నేడు నింగిలోకి 9 శాటిలైట్లు

నేడు నింగిలోకి 9 శాటిలైట్లు

ఇయ్యాల నింగిలోకి 9 శాటిలైట్లు

ఈవోఎస్-6తో పాటు 8 నానో శాటిలైట్లను పంపనున్న ఇస్రో  

బెంగళూరు:  ఈ ఏడాది ఆఖరి పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగానికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సర్వం సిద్ధం చేసింది. శనివారం ఉదయం 11.56 గంటలకు ఏపీలోని శ్రీహరికోట నుంచి చేపట్టే పీఎస్ఎల్వీ–సీ54 రాకెట్ లాంచింగ్ కు శుక్రవారం ఉదయం 25.30 గంటల కౌంట్ డౌన్ ను ఇస్రో ప్రారంభించింది. ఈ మిషన్ లో మొత్తం 9 శాటిలైట్లు నింగికి చేరనున్నాయి. ఇందులో భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్–6 (ఒషియన్ శాట్–6)తో పాటు మరో 8 నానో శాటిలైట్లు ఉన్నాయి. ముందుగా ప్రధాన శాటిలైట్ అయిన ఓషియన్ శాట్–6ను 742 కిలోమీటర్ల ఎత్తులోని ఆర్బిట్1లోకి రాకెట్ చేరుస్తుంది. ఆ తర్వాత రాకెట్ కిందకు దిగుతూ 516 నుంచి 528 కిలోమీటర్ల మధ్య ఆర్బిట్2లో మిగతా ప్యాసింజర్ శాటిలైట్లను వేర్వేరుగా విడిచిపెట్టనుంది. ఇలా వేర్వేరు ఆర్బిట్లలోకి శాటిలైట్లను చేర్చడం కోసం రాకెట్ కు ప్రత్యేకంగా రెండు ఆర్బిట్ చేంజ్ థ్రస్టర్లను అమర్చారు. ఇది పీఎస్ఎల్వీ రాకెట్ కు 56వ మిషన్ కాగా, పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ వెర్షన్ లో 24వ ప్రయోగం.  

నింగికి చేరే శాటిలైట్లు ఇవే.. 

ఓషియన్ శాట్–2 స్థానంలో సేవలు అందించేందుకు ఓషియన్ శాట్–6 శాటిలైట్ ను ఇస్రో పంపుతోంది. ఇది సముద్రపు రంగు, గాలులు, ఇతర అంశాలకు సంబంధించిన డేటాను నిరంతరం అందించనుంది. మిగతా 8 ఉపగ్రహాల్లో ‘ఇస్రో నానో శాటిలైట్ 2 ఫర్ భూటాన్ (ఐఎన్ఎస్2బీ)’, బెంగళూరుకు చెందిన పిక్సెల్ ఇండియా స్టార్టప్ కంపెనీకి చెందిన ‘ఆనంద్’, హైదరాబాద్ కు చెందిన స్పేస్ స్టార్టప్ ‘ధ్రువ స్పేస్’కు చెందిన రెండు ‘థైబోల్ట్’ నానో శాటిలైట్లు, అమెరికన్ కంపెనీ స్పేస్ ఫ్లైట్ కు చెందిన నాలుగు ‘ఆస్ట్రోక్యాస్ట్’ నానో శాటిలైట్లు ఉన్నాయి.