ లో కనిపించాడు. వీరి జోరుకు పవర్ ప్లేలో టైటాన్స్ 42/2 తో నిలిచింది. 7వ ఓవర్లో గిల్ ను పరాగ్ పెవిలియన్ పంపాడు. అనంతరం హార్దిక్ తో కలిసిన అభినవ్ మనోహర్.. రాయల్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడటంతో సగం ఓవర్లు ముగిసే సరికి టైటాన్స్ స్కోరు 72/3. 13వ ఓవర్లో మనోహర్ 4, 6 కొట్టగా.. తర్వాతి ఓవర్లో హార్దిక్ రెండు ఫోర్లతో లీగ్ లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి ఓవర్లోనే పడిక్కల్ క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన పాండ్యా రెండు సిక్స్ లతో అలరించాడు. ఇక 16వ ఓవర్లో మనోహర్ వెనుదిరగ్గా.. తర్వాత మిల్లర్ (14 బాల్స్ లో 31 నాటౌట్) జోరు చూపించాడు. ప్రసిధ్ వేసిన 18వ ఓవర్లో 4,4తో పాటు 19వ ఓవర్లో 4,6,4,4తో విరుచుకుపడ్డాడు. చివరి ఓవర్లో 6,4 బాదిన పాండ్యా జట్టుకు భారీ స్కోరు అందించాడు.   

బట్లర్ శుభారంభం ఇచ్చినా..

భారీ ఛేజింగ్ తో బరిలోకి దిగిన రాజస్తాన్ కు ఓపెనర్ బట్లర్ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. ఇన్నింగ్స్ స్టార్టింగ్ లోనే హ్యాట్రిక్ ఫోర్లు బాదిన అతడు రెండో ఓవర్లో 2,4,6 తో విజృంభించాడు. అదే ఓవర్లో పడిక్కల్ (0) డకౌట్ గా వెనుదిరిగాడు. ఇక నాలుగో ఓవర్‌‌‌‌లో బట్లర్  మూడు ఫోర్లు, ఓ సిక్స్ తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అనూహ్యంగా వన్ డౌన్ లో వచ్చిన రవి అశ్విన్ (9)తో పాటు మరో సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్ ను ఆరో ఓవర్లో ఫెర్గుసన్ పెవిలియన్ పంపడంతో పవర్ ప్లేలో రాజస్తాన్ 65/3 స్కోరు చేసింది. ఆపై శాంసన్ (11)ను పాండ్యా డైరెక్ట్ హిట్ తో రనౌట్ చేశాడు. డసెన్ (6)తో పాటు కాసేపు మెరుపులు మెరిపించిన హెట్ మయర్ (29) భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవడంతో 15వ ఓవర్లలో 130/6  స్కోరు చేసిన రాజస్తాన్ విజయానికి చివరి 30 బాల్స్ లో 63 రన్స్ అవసరమయ్యాయి. తర్వాతి ఓవర్లోనే పరాగ్ (18) ఔట్ కాగా.. 17వ ఓవర్లో రషీద్ 7 రన్సే ఇవ్వడంతో విజయ సమీకరణం 18 బాల్స్ లో 48 రన్స్ గా మారింది. 18 ఓవర్లో నీషమ్ (17)ను పాండ్యా ఔట్ చేయగా.. చివరి రెండు ఓవర్లలో 6 రన్సే ఇవ్వడంతో గుజరాత్ విక్టరీ ఖాయమైంది.

సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 192/4 (పాండ్యా 87 నాటౌట్, మనోహర్ 43, పరాగ్ 1/12)  
రాజస్తాన్ : 20 ఓవర్లలో 155/9 (బట్లర్ 54, ఫెర్గుసన్ 3/23, యశ్ దయాల్ 3/40)