మాజీ మంత్రి సబిత చాంబర్ నుంచి సామగ్రి తరలించే యత్నం

మాజీ మంత్రి సబిత చాంబర్ నుంచి సామగ్రి తరలించే యత్నం
  • మాజీ మంత్రి సబిత చాంబర్ నుంచి సామగ్రి తరలించే యత్నం
  • మీడియా రావడంతో పరారైన ఉద్యోగులు
  • వాచ్ మెన్ ఫిర్యాదుతో కేసు నమోదు

బషీర్ బాగ్, వెలుగు : రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన అనంతరం ప్రభుత్వ కార్యాలయాలు, మాజీ మంత్రుల చాంబర్ల నుంచి పైళ్లు, ఫర్నీచర్ ఎత్తుకెళ్తున్న ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా బషీర్​బాగ్ లోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ కార్యాలయంలో కూడా శనివారం సాయంత్రం ఆటోలో సామగ్రి తరలించడానికి చేసిన ప్రయత్నం బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది. 

ఇదే కార్యాలయంలోని మూడో అంతస్థులో ఎన్నికల ముందు వరకు విద్యాశాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాంబర్, ఆఫీసు ఉండేది. భవనంలోని నాలుగో అంతస్తులో రాష్ట్ర విద్య, సంక్షేమం మౌలిక వసతుల కల్పన సంస్థ ప్రధాన కార్యాలయం కూడా ఉంది. మొన్నటివరకు చైర్మన్ గా రావుల శ్రీధర్ రెడ్డి కొనసాగారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎవరి కార్యాలయం నుంచి ఈ తరలింపు ప్రయత్నం చేశారనేది తేలాల్సి ఉంది. అయితే రెండో శనివారం సెలవు రోజు అయినప్పటికీ రెండు రోజుల క్రితమే కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. సాయంత్రం ఐదు తర్వాత ఉద్యోగులందరూ విధులు ముగించుకుని వెళ్లిన తర్వాత రాజు అనే వ్యక్తి ఓ లాజిస్టిక్ ఆటోను తీసుకుని వచ్చాడు. 

ఇద్దరు వేరే వ్యక్తులను బైక్ లపై రప్పించి ముందుగా సిద్ధం చేసిన ఆటోలో సామగ్రిని తరలించేందుకు సిద్ధం చేశారు. అయితే ఇదంతా గమనించిన అదే కార్యాలయం ఉద్యోగి మీడియాకు సమాచారమిచ్చాడు. దీంతో మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లేసరికి వారు అక్కడి నుండి ఉడాయించారు. అయితే రాజు అనే వ్యక్తి అక్కడే ఉండి మొదట బుకాయించే ప్రయత్నం చేశాడు. చివరికి షరీఫ్ అనే ఉద్యోగి సూచనలతోనే తాము ఆటోలో నాలుగో అంతస్తు, మూడో అంతస్తులో ఉన్న సామగ్రిని ఆటోలో తరలిస్తున్నామని చెప్పాడు. కాగా, బషీర్ బాగ్ లోని ఆర్జేడీ బిల్డింగ్ లోని విద్యాశాఖ మాజీ మంత్రి కార్యాలయం నుంచి కొంత మంది ఉద్యోగులు ఫర్నీచర్ ఎత్తుకెళ్లేందుకు యత్నించినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ డీ శ్రీనివాస్ తెలిపారు.