ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును అడ్డుకోవాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును అడ్డుకోవాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్​నగర్, వెలుగు: కృష్ణా బేసిన్‎లోని ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు కర్నాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారని, దీన్ని తెలంగాణలో పార్టీలకు అతీతంగా అడ్డుకోవాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ పేర్కొన్నారు. మహబూబ్​నగర్​జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో  చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు నష్టం వాటిల్లుతుందన్నారు. 

కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ఎత్తు పెంపును అడ్డుకోవాలని కోరారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. కర్నాటక జల దోపిడీని అడ్డుకునేందుకు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ నవీన్​కుమార్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్​రెడ్డి, చిట్టెం రాంమోహన్​ రెడ్డి పాల్గొన్నారు.