లిక్కర్ స్కాంపై నోరెత్తని గులాబీ లీడర్లు కూతురు పరామర్శకు వెళ్లని కేసీఆర్

లిక్కర్ స్కాంపై నోరెత్తని గులాబీ లీడర్లు కూతురు పరామర్శకు వెళ్లని కేసీఆర్
  • ఈడీ టు సీబీఐ కస్టడీకి మారినా సైలెంట్
  • కాంగ్రెస్ టార్గెట్ గానే మాజీ మంత్రుల విమర్శలు
  • లోక్ సభ ఎన్నికల్లో నెగెటివ్ అవుతుందనేనా?
  • మెల్లిగా దూరమైన కుటుంబ సభ్యులు!
  • బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చర్చ

హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ కూతురు.. బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత కవిత విషయం క్రమంగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. మార్చి 15వ తేదీన ఆమెను హైదరాబాద్ లో ఈడీ అరెస్టు చేసినప్పుడు హడావుడి చేసిన నేతలంతా క్రమంగా దూరమయ్యారు. వాదనకు దిగిన వాళ్లంతా సైలెంటయ్యారు. ఆమె వెంటనడిచిన లీడర్లు వాళ్ల పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు. అరెస్టు అక్రమం ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఈడీ ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగిన కేటీఆర్.. అరెస్టు సమయంలో పరుగుపరుగున వచ్చిన హరీశ్ రావు అంతా ఇప్పుడు కవిత విషయమే మాట్లాడటం లేదు. 

అరెస్టు అక్రమమని చెప్పినోళ్ల ఫోకసంతా ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలపై పడింది. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అని భావిస్తూ హస్తం పార్టీపైనే విమర్శలు చేస్తున్నారు. రాజకీయ వేదికలపై కూడా మాటమాత్రానికి కూడా కవిత అంశాన్ని ప్రస్తావించడం లేదు. లిక్కర్ స్కాం కేసును ప్రస్తావిస్తే నెగెటివ్ అవుతుందనే మాట్లాడటం లేదా..? అన్న చర్చ గులాబీ పార్టీలో అంతర్లీనంగా సాగుతోంది. దాదాపు అన్ని సెగ్మెంట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్ లో నిర్వహించిన సభకు సాక్షాత్తూ మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆరే హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. 

తిట్ల పురాణం అందుకున్నారు. కానీ బిడ్డ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు.  ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లిన మాజీ మంత్రి స్వయానా ఆమె మేన బావ హరీశ్ రావు, సోదరుడు కేటీఆర్ అక్కడే రెండు రోజులుండి పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చారు. మధ్యలో ఓ సారి కవిత తల్లి శోభమ్మ తో కలిసి ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ కవితను పరామర్శించారు. తర్వాత మళ్లీ వెళ్లకపోవడం గమనార్హం. ఇక్కడే పార్టీ  కార్యక్రమాల్లో కేటీఆర్, హరీశ్ రావు బిజీ అయిపోయారు. 

ఢిల్లీ వెళ్లని కేసీఆర్
ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి దాదాపు  నెల రోజులు కావస్తున్నా.. తన కూతురు కవితను పరామర్శించేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లలేదు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన కృష్ణా జలాలపై  నల్లగొండ సభలో నిర్వహించిన సభకు వెళ్లారు. కరీంనగర్ లో వినోద్ కుమార్ కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల మీటింగులకు హాజరయ్యారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించారు  తప్ప హస్తిన వెళ్లే ప్రయత్నం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని మీడియా వద్దగానీ, అటు బహిరంగ సభల్లో కానీ ప్రస్తావించడం లేదు. ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. 

ఎన్నికల్లో నెగెటివ్ అవుతుందని భయమా?
కవిత పేరును ప్రస్తావిస్తే లోక్ సభ ఎన్నికల్లో నెగెటివ్ అవుతుందని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు భయపడుతున్నారా..? అనే చర్చ మొదలైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితే సూత్రధారి అంటూ సీబీఐ నిన్న కస్టడీ అప్లికేషన్లో ప్రస్తావించింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన  కోర్టు మూడు రోజుల కస్టడీకి ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ అగ్రనాయకులు అయోమయంలో పడిపోయారు. దీనిపై ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం.