సింగరేణి ఎన్నికలను అక్టోబర్‌‌ వరకు ఆపండి

సింగరేణి ఎన్నికలను అక్టోబర్‌‌ వరకు ఆపండి
  • హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: సింగరేణి యూని యన్‌‌ ఎన్నికలను అక్టోబర్​ వరకు వాయిదా వేయాల ని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు కొంత గడువు కావాలని యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌‌ను శుక్రవారం జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి విచారణ చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా జిల్లా అధికారులు సింగరేణి ఓటర్ల లిస్ట్‌‌ తయారీకి గడువు కావాలన్న వాదనను ఆమోదించింది. అక్టోబర్‌‌ 1 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని, మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.

పెద్దపల్లి కోర్టు బిల్డింగ్‌‌ భూవివాదంపై కమిటీ

పెద్దపల్లి కోర్టు బిల్డింగ్‌‌ భూవివాదంపై జిల్లా న్యాయాధికారులు, రెవెన్యూ అధికారులు, బార్‌‌ అసోసియేషన్‌‌ సభ్యులంతా చర్చించి ఒక నిర్ణయానికి రావాలని హైకోర్టు సూచించింది. వీరందరితో కలిపి కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.

వీసీగా కరుణాకర్ రెడ్డి కొనసాగింపు ఎందుకు?

పదవీ కాలం ముగిసినా కరుణాకర్ రెడ్డి ఇంకా కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీగా కొనసాగ డాన్ని సవాల్‌‌ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. ఆయనను వీసీ పదవిలో ఇంకా కొనసాగించడానికి ఉన్న అర్హతలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి, చాన్సలర్, రిజిస్ట్రార్లతోపాటు వీసీ కరుణాకర్‌‌రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది.