నాలుగు దేశాల క్రికెట్‌ టోర్నీ వద్దు

నాలుగు దేశాల క్రికెట్‌ టోర్నీ వద్దు

పీసీబీ చీఫ్‌‌‌‌ రమీజ్‌‌ ప్రతిపాదనకు ఐసీసీ బోర్డు తిరస్కరణ

న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్‌‌‌‌, ఇంగ్లండ్‌‌, ఆస్ట్రేలియా జట్లతో నాలుగు దేశాల క్రికెట్‌‌ టోర్నమెంట్‌‌ నిర్వహణపై ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌ కౌన్సిల్‌‌ (ఐసీసీ) ఏమాత్రం ఆసక్తి చూపెట్టలేదు. పాకిస్తాన్‌‌ క్రికెట్‌‌ బోర్డు( పీసీబీ) చైర్మన్‌‌ రమీజ్‌‌ రాజా తెరపైకి తెచ్చిన ఈ ప్రతిపాదనను ఐసీసీ బోర్డు ఆదివారం ఏకగ్రీవంగా తిరస్కరించింది. దాంతో, చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్‌‌ మధ్య తటస్థ వేదికల్లో  పలు క్రికెట్‌‌ మ్యాచ్‌‌లు జరుగుతాయన్న ఊహాగానాలకు తెరపడింది. ఇక, తన పదవీకాలం పూర్తయ్యే అక్టోబర్ చివరి వరకూ కొనసాగాలని ఐసీసీ చైర్మన్​  గ్రెగర్‌‌ బార్క్‌‌లేను బోర్డు ఒప్పించింది. రెండు రోజుల పాటు జరిగిన బోర్డు మీటింగ్‌‌లో ఈ రెండు కీలక అంశాలతో పాటు మరికొన్ని నిర్ణయాలు వెలువడ్డాయి.  బార్క్‌‌లే అక్టోబర్‌‌ వరకూ కొనసాగితే  కొత్త చైర్మన్‌‌ ఎన్నిక కోసం ఐసీసీ.. నామినేషన్ల ప్రక్రియను మొదలు పెట్టనుంది. ఈ లోపు ఎన్నికల్లో  తమ అభ్యర్థిని నిలబెట్టే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐకి తగిన సమయం లభిస్తుంది. ఐసీసీ చైర్మన్‌‌ అభ్యర్థిగా బీసీసీఐ బాస్​ గంగూలీ, సెక్రటరీ జై షాలో ఒకరు బరిలో నిలిచే చాన్సుంది.  మరోవైపు జై షా.. ఐసీసీ క్రికెట్‌‌ కమిటీలో సభ్యుడిగా చేరారు. శ్రీలంక మాజీ కెప్టెన్‌‌ మహేళ జయవర్దనే మాజీ ప్లేయర్‌‌ హోదాలో తిరిగి నియమితుడయ్యాడు. ఐసీసీ మెన్స్‌‌ క్రికెట్‌‌ కమిటీ సిఫారసుకు అనుగుణంగా.. వచ్చే సీజన్‌‌ నుంచి ప్రతి టెస్టులో ఒక న్యూట్రల్‌‌ అంపైర్​ తిరిగి బాధ్యతలు నిర్వహించనున్నాడు. జనవరిలో జరిగే అండర్‌‌19 విమెన్స్‌‌ వరల్డ్‌‌కప్‌‌ తొలి ఎడిషన్‌‌ ఆతిథ్య హక్కులను ఐసీసీ బోర్డు సౌతాఫ్రికాకు కేటాయించింది. అలాగే, 2024 మెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌కప్‌‌ క్వాలిఫికేషన్‌‌ ప్రకియను కూడా ఐసీసీ ప్రకటించింది. మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. ఈ ఏడాదిజరిగే టీ20 వరల్డ్‌‌కప్‌‌లో టాప్‌‌8 టీమ్స్‌‌తో పాటు ఆతిథ్య జట్లుగా వెస్టిండీస్‌‌, యూఎస్‌‌ఏ నేరుగా క్వాలిఫై అవుతాయి. ఆపై, ఈ ఏడాది నవంబర్‌‌ 14వ తేదీ నాటికి ర్యాంకింగ్స్‌‌ ఆధారంగా మరో రెండు టీమ్స్‌‌ అర్హత సాధిస్తాయి.