ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ తో ఐటీ రంగానికి గడ్డుకాలం

ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ తో ఐటీ రంగానికి గడ్డుకాలం

ఆర్థిక మాంద్యం భయాలు మొదలైనప్పటి నుంచి ఐటీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. చాలా వరకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. క్లయింట్స్ తగ్గిపోయారు. ఇదే సమయంలో చాలా వరకు దిగ్గజ ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఉద్యోగులను తీసేయడంతో పాటు.. కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్స్ ఇచ్చి చేర్చుకోవడంలో జాప్యం చేస్తున్నాయి. వారిని వేతనాలు తగ్గించుకొని చేరాలని చెబుతున్నాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులకు రావాల్సిన ప్రోత్సాహకాలను కూడా తగ్గిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, ఆర్థికమాంద్యం హెచ్చరికలతో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ లేఆఫ్స్‌కు తెరలేపాయి. గతేడాది నుంచి ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపు గతేడాది కంటే మించిపోయింది. దీంతో 2023 సంవత్సరం ఐటీ ఉద్యోగులకు కలిసిరాలేదని చెప్పవచ్చు.

గత ఏడాదితో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 7.7% తగ్గిపోయింది. మార్చితో దాదాపు 60 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో జాబ్స్ కోల్పోయారని రిక్రూట్‌మెంట్ బాడీ మంగళవారం (మే 23న) తెలిపింది. "ఐటి రంగంలో కొత్త ఉపాధి కల్పన తగ్గడం, ఐటి నియామకంలో ప్రపంచ మందగమనానికి అద్దం పడుతోంది" అని దేశవ్యాప్తంగా 120 రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా వివరించారు. అయినప్పటికీ, తయారీ, లాజిస్టిక్స్, రిటైల్ రంగాలలో నియామకాలు కొనసాగుతున్నాయని, దేశీయ వినియోగదారుల డిమాండ్‌కు ఇది సహాయపడిందని చెప్పారు.

ఆర్థిక మాంద్యానికి కారణం.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో రాబోయే కొన్ని నెలల్లో థర్డ్-పార్టీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు తక్కువ స్థాయిలో జరిగే అవకాశ ఉండవచ్చని భాటియా పేర్కొన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, (CMIE), ముంబైకి చెందిన థింక్ ట్యాంక్ ప్రకారం... దేశంలో ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు వరుసగా నాలుగో నెలలో 8.11%కి పెరిగింది. ఇది అంతకు ముందు నెలలో 7.8% నుండి 8.11%కి పెరిగింది.