ఆదిభట్లలో కిడ్నాప్ కు గురైన యువతి సేఫ్

ఆదిభట్లలో కిడ్నాప్ కు గురైన యువతి సేఫ్

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి కిడ్నాప్ కేసులో పురోగతి కనిపించింది. తాను క్షేమంగానే ఉన్నానంటూ తమ తండ్రికి కిడ్నాప్ కు గురైన యువతి ఫోన్ చేసి చెప్పింది. దీంతో యువతి ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు ఆమె తండ్రిని తీసుకుని వెళ్లారు. ఈ కేసులో నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. 

అసలేం జరిగింది..? 
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం ఓ యువతి కిడ్నాప్ నకు గురైందనే వార్త కలకలం రేపింది. తమ కూతురుని నవీన్ రెడ్డి అనే వ్యక్తి ఇంటికి వచ్చిదాడి చేసి, తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తూర్కయాంజల్ మున్సిపాలిటీ రాగన్న గూడలో ఈ ఘటన జరిగింది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తమ కూతురిని మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి తీసుకెళ్లాడని యువతి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 100 మందికిపైగా యువకులతో నవీన్ రెడ్డి.. తమ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులపై దాడిచేసి తమ కూతురిని బలవంతంగా తీసుకెళ్లాడని చెప్పారు. ఇంట్లోని సీసీ కెమెరాలు, ఇతర సామాగ్రిని నవీన్ తో వచ్చిన మనుషులు ధ్వంసం చేశారని తెలిపారు. అడ్డు వచ్చిన వారందరిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గతంలోనే నవీన్ రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అయినప్పటికీ యువతిని కొంతకాలంగా నవీన్ రెడ్డి వేధిస్తున్నాడని చెబుతున్నారు. నవీన్ రెడ్డి కొంతమంది మనుషులతో తమ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్న సమయంలో పోలీసులకు, 100కు కాల్ చేసినా స్పందించలేదని యువతి తల్లిదండ్రులు ఉదయం ఆరోపించారు. 

విషయం తెలియగానే వెంటనే ఘటనాస్థలానికి ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు వెళ్లారు. అక్కడి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని ఏసీపీ ఉమామహేశ్వరరావు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుల ఇంట్లో పలు చోట్ల రక్తపు మరకలను గుర్తించారు. ఈ ఘటనలో దాదాపు10 కార్లు ధ్వంసమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మరోవైపు.. యువతి కుటుంబ సభ్యులు, బంధువులు సాగర్ హైవేపై ధర్నాకు దిగారు. దీంతో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆదిభట్ల సీఐ నరేందర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. సాగర్  రోడ్ పై ధర్నా చేపట్టారు. తమ బిడ్డ ఆచూకీ తెలపాలని డిమాండ్ చేశారు. 

నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం : రాచకొండ అడిషనల్ సీపీ 


యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై కఠిన సెక్షన్లు అమలు చేశామని, నిందితులపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు. కిడ్నాప్ కు గురైన యువతిని క్షేమంగా కాపాడేందుకు పోలీసు ప్రత్యేక బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని అంతకుముందు చెప్పారు. ఈ సమయంలో అన్ని వివరాలను చెబితే దర్యాప్తునకు ఆటంకం ఏర్పడుతుందని చెప్పారు. అంతకుముందు.. తమ కూతురిని రక్షించాలంటూ రాచకొండ అదనపు కమిషనర్ సుధీర్ బాబు కళ్లపై యువతి తల్లి పడి ప్రాధేయపడింది.