హుస్నాబాద్​లో  ‘డబుల్​’ ఇండ్లు పంపిణీకి రెడీ..

హుస్నాబాద్​లో  ‘డబుల్​’ ఇండ్లు పంపిణీకి రెడీ..

సిద్దిపేట/కోహెడ, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో డబుల్​బెడ్​రూమ్​ఇండ్ల లిస్టుపై లొల్లి జరుగుతోంది. వచ్చిన మొత్తం దరఖాస్తులను వడపోత పడితే జాబితాలో అనర్హుల పేర్లే ఉంటున్నారని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఐదేండ్ల తరువాత ఇండ్ల పంపిణీ చేయనున్నారు. రెండు విడతలుగా మొత్తం 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరయ్యాయి. పట్టణ శివార్ల లో జీ ప్లస్ టూ పద్ధతిలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టినా అవి నత్తనడకన సాగుతూవచ్చాయి. మున్సిపాలిటీలోని 20 వార్డులకు చెందిన అర్హులైన పేదల నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా మొత్తం 1426 దరఖాస్తులు అందాయి.

ప్రస్తుతం 280 ఇండ్లు మాత్రమే రెడీ అయ్యాయి. దరఖాస్తులను పరిశీలించిన ఆఫీసర్లు 489 మందితో రెండు రోజుల కింద ఒక లిస్టును విడుదల చేశారు. ఇందులో అనర్హులకు చోటు లభించిన విషయాన్ని గమనించిన పేదలు ఆఫీసర్ల తీరుపై మండిపడుతున్నారు. సర్వే చేసేటప్పుడు విరాలను సరిగా సేకరించలేదని విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు నాయకులు తమకు అనుకూలమైనవారి  పేర్లు వచ్చేలా చూశారనే ఆరోపిస్తున్నారు. వ్యవసాయ భూములు ఉన్న వారికి, గతంలో లబ్ధిపొందిన వారికి, ఇండ్లున్న వారి పేర్లే లిస్ట్​లో ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఆందోళనల బాట.. పలు పార్టీల మద్దతు 

లిస్టులో జరిగిన అవకతవకలపై లబ్ధిదారులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే సీపీఐ, బీజేపీ నాయకులు వారికి మద్దతు తెలిపి ఆందోళనలు ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ఫిర్యాదులు స్వీకరించడానికి కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఇవ్వడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదుదారులకు  పది రోజుల గడువు ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. ఏదైమేనా అర్హులకే ఇండ్లు ఇవ్వాలని, ఇందుకోసం ఎన్ని పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేస్తున్నారు. 

అర్హులకే ఇండ్లు కేటాయించాలి

అర్హులైన పేదలకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలి. హుస్నాబాద్​మున్సిపాలిటీలో విడుదల చేసిన లిస్టులో అనర్హుల పేర్లే ఎక్కువగా ఉన్నాయి.  ఈ విషయాన్ని సీపీఐ ఆధ్వర్యంలో పూర్తి పరిశీలన జరిపి  గుర్తించాం. అందుకు పేదల పక్షాన నిలబడి ఆందోళన చేస్తున్నాం. - గడిపే మల్లేశ్, సీపీఐ నేత, హుస్నాబాద్

అనర్హులుంటే తొలగిస్తాం.. 

లబ్ధిదారుల లిస్టులో అనర్హుల పేర్లు ఉంటే పరిశీలించి తొలగిస్తాం. ఇందుకోసం మూడు రోజులపాటు ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కోసం మున్సిపల్, తహసీల్దార్ ఆఫీసుల్లో ప్రత్యేకంగా బాక్స్ లను ఏర్పాటు చేస్తున్నాం. గడువు లోపు అనర్హుల పేర్లు వివరాలతో ఫిర్యాదు చేస్తే వారిపై రీ ఎంక్వైరీ చేసి చేర్యలు తీసుకుంటాం. - రాజమల్లయ్య, మున్సిపల్ కమిషనర్, హుస్నాబాద్