రుణాల టార్గెట్​ పూర్తి చేయాలి :సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్

రుణాల టార్గెట్​ పూర్తి చేయాలి  :సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి టౌన్ , వెలుగు :  బ్యాంకర్లు రుణాల టార్గేట్​ను పూర్తి చేయాలని  సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్​ హాల్​లో జూన్ వరకు జరిగిన  రుణ ప్రగతిపై బ్యాంకర్లతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం పంట రుణాల లక్ష్యాన్ని సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని  సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు మంజూరైన పెండింగ్ యూనిట్లను ఈ నెలాఖరులోగా గ్రౌండింగ్ చేయాలని కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యం ఈ నెలలో 50 శాతం అచీవ్ కావాలని చెప్పారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రుణాలు అందించాలని బ్యాంకర్లను కోరారు. కొత్త పరిశ్రమలు స్థాపనకు అర్హులైన లబ్ధిదారులకు  లక్ష్యం మేరకు పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ  రుణాలు అందించాలన్నారు. పెన్షన్, రైతుబంధు, ఎస్సీ, ఎస్టీల సబ్సిడీలు లాంటివి అప్పు కింద జమ చేసుకోవద్దని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి 
జూన్ నెలాఖరు వరకు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ, ప్రాధాన్యత, ప్రాధాన్యేతర  రంగాలకు సంబంధించి మొత్తం రూ.2494.97 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు ఎల్ డీఎం గోపాల్ రెడ్డి తెలిపారు. సమావేశంలో జిల్లా లీడ్  మేనేజర్ గోపాల్ రెడ్డి, నాబార్డ్ ఏజీఎం  క్రిష్ణ తేజ, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జేడీ నరసింహారావు, పరిశ్రమల శాఖ మేనేజర్ ప్రశాంత్,  మెప్మా పీడీ గీత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మత్స్య, ఉద్యాన తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

నేడు, రేపు ఓటర్ ప్రత్యేక శిబిరాలు

ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ నెల  26, 27, సెప్టెంబర్ 2,  3 తేదీల్లో  ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ శరత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక శిబిరాల రోజులలో జిల్లా లోని అన్ని పోలింగ్ కేంద్రాలలో బూత్ స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5  గంటల వరకు ఓటరు జాబితాతో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.