ఇండియాలో పెండ్లి కాని ప్రసాదులే ఎక్కువ

ఇండియాలో పెండ్లి కాని ప్రసాదులే ఎక్కువ
  • సోలో బతుకే బెటరని కొందరు.. 
  • సెటిల్ అయ్యాకే చేసుకోవాలని ఇంకొందరు..
  • పిల్ల దొరక్క సింగిల్‌‌గా మిగిలిపోతున్నోళ్లూ ఎక్కువే
  • సంతానం విషయంలోనూ మారిన ధోరణి.. 
  • ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నరు
  • శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే రిపోర్ట్‌‌లో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: యువతకు పెండ్లిపై కాయిష్ తగ్గుతున్నది. ‘సోలో బతుకే సో బెటర్’ అనుకుంటున్నోళ్ల సంఖ్య పెరుగుతున్నది. లైఫ్‌‌లో సెటిల్ అయిన తర్వాతే పెండ్లి చేసుకుందామనుకుని కొందరు, అసలు పెండ్లే వద్దు అనే ధోరణిలో మరికొందరు ఉంటున్నారు. తమ కులాల్లో అమ్మాయిలు లేక 35 ఏండ్లు వచ్చినా పెండ్లి కాని ప్రసాదులుగా మిగిలిపోతున్న వాళ్లూ ఉంటున్నారు. ఇలా పెండ్లి కానోళ్ల జనాభా ఆరేండ్లలో నాలుగున్నర శాతం పెరిగింది. రాష్ట్రంలో 2014 నాటికి 42.9 శాతం ఉన్న పెండ్లి కానోళ్ల జనాభా.. 2020 నాటికి 47.4 శాతానికి చేరింది. పిల్లల్ని కనే విషయంలోనూ జనాలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ‘మనం ఇద్దరం.. మనకు ఇద్దరు’ అని కాకుండా.. ఎక్కువ మంది ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు. 2014లో 1.8 శాతం ఉన్న టోటల్ ఫర్టిలిటీ రేటు (టీఎఫ్‌‌ఆర్‌‌‌‌).. ఆరేండ్లలో 1.5 శాతానికి తగ్గిపోయింది. రాష్ట్రంలో ప్రతి వంద మంది మహిళలు ఎంత మంది పిల్లల్ని కంటున్నారనే లెక్క ఆధారంగా టీఎఫ్‌‌ఆర్ నిర్ణయిస్తారు. 2014లో ప్రతి వంద మంది మహిళలు సగటున 180 మందిని కంటే.. ఇప్పుడీ సంఖ్య 150కి తగ్గిపోయినట్టు టీఎఫ్‌‌ఆర్‌‌‌‌ ద్వారా తెలుస్తున్నది. మన రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా పెండ్లి, పిల్లల విషయంలో జనాల అభిప్రాయం ఇలానే ఉంది. హోమ్ అఫైర్స్‌‌ మినిస్ర్టీ మూడు రోజుల క్రితం రిలీజ్ చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే–2020 రిపోర్ట్‌‌లో పెండ్లి, పిల్లల విషయానికి సంబంధించిన పలు అంశాలను వెల్లడించింది. 

దేశంలో 2014 నాటికి పెండ్లి కానోళ్ల సంఖ్య 46.6 శాతం ఉంటే, తాజా సర్వే నాటికి ఈ సంఖ్య 51.6 శాతానికి చేరింది. వయసుతో సంబంధం లేకుండా, మొత్తం జనాభాను ప్రతిపాదికగా తీసుకుని ఈ లెక్కలు రూపొందించినట్టు రిపోర్ట్‌‌‌‌లో పేర్కొన్నారు.

పెండ్లి కాని ప్రసాదులే ఎక్కువ

పెండ్లి కాని వారిలో ఆడవాళ్ల కంటే, మగవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. దేశంలో 56.7 శాతం మగవాళ్లకు, 46.2 శాతం ఆడవాళ్లకు పెండ్లిళ్లు కాలేదు. మన రాష్ట్రంలో ఈ సంఖ్య 53: 41గా ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాతే పెండ్లి చేసుకోవాలని మగపిల్లలు భావిస్తుండడం.. మంచి సంపాదన ఉన్న అబ్బాయిలనే చేసుకునేందుకు ఆడపిల్లలు ఇష్టపడుతుండడంతో పెండ్లికాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతున్నది. లైఫ్‌‌‌‌లో సెటిల్ అయిన తర్వాతే పెండ్లి చేసుకోవాలని అమ్మాయిలు కూడా అనుకుంటున్నా.. అబ్బాయిలతో పోలిస్తే వీరి సంఖ్య తక్కువే. ఆడపిల్లల పెండ్లిళ్ల విషయంలో తల్లిదండ్రులు తొందరపడడమే ఇందుకు కారణం. మరోవైపు అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం వల్ల కూడా కొన్ని కులాల్లో అబ్బాయిలకు పెండ్లిళ్లు కావడం లేదు. దీంతో ఆయా కులాల్లో 30, 35 దాటినా పెండ్లికాక అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారు.

ఒక్కరితోనే సరి

పిల్లల్ని కనే విషయంలో యువత ధోరణి మారిపోయింది. సుమారు పాతిక శాతం జంటలు ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మొదటి సంతానంలో మగ పిల్లాడు పుడితే.. రెండో బిడ్డ గురించి ఆలోచించడం లేదు. ఆర్థిక కారణాల వల్ల కూడా ఆడపిల్లైనా, మగ్గపిల్లాడైనా ఒక్కరు చాలనుకుంటున్నారు. అది కూడా 30 ఏండ్ల తర్వాతే పిల్లల కోసం ప్లాన్లు చేసుకుంటున్నారు. కొంతమంది రెండో బిడ్డ కోసం ప్రయత్నించినా జీవనశైలి.. వయసు 35 దాటడం వల్ల ఫర్టిలిటీ సమస్యలతో సంతానం కలగడం లేదు. దీంతో టీఎఫ్‌‌‌‌ఆర్ మన రాష్ట్రంలో తగ్గుతున్నది. 2014 నుంచి 2020 నాటికి ఆరేండ్లలో 0.3 శాతం మేర టీఎఫ్‌‌‌‌ఆర్ తగ్గింది. దేశంలో 2014లో 2.3 ఉన్న టీఎఫ్‌‌‌‌ఆర్.. 2020 నాటికి 2 శాతానికి వచ్చింది. ఈ సంఖ్య తగ్గుతున్నదే తప్ప పెరగడం లేదు. అర్బనైజేషన్‌‌‌‌, మహిళల అక్షరాస్యతను బట్టి టీఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌లో మార్పులు ఉన్నట్టు సర్వేలో తేలింది. దేశంలో చదువుకోని మహిళల్లో టీఎఫ్‌‌‌‌ఆర్ 3.1 శాతం ఉంటే, డిగ్రీ అంతకంటే ఎక్కువ చదివిన మహిళల్లో 1.6 శాతం మాత్రమే ఉంది. మహిళల ఎడ్యుకేషన్ లెవల్స్ పెరుగుతున్న కొద్దీ పిల్లల్ని కనే విషయంలో అభిప్రాయాలు మారుతున్నట్టు సర్వే పేర్కొంది.