
లీడర్ల చుట్టాలకు సర్వీస్ పెంపుపై యూనియన్ల ఆగ్రహం
సోషల్ మీడియాలోనూ టీజీవో, టీఎన్జీవో లీడర్లపై విమర్శలు
హైదరాబాద్, వెలుగు: టీజీవో, టీఎన్జీవో ముఖ్య నేతల బంధువులకు రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ ను పొడిగించడంపై పలువురు ఉద్యోగులు, టీచర్లు, పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన రిటైర్మెంట్ ఏజ్ సడలింపు హామీ భజనపరుకే వర్తిస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. రిటైర్మెంట్ వయస్సు పెంపును అందరికీ వర్తింపజేయాలని నేతలు డిమాండ్ చేశారు. ‘ఉద్యోగ సంఘాల చుట్టాలకు నజరానా’శీర్షికతో ‘వెలుగు’దినపత్రిక ప్రచురించింది. సోషల్ మీడియాలోనూ టీజీవో, టీఎన్జీవో నేతలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
హామీ ఏమైంది: ఎస్టీయూ
2018 ఎన్నికల్లో రిటైర్మెంట్ ఏజ్ ను పెంచుతామని కేసీఆర్ ప్రకటించారని, రెండేండ్లవుతున్నా అది అమలులోకి రాలేదని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందంగౌడ్, పర్వతరెడ్డి విమర్శించారు. అందరికీ దక్కాల్సిన సడలింపులు ప్రభుత్వ భజనపరులకే సొంతం చేయడం అన్యాయమని, అందరికీ దీనిని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ఇదేం పక్షపాతం: యూటీఎఫ్
ఉద్యోగులపై పక్షపాతం సరికాదని, రిటైర్మెంట్ ఏజ్ పెంపును అందరికీ వర్తింపజేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి కోరారు. రిటైర్మెంట్ వయసును పెంచుతామని హామీ ఇచ్చి 20 నెలలు గడిచిందని, ఈ కాలంలో పదివేల మందికిపైగా రిటైర్ అయ్యారని గుర్తుచేశారు.
ఆ లీడర్లు తప్పుకోవాలె: తపస్
దొంగచాటుగా తమ కుటుంబీకులకు సర్వీస్ పెంచుకున్న టీఎన్జీవో, టీజీవో నేతలు వెంటనే యూనియన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు, నవాత్ సురేశ్డిమాండ్ చేశారు.
సర్వీస్ పెంచుకోవడం సిగ్గుచేటు: టీపీఆర్టీయూ
సంఘాల లీడర్లు వారి కుటుంబీకులకే సర్వీసు పొడించుకోవడం సిగ్గుచేటని పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్థన్‌రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రశ్నించాల్సిన నాయకులు వ్యక్తిగత పనుల కోసం సీఎం దగ్గర సాగిలపడుతున్నారని ఆరోపించారు.
రిటైర్మెంట్ వయసు పెంచాలె: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
ఉద్యోగ, టీచర్లకు రిటైర్మెంట్ వయసును 60 ఏండ్లకు పెంచాలని టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు రెండోసారి లేఖ రాశారు. కొన్ని శాఖల్లో తమకు ఇష్టమొచ్చిన వ్యక్తులకే 60 ఏండ్లకు రిటైర్‌మెంట్ పెంచుతున్నారని ఆరోపించారు.
టీఎన్జీవో నేతల సర్వీసు ఎలా పొడిగిస్తరు?: రాంచందర్ రావు
పీఆర్సీ, ఐఆర్ ఇచ్చేందుకు మనసొప్పని సీఎం కేసీఆర్ కు టీఎన్జీవో నేతల సర్వీసు పొడిగింపుపై అంత ఆసక్తి ఎందుకని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ప్రశ్నించారు. ఎందరో ఉద్యోగులు, టీచర్లకు ప్రమోషన్లు రాలేదని, సర్వీసు పొడిగించాలని మరెందరో విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. ఒకరిద్దరు టీఎన్జీవో నేతల సర్వీసు మాత్రం పొడిగించారన్నారు. టీఎన్జీవో నేతల కుటుంబసభ్యులు, బంధువులకు మాత్రమే సర్వీసు ఎలా పొడిగిస్తారని ప్రశ్నించారు.
సంఘాల లీడర్ల పనులే చేస్తరా?: వంశీచంద్ రెడ్డి
ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉద్యోగులు, టీచర్లను కేసీఆర్ పట్టించుకోవడం లేదని, ఉద్యోగ సంఘాల నాయకులకు మాత్రం పనులు చేసిపెడుతూ మచ్చిక చేసుకుంటున్నారని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. ఓ మహిళా నాయకురాలి బంధువుకు, ఓ రాష్ట్ర నాయకుడి చుట్టానికి గుట్టుచప్పుడు కాకుండా రెండేండ్లు సర్వీస్ పొడిగిస్తూ దొడ్డిదారిన జీవో ఇవ్వడం ఏంటన్నారు. ఉద్యోగుల హక్కులను పణంగా పెట్టి కొందరు లీడర్లు పబ్బం గడుపుకుంటున్నారన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి