కృష్ణా, భీమా నదులపై 3 రోడ్ కమ్ బ్యారేజీలు

కృష్ణా, భీమా నదులపై 3 రోడ్ కమ్ బ్యారేజీలు
  • నేడు కర్నాటక ఇరిగేషన్ మంత్రితో కలిసి సీఎం రేవంత్ ఏరియల్ ఇన్​స్పెక్షన్
  • రూ.1,400 కోట్లతో మూడు బ్యారేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు
  • రెండు రోజుల పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 
  • సీఎం పర్యటన.. ప్రాజెక్టుల పరిశీలన

మహబూబ్​నగర్, వెలుగు:  ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువన కృష్ణా, భీమా నదులపై కర్నాటక, తెలంగాణ ప్రభుత్వాలు మూడు రోడ్ కం బ్యారేజీలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల సెక్రటేరియేట్​లో కర్నాటక ఇరిగేషన్ శాఖ మంత్రి బోసురాజుతో సీఎంతో పాటు ఇక్కడి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చలు జరిపారు. తాజాగా ఈ మూడు బ్యారేజీలకు తెలంగాణ సీఎంతో పాటు కర్నాటక సీఎం అంగీకరించడంతో నిర్మాణానికి అడుగులు పడ్తున్నాయి. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటనలో భాగంగా మొదట ఈ మూడు ప్రతిపాదిత బ్యారేజీలను కర్నాటక ఇరిగేషన్ మంత్రితో కలిసి ఏరియల్ ఇన్​స్పెక్షన్ చేయనున్నారు. కాగా, కర్నాటకలో కృష్ణానదిపై అక్కడి ప్రభుత్వం 2017లో గూగల్ బ్యారేజీ నిర్మించింది. 

ఈ బ్యారేజీ వల్ల ఆ ప్రాంతంలో సాగునీటితో పాటు వేసవిలో తాగునీటికీ ఇబ్బందులు తొలిగాయి. ప్రస్తుతం కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. తెలంగాణలోనూ ఇదే పార్టీ పవర్​లో ఉంది. దీంతో రెండు రాష్ర్టాలు కలిసి సంయుక్తంగా జూరాల ఎగువన నారాయణపేట జిల్లా కృష్ణా మండలం కొల్పూరు, -కొడ్తికొండ గ్రామాల మధ్య కృష్ణా నదిపై 1.08 టీఎంసీల కెపాసిటీతో ఒకటి, భీమా నదిపై కుసుమర్తి-, సుకూర్‌లింగంపల్లి గ్రామాల మధ్య 0.4 టీఎంసీల కెపాసిటీతో మరొకటి, తంగిడి వద్ద 0.4 టీఎంసీల కెపాసిటీతో ఇంకో రోడ్ కమ్ బ్యారేజీలను నిర్మించనున్నాయి. వీటి ద్వారా రెండు రాష్ర్టాల్లోని సరిహద్దు ప్రాంతాల మండలాలకు తాగునీరు, సాగునీరు అందడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. వీటి నిర్మాణానికి రూ.1,400 కోట్లు అవుతుందని అంచనా వేయగా, ఇందులో రూ.750 కోట్లు కేవలం కృష్ణానదిపై నిర్మించే బ్యారేజీకే ఖర్చవుతుందని చెప్తున్నారు. మిగతా రూ.650 కోట్లతో భీమా నదిపై రెండు బ్యారేజీల నిర్మాణానికి ఖర్చవుతుందని అంచనా వేశారు.  

రేపు ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద భారీ బహిరంగ సభ 

సీఎం రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం వరకు ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించనున్నారు. అనంతరం జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం గూడెందొడ్డి హెలీప్యాడ్‌కు చేరుకుని స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. ఆపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం కొల్లాపూర్‌లోని మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసంలో బ్రేక్ ఫాస్ట్ అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు పంప్‌హౌస్‌కు సీఎం, మంత్రులు చేరుకుంటారు. 

పాలమూరు--–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ-3 హెడ్ రెగ్యులేటర్, ప్యాకేజీ-2 నార్లాపూర్ రిజర్వాయర్, ప్యాకేజీ-1 డెలివరీ సిస్టం, ఎంజీకేఎల్‌ఐఎస్ లిఫ్ట్-1 పంప్‌హౌస్‌లను పరిశీలిస్తారు. నార్లాపూర్ హెలీప్యాడ్ నుంచి బయలుదేరి పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్యాకేజీ-3 కాలువ పనులు, ఏదుల రిజర్వాయర్, పంప్‌హౌస్ పనులను ఏరియ‌ల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. అనంతరం పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్యాకేజీ-8 స్టేజ్-3 పంప్‌హౌస్, వట్టెం రిజర్వాయర్‌కు సంబంధించిన ప్యాకేజీ 9, 10, 11 పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం కర్వెన రిజర్వాయర్ ప్యాకేజీ- 14, 15  పనులను పరిశీలిస్తారు. మీడియా సమావేశం అనంతరం సాయంత్రం ఉదండాపూర్ రిజర్వాయర్ 17, 18 ప్యాకేజీల పనులను పరిశీలించి ఉదండాపూర్ వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు  

సీఎం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పర్యటనలో నేపథ్యంలో బుధవారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. జూపల్లి జడ్చర్లలోని కల్వకుర్తి క్రాస్ వద్ద హెలీప్యాడ్ స్థలాన్ని, భద్రతా ఏర్పాట్లను రాష్ర్ట ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్​నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. గంగాపూర్ ఏరియా ఆసుప‌త్రి వ‌ద్ద స‌భ ఏర్పాట్లను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, పోలీసులకు పలు సూచనలు చేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి కర్వెన రిజర్వాయర్ వద్ద కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్​ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించి, అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా మక్తల్​లోని మహాత్మా జ్యోతి బాపూలే బీసీ వెల్ఫేర్ స్కూల్ గ్రౌండ్లో సీఎం పర్యటనపై అధికారులతో సమీక్షించారు.