అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్​ ఓటమి

అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్​ ఓటమి
  • సభలో అర్ధరాత్రి ఓటింగ్​.. అవిశ్వాస తీర్మానంలో ఓటమి

ఇస్లామాబాద్: శనివారం అర్ధరాత్రి జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్​ ఖాన్​ సర్కారు ఓటమి పాలైంది. పాక్​ నేషనల్​ అసెంబ్లీలో ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరి వరకూ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్​ నిర్వహణను వాయిదా వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. విదేశీ కుట్రలో పాలుపంచుకోలేమంటూ స్పీకర్​, డిప్యూటీ స్పీకర్​ తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ప్యానల్​ స్పీకర్​ అయాజ్​ సాధిక్​ ఓటింగ్​ నిర్వహించారు. అధికార పార్టీ సభ్యులు వాకౌట్​ చేశారు. ఇందులో ఇమ్రాన్​ ఖాన్​పై అవిశ్వాసానికి సభ మద్దతు లభించిందని ప్యానల్​ స్పీకర్ ప్రకటించారు. కొత్త ప్రధానిగా పీఎంఎల్-ఎన్ ప్రెసిడెంట్ షెహబాజ్​ షరీఫ్ ఎన్నికయ్యే అవకాశం ఉంది.

అర్ధరాత్రి దాకా హైడ్రామా
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శనివారం నేషనల్​ అసెంబ్లీలో హైడ్రామా నడిచింది. ఓటింగ్​ పెట్టేందుకు చివరి నిమిషం వరకూ ఇమ్రాన్​ ఖాన్​ నేతృత్వంలోని పాకిస్తాన్​ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) ప్రభుత్వం ససేమీరా అంది. తొలుత ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తుల కుట్రపై సభలో చర్చ జరపాలని డిమాండ్​ చేసింది. చర్చకు అంగీకరించని ప్రతిపక్షాలు అవిశ్వాసంపై ఓటింగ్​ పెట్టాలని పట్టుబట్టడంతో సభలో గందరగోళం చెలరేగి పలుమార్లు వాయిదా పడింది. 

రోజంతా టెన్షన్.. టెన్షన్..
అవిశ్వాసంపై డిప్యూటీ స్పీకర్​ నిర్ణయాన్ని, నేషనల్​అసెంబ్లీని రద్దుచేస్తూ ప్రెసిడెంట్​ఇచ్చిన ఆదేశాలను పాకిస్తాన్​​ సుప్రీంకోర్టు కొట్టేసింది. నేషనల్​ అసెంబ్లీ రద్దు చెల్లదని ప్రకటించిన న్యాయస్థానం.. శనివారం అవిశ్వాసంపై ఓటింగ్​ పెట్టాలని స్పీకర్​ అసద్​ ఖైసర్​ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 10.30 గంటలకు నేషనల్​ అసెంబ్లీ ప్రారంభమైంది. సభకు ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ హాజరుకాలేదు. సభ ప్రారంభం కాగానే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అవిశ్వాసంపై ఓటింగ్​ పెట్టాలని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, పీఎంఎల్-ఎన్ ప్రెసిడెంట్ షెహబాజ్​ షరీఫ్​ డిమాండ్​ చేశారు. స్పీకర్​ అసద్​ ఖైసర్​ మాత్రం విదేశీ కుట్రపై చర్చ చేపడతామని ప్రకటించడంతో ప్రతిపక్ష సభ్యులు ఇమ్రాన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీ అర్ధరాత్రి వరకూ వాయిదాలపై వాయిదాలు పడుతూ సాగింది. 342 మంది సభ్యులున్న పాక్​ నేషనల్​ అసెంబ్లీలో మేజారిటీ దక్కాలంటే 172 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ మిత్రపక్షాలు గుడ్​బై చెప్పడంతో ఇమ్రాన్​ సర్కారు మైనార్టీలో పడింది. పీటీఐ పార్టీ మీటింగ్​కు 98 మంది మాత్రమే హాజరయ్యారు. 22 మంది తిరుగుబాటుదారులు ఇమ్రాన్​కు వ్యతిరేకంగా ఉన్నారు. ఇమ్రాన్​ను గద్దె దించడానికి అవసరమైన మెజారిటీ తమకుందని 
పీపీపీ పార్టీ చెప్పింది.

రంగంలోకి ఆర్మీ బలగాలు
శనివారం రాత్రి ఇమ్రాన్​ఖాన్​ అత్యవసరంగా కేబినెట్​ మీటింగ్​ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్​లో ఇమ్రాన్​ మంత్రుల అభిప్రాయం తీసుకున్నారు. కోర్టు ఆదేశాలు పాటించకపోతే ఎదురయ్యే పరిణామాలపై చర్చించారు. చివరికి రాత్రి 10 గంటల తర్వాత ఇమ్రాన్ ​ఖాన్​ నేషనల్​ అసెంబ్లీలోని తన చాంబర్​కు చేరుకున్నారు. అంతకు ముందు ప్రధాని నివాసంలో ఇమ్రాన్​తో స్పీకర్​ సమావేశమై తాజా పరిస్థితులపై చర్చలు జరిపా రు. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో పార్లమెంట్​ వెలుపలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్మీ బలగాలు భారీ సంఖ్యలో ఇస్లామాబాద్​లో మోహరించాయి. ఇస్లామాబాద్, లాహోర్ తదితర నగరాల్లో ఇమ్రాన్​కు అనుకూల, వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. మరోవైపు చివరి నిమిషం వరకూ అవిశ్వాసంపై ఓటింగ్​ నిర్వహించకపోవడంతో అర్ధరాత్రి తర్వాత పాకిస్తాన్​ సుప్రీంకోర్టు అత్యవసరంగా సమావేశమైంది. తమ ఆదేశాలను స్పీకర్​ పాటించకపోవడంపై కోర్టు ధిక్కరణ కింద విచారణ జరిపింది. కాగా, అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధమన్న డిప్యూటీ స్పీకర్​ నిర్ణయాన్ని రద్దు చేయడంపై ఇమ్రాన్​ ఖాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో 
రివ్యూ పిటిషన్​ వేసింది.

For More News..

నేను భారతీయుడిని.. తెలుగువాడిని, తెలంగాణవాడిని

యాదాద్రి నిర్మాణంలో వంద లోపాలు ఉన్నాయి