పుడ్ సరిగా లేదంటూ కేజీబీవీ రెసిడెన్షియల్ స్టూడెంట్స్ కన్నీళ్లు

పుడ్ సరిగా లేదంటూ కేజీబీవీ రెసిడెన్షియల్ స్టూడెంట్స్ కన్నీళ్లు

ఎల్బీనగర్, వెలుగు : వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వినోభానగర్‌‌‌‌లో కేజీబీవీ రెసిడెన్షియల్ స్డూడెంట్లు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ‘‘బాత్ రూమ్‌‌కు వెళ్లేందుకు కూడా నీళ్లు లేవు. పీరియడ్స్ వస్తే నీళ్లు లేక అట్లనే ఉండిపోవాల్సి వస్తున్నది” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘హాస్టల్‌‌లో ఫుడ్డు సక్కగ ఉండదు. వాష్ రూమ్స్ క్లీన్ చేయరు. బుధవారం నుంచి మాకు ఫుడ్డు లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. 

తమ హాస్టల్‌‌లో సమస్యలను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. కనీస వసతులు లేకుండా చదవలేకపోతున్నామని కన్నీరుమున్నీరయ్యారు. ఇక్కడ చదవలేక చాలా మంది టీసీలు తీసుకుని వెళ్లిపోయారని చెప్పారు. నీళ్లు లేవని వాటర్ ట్యాంకర్ వారికి ఫోన్ చేస్తే ‘మీ మేడం డబ్బులు కట్టలేదు’ అని చెబుతున్నారని వాపోయారు. ఒకే ప్లేట్‌‌లో తాము తినాల్సిన పరిస్థితి ఉందని, కొన్నిసార్లు ఒకపూట తిని ఒక పూట తినడం లేదని, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఎలాంటి సౌలత్​లు లేవని, ఎలా చదువుకోవాలో అర్థం కావడం లేదని చెప్పారు.

విద్యార్థి సంఘాల మద్దతు
నిరసన తెలుపుతున్న స్టూడెంట్స్‌‌కు ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతు తెలిపారు. వారితో పాటు రోడ్డుపై బైఠాయించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు. విద్యార్థులను అక్కడి నుంచి పంపించేందుకు వచ్చిన కొంత మంది టీఆర్ఎస్ నాయకులకు, విద్యార్థి సంఘ నాయకులకు మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం జరిగింది.