సడన్‌‌గా లాక్​డౌన్​ అంటే ఎట్ల?

సడన్‌‌గా లాక్​డౌన్​  అంటే ఎట్ల?


హైదరాబాద్, వెలుగు: కరోనా కట్టడి విషయంలో సర్కారు తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులు, లాక్‌‌డౌన్‌‌పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను మంగళవారం అత్యవసరంగా విచారణ చేపట్టింది. చీఫ్‌‌ జస్టిస్‌‌ హిమా కోహ్లి, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిలతో కూడిన బెంచ్​అనేక ప్రశ్నలతో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపింది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్‌‌ మీటింగ్‌‌లో లాక్‌‌డౌన్, కర్ఫ్యూ పొడిగింపు వంటి అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని,  విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేయాలని అడ్వకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌ కోరారు. దీంతో విచారణ మధ్యాహ్నం 2.30కి ప్రారంభం అయ్యాక ఏజీ వాదనలు వినిపిస్తూ.. మే 12 నుంచి పది రోజులపాటు కొన్ని సడలింపులతో లాక్‌‌డౌన్‌‌ పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పడంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీకెండ్‌‌లో లాక్‌‌డౌన్‌‌ గురించి ఆలోచన చేయాలని కోర్టు చెబుతున్నా పది రోజులుగా పట్టించుకోని సర్కారు ఇప్పడు ఒక్కసారిగా లాక్‌‌డౌన్‌‌ ప్రకటిస్తే వేరే రాష్ట్రాలకు వెళ్లే వాళ్ల పరిస్థితి ఏం కావాలని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఓవైపు కరోనా కేసులు తగ్గుతున్నాయని పదే పదే చెబుతూ సడన్‌‌గా లాక్‌‌డౌన్‌‌ విధించడానికి కారణం ఏమిటని నిలదీసింది. ‘లాక్‌‌డౌన్‌‌లో వలస కూలీల పరిస్థితి ఏంటన్నది ఆలోచించారా? గత ఏడాది వాళ్లు పడిన పాట్లు మీకు గుర్తు లేవా. రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ల కష్టాలను దృష్టిలో పెట్టుకుని గతంలో మాదిరిగా కాకుండా ప్రభుత్వం చర్చలుండాలి’ అని సూచించింది. లాక్‌‌డౌన్ పెట్టేముందు వలస కూలీలు వెళ్లిపోయేందుకు ఇతర రాష్ట్రాలు సమయమిచ్చిన విషయాన్ని ప్రస్తావించిన కోర్టు.. తెలంగాణ నుంచి ఎవరైనా అలా వెళ్లాలనుకుంటే సర్కారే రవాణా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

అంబులెన్స్‌‌లు అడ్డుకోవడం దారుణం

‘హైదరాబాద్‌‌ మెడికల్‌‌ హబ్‌‌ అన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిపోకూడదు.  అంబులెన్స్‌‌లలో వస్తున్న పేషెంట్లను ఆపేయడం మానవత్వానికే మచ్చ. మన రాష్ట్రానికి చెందిన వాళ్లు ముంబైలోని ఆస్పత్రులకు వెళ్లడం లేదా? సరిహద్దు జిల్లాల వాళ్లు పక్క రాష్ట్రాల్లోని ఆస్పత్రులకు వెళుతున్నారు కదా’ అని ప్రశ్నించింది. గత నెల 23న జరిగిన విచారణలో రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఆంక్షలు లేవని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మానవత్వం లేకుండా  అంబులెన్స్‌‌లను ఆపడమేంటని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్లను అడ్డుకోవద్దని ఆదేశించింది.

సర్కారు చెప్పేదానికి పొంతనేలేదు

‘55 వేల టెస్ట్‌‌లు చేస్తే 6,500 పాజిటివ్‌‌ కేసులు వచ్చాయంటే కేసులు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా?  రోజూ మరణాలు కూడా పెరుగుతున్నాయి. రాష్ట్ర సర్కారు వాస్తవాల్ని దాచిపెడుతోందని మాకు సమాచారం వస్తోంది. గ్రౌండ్‌‌ లెవెల్‌‌లో వాస్తవాలకు ప్రభుత్వం చెప్పే విషయాలకు పొంతన లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఆక్సిజన్‌‌ అవసరం గతంలో 430 మెట్రిక్‌‌ టన్నుల ఉంటే ఇప్పుడు 600 టన్నుల వరకూ కావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానిని కోరింది. అంటే కేసుల సంఖ్య పెరిగినట్లే కదా? రాష్ట్రంలో కేసులు తగ్గితే బయటి నుంచి వచ్చే అంబులెన్స్‌‌లు ఆపాల్సిన అవసరమేంటి? అధికారిక ఉత్తర్వులు లేకుండా ఎందుకు ఆపారు?’ అని హైకోర్టు ప్రశ్నించింది. 
రంజాన్‌‌ వేడుకల్ని వీడియో తీయండి
‘కుంభమేళాలో ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు పాతబస్తీలో రంజాన్‌‌ పేరుతో అలాగే చేస్తారా? రంజాన్‌‌ను జనం గుమిగూడకుండా నిరాడంబరంగా నిర్వహించుకోవాలని జామియా నిజామియా ఫత్వా జారీ చేసినట్లు ఏజీ చెబుతున్నారే గానీ, పాతబస్తీలో జన సమూహాల కట్టడి చర్యల గురించి మాత్రం చెప్పడం లేదు’ అంటూ సర్కారును హైకోర్టు తప్పుబట్టింది. ఈనెల 14న రంజాన్‌‌ సందర్భంగా ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదని, అయితే రంజాన్‌‌ వేడుకలను వీడియో తీసి తదుపరి విచారణప్పుడుఅఫిడవిట్‌‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

ప్రైవేట్ ఆస్పత్రులకు రేట్ ఫిక్స్ చేయండి

ప్రైవేట్‌‌ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్‌‌మెంట్‌‌కు గరిష్ట ధరలను ప్రభుత్వం నిర్ణయించి ఈ నెల 17లోగా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్‌‌ ఆస్పత్రుల దోడిపీలను అరికట్టాలని చెప్పింది. ఆక్సిజన్‌‌ కొరతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని సూచించింది. ఆక్సిజన్‌‌ కొరత కారణంగా కింగ్ కోఠి సహా ఇతర హాస్పిటల్స్‌‌లో  మరణించిన ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించాలని చెప్పింది.