
వారం కిందట ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భేటీ అయిన ‘కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్’ (సీసీఈఏ).. అరుణాచల్‌ప్రదేశ్‌లో తలపెట్టిన దిబంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది పూర్తైతే 2,880 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే అతి పెద్ద హైడ్రో పవర్ వెంచర్‌గా నిలవనుంది. 278 మీటర్ల హైట్ వరకు కట్టనున్న ఈ డ్యామ్ ప్రపంచంలోనే ఎత్తైన కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్‌గా కూడా రికార్డ్ సృష్టించనుంది.
ఎక్కడ కడతారు? ఎంత ఖర్చు పెడతారు?
ఈ డ్యామ్‌ను అరుణాచల్‌ప్రదేశ్‌లోని లోయర్ దిబంగ్ వ్యాలీ పరిధిలోకి వచ్చే మున్లి అనే ఊరులో దిబంగ్ నదిపై కడతారు. ఈ గ్రామం రోయింగ్ జిల్లా కేంద్రానికి సుమారు 43 కిలో మీటర్ల దూరంలో ఉంది. వెంచర్ అంచనా వ్యయం రూ.28,080.35 కోట్లు. ఈ లోయ ప్రాంతంలో ఇదు మిష్మి అనే గిరిజన తెగ ప్రజలు ఉంటున్నారు. రాష్ట్ర జనాభాలో వీళ్లు 1.3 శాతం వరకు ఉంటారు. లోయర్ దిబంగ్ ఏరియా.. టిబెట్, చైనా బోర్డర్లో ఉంటుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మిష్మి కొండల్లో ప్రవహించే ప్రధాన నదుల్లో దిబంగ్ రివర్ కూడా ఒకటి. దిబంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు 2008 జనవరి 31న ఇటా నగర్లో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం మాత్రమే కట్టట్లేదు. ఇది ఒక స్టోరేజ్ బేస్డ్ హైడ్రో ఎలక్ట్రిక్ వెంచర్. అస్సాంలో బ్రహ్మపుత్ర నది నుంచి వానా కాలంలో ఉప్పొంగే వరదను ఈ ఆనకట్టతో కట్టడి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థ ఎన్హెచ్పీసీకి అప్పగించారు.
ఈ మల్టీపర్పస్ ప్రాజెక్టుకి సీసీఈఏ ఓకే అనటంతో అరుణాచల్‌ప్రదేశ్‌తోపాటు దాని పక్క రాష్ట్రం అస్సాంలోనూ పలు చోట్ల ఆందోళనలు, నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. అస్సాంలో ఈ గొడవలు ఇప్పుడు ప్రారంభమైనవి కావు. 11 ఏళ్ల నుంచి నడుస్తున్నాయి. ఈ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు అప్పటి నుంచే పెద్దఎత్తున పోరాడుతున్నారు. గతంలో రెండు సార్లు తిరస్కరించిన ప్రాజెక్టుకు కేంద్రం తాజాగా అప్రూవల్ ఇవ్వటం పట్ల వాళ్లు ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టుకు ఫౌండేషన్ స్టోన్ వేసి పదేళ్లు దాటినా నిర్మాణ పనుల్లో పురోగతి లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్ఏసీ) ఈ ప్రాజెక్టును తొలిసారి 2013 జూలైలో, రెండో సారి 2014 ఏప్రిల్‌లో తిరస్కరించింది. ఎన్విరాన్మెంటల్ ఇంప్యాక్ట్ అసెస్మెంట్ (ఈఐఏ) రిపోర్టులు, స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్స్ తేడాగా ఉండటాన్ని గమనించి ఈ నిర్ణయం తీసుకుంది. అయినా మోడీ ప్రభుత్వం రీసెంట్గా ఈ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపటం చర్చనీయాంశంగా మారింది.
అనుమతి ఎందుకిచ్చామంటే..
దిబంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి తొమ్మిదేళ్లు పట్టొచ్చని కేంద్రం భావిస్తోంది. 2018 జూన్ ప్రైస్ లెవల్ ప్రకారం ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం రూ.28,080.35 కోట్లు. భవిష్యత్‌లో ఇది మరింత పెరిగి తడిసి మోపెడవుతుందని అంటున్నారు. కాగా ప్రాజెక్టు ప్రి–ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ రూ.1600 కోట్లకి సీసీఈఏ అనుమతిచ్చింది. ఈ డబ్బును స్థానికుల పునరావాసానికి, చెట్ల పెంపకానికి; ప్రాజెక్టు సైట్ వద్దకు వెళ్లే మార్గంలో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి ఖర్చు పెడతామని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ లీడర్ ప్రకాశ్ జవదేకర్ చెప్పారు.
గతంలో రెండు సార్లు రిజెక్ట్ చేసిన ప్రాజెక్టుకు ఇప్పుడెందుకు అనుమతి ఇవ్వాల్సి వచ్చిందనే విషయాలను కూడా ప్రభుత్వం వివరించింది. అవి.. 1. అరుణాచల్‌ప్రదేశ్‌కి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయొచ్చు. 2. మిలిగిన కరెంట్‌ను వేరే రాష్ట్రాలకు, ప్రైవేట్ సంస్థలకు అమ్మి లాభాలు పొందొచ్చు. 3. దేశానికి బోర్డర్లో ఉన్న అరుణాచల్‌ప్రదేశ్ సెంట్రల్ ఫండ్స్ మీద ఆధారపడటాన్ని తగ్గించొచ్చు. సీసీఈఏ సమావేశం అనంతరం కేంద్ర ప్రభుత్వ చేసిన ప్రకటన ప్రకారం ఈ ప్రాజెక్టు నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌కి 13.46 మెగా వాట్ల విద్యుత్‌ను ఫ్రీగా ఇస్తారు.
దిబంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు మొత్తం విద్యుదుత్పత్తిలో ఇది 12 శాతం. దీనికితోడు లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్(ఎల్ఏడీఎఫ్)లో భాగంగా మరొక శాతం (112 మెగా వాట్ల) కరెంట్‌ను స్థానికులకు ఉచితంగా సరఫరా చేస్తారు. దీన్నిబట్టి ఆ రాష్ట్ర ప్రజలు రానున్న 40 ఏళ్లలో (ప్రాజెక్ట్ లైఫ్ టైంలో) టోటల్‌గా రూ.26,785 కోట్లు ప్రయోజనం పొందుతారు. అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఏటా వర్షాకాలంలో వచ్చే వరద నీటిని నిల్వ చేయటం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యాల్లో ఒకటి.
చైనాకి కౌంటరా!!
చైనా.. టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ కడుతోంది. దీనికి రియాక్షన్‌గానే ఇండియా దిబంగ్ ప్రాజెక్టును చేపట్టిందనే వార్తలు కొన్ని మీడియాల్లో వస్తున్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న నదీ వ్యవస్థలో తనకు హక్కుగా రావాల్సిన వాటా నీటిని వాడుకోవటానికే మన దేశం రంగం సిద్ధం చేస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని కేంద్రం ఖండించలేదు. అలాగని ఒప్పుకోనూ లేదు. ప్రస్తుతానికి న్యూట్రల్‌గా ఉంది. ఇండియా, చైనా ఈమధ్య కాస్త క్లోజ్‌గానే ఉంటున్నాయి.
ప్రాజెక్టు కోసం పొలాలను, కమ్యూనిటీ ల్యాండ్‌ను కోల్పోవటంతోపాటు 3.5 లక్షల చెట్లు నరకాలి. ‘ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్–1980’ ప్రకారం చెట్ల పెంపకానికి నిధులు ఇస్తామని కేంద్రం చెబుతున్నా అంత పెద్దఎత్తున మొక్కలు నాటడానికి ప్లేస్ లేదు. ప్రాజెక్టు సైట్.. మెహావో వైల్డ్ లైఫ్ శాంక్చువరీకి దగ్గరగా ఉండటంతో మూగజీవాల మనుగడకు హాని కలుగుతుందని పర్యావరణవేత్తలు ససేమిరా అన్నారు.
హైట్ తగ్గించటంతో లైన్ క్లియర్
దిబంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు హైట్‌ను 10 మీటర్లు తగ్గిస్తూ అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించటంతో ఎఫ్ఏసీ ఎట్టకేలకు లైన్ క్లియర్ చేసింది. ప్రాజెక్టు ఎత్తు పది మీటర్లు కుదించటం వల్ల కోల్పోవాల్సిన అటవీ భూముల విస్తీర్ణం 5,057 హెక్టార్ల నుంచి 4,578 హెక్టార్లకు తగ్గుతుంది. నేల కూల్చాల్సిన చెట్ల సంఖ్య కూడా 3.24 లక్షలకు పరిమితమవుతుంది. మోడీ తొలిసారి ప్రధాని అయిన కొద్ది నెలలకు (2014 సెప్టెంబర్‌లో) పవర్ మినిస్ట్రీ ఒత్తిడికి ఎఫ్ఏసీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్(ఈసీ) ఇవ్వక తప్పలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ‘డ్యామ్ సేఫ్టీ బిల్లు–2019’ ప్రతిపాదనను కూడా సీసీఈఏ ఆమోదించింది. ఈ బిల్లు దేశంలోని స్పెసిఫైడ్ డ్యామ్‌ల వద్ద సర్వైలెన్స్, ఇన్స్పెక్షన్, ఆపరేషన్, మెయింటనన్స్ తదితర సేఫ్టీ మెజర్స్ తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వానికి కల్పిస్తుంది.