కాంగ్రెస్ లో కుమ్ములాటల కల్లోలం 

కాంగ్రెస్ లో కుమ్ములాటల కల్లోలం 

తెలంగాణ కాంగ్రెస్ లో నాయకుల అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డిపై చాలా మంది సీనియర్లు గుర్రుగా ఉన్నారు. వీలు చిక్కినప్పుడల్లా విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు జిల్లా నాయకుల మధ్య అంతర్గత కలహాలు కాకరేపుతున్నాయి. అలకలు, అసంతృప్తులు, కొట్లాటలు, ఘర్షణలు, ఒకరిపై మరొకరు ఫిర్యాదులు, తిట్ల దండకాలు.. ఇవి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ను కాక రేపుతున్నాయి. అసలింతకు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది..? 

రాష్ర్టంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో రాష్ర్టంలో అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు రాజకీయాలు చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం చతికిలపడుతోందనే చర్చ సాగుతోంది. పార్టీలో నాయకుల మధ్య అంతర్గత విబేధాలు తరచూ భగ్గుమంటున్నాయి. ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదులతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ కేంద్రంగా అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. చాలామంది నాయకులు ఠాగూర్ తీరును తప్పుపడుతూ.. గత కొంతకాలంగా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇటు పీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి తీరును కూడా తూర్పార పడుతున్నారు.

పార్టీలో అసలేం జరుగుతోంది..? 
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పార్టీలో నేతల మధ్య విబేధాలు తరచూ భగ్గుమంటున్నాయి. చాలా మంది సీనియర్లు రేవంత్ రెడ్డి తీరును తప్పుపడుతూ వస్తున్నారు. పార్టీ పరంగా ఆయన తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన నిర్వహించే సమావేశాలు, కార్యక్రమాలకు చాలా మంది నేతలు దూరంగా ఉంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో దాదాపు అన్ని పార్టీల్లోనూ ఉప ఎన్నిక సెగలు రాజుకున్నాయి. 

హీటెక్కిస్తున్న మునుగోడు ఉపఎన్నిక

ముఖ్యంగా మునుగోడు సీటు కాంగ్రెస్ దే. దాంతో ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని, రాబోయే ఎన్నికలకు సిద్ధమవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఉప ఎన్నికను అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. కానీ, రాష్ర్టానికి చెందిన చాలామంది పెద్దగా పట్టించుకోవడం లేదు. మునుగోడు ఉప ఎన్నికను చాలా తెలీగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే గాంధీభవన్ లో మాణిక్కం ఠాగూర్ సమావేశాలకు చాలామంది ముఖ్య నాయకులు డుమ్మాకొట్టారు. ముఖ్యంగా మునుగోడు అసెంబ్లీ వ్యూహ ప్రచార కమిటీలో ఉన్న మధుయాష్కీ కూడా హాజరుకాకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇదే కార్యక్రమంలో ఏఐసీసీ పొగ్రామ్స్ ఇన్ చార్జ్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మందలించారు. పార్టీ కార్యక్రమాలతో పాటు బలోపేతం కోసం పని చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

టీ కాంగ్రెస్ లో కల్లోలం
తాజాగా కాంగ్రెస్ అధిష్టానానికి ఏఐసీసీ పొగ్రామ్స్ ఇన్ చార్జ్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాలుగు పేజీల లేఖ రాశారు. మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ.. వారిపై ఫిర్యాదు చేశారు. పార్టీలో జరుగుతున్న అన్ని విషయాల గురించి చెప్పినా ఠాగూర్ తనను అవమానించారంటూ లేఖలో పేర్కొన్నారు.  ఏడాది నుంచి తాను చేసిన కార్యక్రమాల గురించి చెప్పినా.. సరిగ్గా పని చేయడం లేదంటూ అందరి ముందు అవమానించారని ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఏఐసీసీ పొగ్రామ్స్ ఇన్ చార్జ్ గా తనకు ఏ మాత్రం స్వేచ్ఛ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ పొగ్రామ్స్ ను స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే చూస్తూ..ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారని చెప్పారు. 

మర్రికి అద్దంకి సూచన

మరోవైపు రేవంత్ రెడ్డి,మాణిక్కం ఠాగూర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి చేసిన కామెంట్స్ ను తాజాగా అద్దంకి దయాకర్ తీవ్రంగా ఖండించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడకూడదంటూ సూచించారు. తాను ఎంపీ కోమటిరెడ్డి బ్రదర్స్ పై చేసిన వ్యాఖ్యలపై మళ్లీ మళ్లీ స్పందించి.. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడడం తగదన్నారు. ఆ విషయం సమసిపోయేలా చేయాలి గానీ, పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడవద్దన్నారు. 

మర్రి శశిధర్ రెడ్డి నిన్న ఏమన్నారంటే..

కాంగ్రెస్​లో కల్లోలానికి రాష్ట్రంలో పార్టీని నడిపిస్తున్న, పర్యవేక్షణ చేస్తున్న వారే కారణమని మర్రి శశిధర్​రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ హైకమాండ్​కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉంటూ పార్టీకి నష్టం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్​ మాణిక్కం ఠాగూర్‌‌ వ్యవహార శైలితో పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతోందన్నారు. ‘‘మాణిక్కం ఠాగూర్‌‌ చేతిలో రేవంత్‌‌రెడ్డి పనిచేస్తున్నట్టు లేదు. ఠాగూరే.. రేవంత్‌‌ చేతిలో పని చేస్తున్నట్టు ఉంది. రేవంత్​కు ఏజెంట్​​లా ఠాగూర్​ మారినట్లు ఉంది” అని శశిధర్​రెడ్డి విమర్శించారు. రాహుల్‌‌ గాంధీకి తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి విషయంలో రేవంత్ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదన్నారు. 

జడ్చర్ల కాంగ్రెస్ లో జగడం 

అగ్ర నాయకుల మధ్య అంతర్గత కలహాలు ఒకవైపు.. నియోజకవర్గాల్లో ఇన్ చార్జుల మధ్య విబేధాలు ఇంకోవైపు పార్టీని రచ్చకెక్కిస్తున్నాయి. తాజాగా జడ్చర్ల నియోజకవర్గంలో సీనియర్ నేత  అనిరుధ్ రెడ్డి, ఎర్ర శేఖర్ మధ్య పొసగడం లేదు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడలేనట్లుగా జడ్చర్లలో ఈ ఇద్దరి నేతల మధ్య అస్సలు పొసగడం లేదు. తాజాగా  రాష్ర్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్కు జడ్చర్ల పార్టీ ఇన్చార్జ్ అనిరుధ్ రెడ్డి  లేఖ రాశారు. నియోజకవర్గంలో ఎర్ర శేఖర్ తనను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. తొమ్మిది మర్డర్ కేసుల్లో నిందితుడుగా ఉన్న ఎర్రశేఖర్ తో ఒకే వేదిక పంచుకోలేనంటూ లేఖలో పేర్కొన్నారు. సొంత తమ్ముడినే హత్య చేశాడనే ఆరోపణలను ఎర్ర శేఖర్ ఎదుర్కొంటున్నాడని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం అనిరుధ్ రెడ్డి లేఖ కాంగ్రెస్ లో చర్చనీయంశమైంది. 

గందరగోళంలో కాంగ్రెస్ శ్రేణులు
అగ్ర నాయకులు అంతర్గత కలహాలతో పార్టీకి నష్టం చేస్తుంటే కిందిస్థాయి నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. కొందరు నాయకులు పార్టీకి నష్టం చేకూర్చేలా మాట్లాడుతుండడం వల్ల, మరికొందరు నాయకులు కాంగ్రెస్ వీడి ఇతర పార్టీల్లోకి వెళ్తుండడం వల్ల కార్యకర్తల్లో అసంతృప్తి, నిరుత్సాహం పేరుకుపోతోంది. నేతల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలను సర్ది చెప్పాల్సిన సీనియర్ నాయకులే.. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం, ఫిర్యాదులు చేసుకోవడం ఏంటని చాలామంది కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.