సూర్యాపేట జిల్లాలో మరో ఐదు మిల్లుల్లో అవకతవకలు

సూర్యాపేట జిల్లాలో మరో ఐదు మిల్లుల్లో అవకతవకలు

సూర్యాపేట, వెలుగు:జిల్లాలో మిల్లర్ల మాయాజాలం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. బుధవారం కోదాడ మండలం కాపుగల్లులోని శ్రీ ఉషశ్విని పారాబాయిల్డ్​ మిల్లులో సీఎంఆర్​కు అందించిన వడ్లు మాయం చేసి మిల్లు యాజమాని చేతులెత్తివేసిన విషయం వెలుగులోకి రాగా, గురువారం మరో 5 మిల్లులో నిల్వలు లేవని  తేలింది. ఈ వడ్ల విలువ సుమారు రూ.138.50 కోట్లు ఉంటుందని అధికారులు చెప్తున్నారు.  

బ్లాక్‌ లిస్టులో 8 మిల్లులు

2020-–21 రబీ, 2021-–22 ఖరీఫ్​, రబీ సీజన్లలో జిల్లాలోని 72 మిల్లులకు అధికారులు వడ్లు కేటాయించారు. 2020–-21యాసంగి , 2021–-22 వానాకాలం సీజన్‌ సీఎంఆర్‌ సేకరణకు ప్రభుత్వం పదేపదే గడువు పెంచుతూ మిల్లర్లకు అవకాశమిచ్చింది. అయినా 2020–-21 రబీలో 6 మిల్లులు 18,880 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్​ను, 2021–-22 వానాకాలంలో 38 మిల్లులు 93,141 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్​ను బకాయి పడ్డారు. 2020–-21 రబీలో సీఎంఆర్ ​పెండింగ్ ​మిల్లులతో పాటు 2021–-22 వానాకాలంలో అవుట్‌స్టాండింగ్‌లో ఉన్న మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టి సీఎంఆర్​ సేకరించాలని సివిల్‌ సప్లయీస్​ కమిషనర్​ఆదేశించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లాలోని 8 మిల్లులను అధికారులు  బ్లాక్‌లిస్టులో పెట్టారు. 

బహిరంగ మార్కెట్​లో అమ్ముకున్నరు 

 ప్రభుత్వం రైతుల నుంచి కొని సీఎంఆర్​కోసం మిల్లులకు అందించిన రూ.138.50 కోట్ల విలువైన వడ్లను కొందరు మిల్లర్లు బహిరంగ మార్కెట్ లో అమ్మకున్నట్టు తెలిసింది. సీఎంఆర్​ తీసుకున్న ఉషశ్విని పారాబాయిల్డ్, లక్ష్మి సహస్ర, సంతోషిమాత, ఎంకేఆర్, వెంకటేశ్వర, భువనేశ్వరి, శివదుర్గ, సోమేశ్వర మిల్లులను సకాలంలో సీఎంఆర్ ​పెట్టకపోవడంతో అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టారు. ఇందులో శివదుర్గ, సోమేశ్వర మిల్లులు సీఎంఆర్​ పూర్తి చేశాయి. మరో ఆరు మిల్లులు ఇవ్వకపోవడంతో ఇక్కడ వడ్ల నిల్వలు లేనట్టు గుర్తించారు.  

రెండు మిల్లులపై ఆర్‌ఆర్‌ యాక్ట్‌  

జిల్లాలోని ఆరు మిల్లుల్లో రూ. 138.50 కోట్ల విలువ చేసే వడ్లను మాయం చేశారు. వీటిలో ఉషశ్విని పారాబాయిల్డ్​ రైస్​ మిల్​.32.50 కోట్ల విలువ చేసే వడ్లు,  లక్ష్మి సహస్ర మిల్లు రూ. 35 కోట్లు, సంతోషిమాత రూ. 38 కోట్లు, ఎంకేఆర్‌రూ. 25 కోట్లు, వెంకటేశ్వర రూ. 18 కోట్లు, భువనేవ్వరి మిల్లులో రూ. 2 కోట్ల విలువ చేసే వడ్లు మాయమైనట్టు తెలుస్తోంది. ఇందులో  నిర్ణీత సమయానికి సీఎంఆర్‌  ఇవ్వని ఉశష్విని, లక్ష్మి సహస్ర మిల్లులపై  క్రిమినల్‌ కేసు నమోదు చేసి ఆర్‌ఆర్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  మిగిలిన నాలుగు మిల్లుల్లో వడ్లు లేకున్నా  వారికి కేటాయించిన టైం వరకు ఆగాలని కమిషనర్ ఆదేశించడంతో చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. 

రికవరీ చేస్తున్నాం

జిల్లాలో ఆరు మిల్లుల్లో వడ్లు మాయమైనట్లు గుర్తించాం. వాటిని రికవరీ చేసేందుకు కమిషనర్  సమయం ఇచ్చారు. గడువులోపు రైస్ ఇవ్వని మిల్లులపై కేసులు నమోదు చేస్తున్నాం. ఇప్పటి వరకు రెండు మిల్లులపై కేసులు నమోదు చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం మిల్లర్ల ఆస్తులను జప్తు చేశాం. 
 పుల్లయ్య, డీఎస్‌ఓ, సూర్యాపేట జిల్లా