
దేశంలో పేదరికాన్ని అంచనా వేసే ప్రధాన ఏజెన్సీ ప్రణాళిక సంఘం. ఇది అఖిల భారత పేదరిక స్థాయితోపాటు పట్టణ, గ్రామీణ స్థాయి పేదరికాన్ని అంచనా వేస్తుంది. పేదరికపు సాంద్రతను పేదరిక నిష్పత్తి అంటే మొత్తం జనాభాలో పేదరికంలో ఉన్న జనాభా శాతం ద్వారా అంచనా వేస్తారు. పేదరికపు నిష్పత్తినే తలల లెక్కింపు అని కూడా అంటారు. పేదరికపు అంచనాలు వేయడానికి ప్రణాళిక సంఘం పలు కమిటీలను నియమించింది. వాటి గురించి తెలుసుకుందాం.
వై.కె.అలఘ్ కమిటీ: ఈ కమిటీని ప్రణాళిక సంఘం అలఘ్ అధ్యక్షతన ఏర్పాటు చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు పేదరిక రేఖను పోషకాల అవసరాలు, వాటి వినియోగ వ్యయం ఆధారంగా లెక్కించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీల శక్తి ఇచ్చే ఆహారం, పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీల శక్తిని ఇచ్చే ఆహారాన్ని ప్రాతిపదికగా తీసుకుని పేదరికాన్ని లెక్కించాలని సిఫారసు చేసింది. ద్రవ్యోల్బణం కోసం ధరల స్థాయిని సర్దుబాటు చేయడం ద్వారా తర్వాతి సంవత్సరాలకు పేదరిక అంచనాలను లెక్కించాలి.
ఎన్ఎస్ఎస్ఓ సర్వే : యూఆర్పీ – యూనిఫామ్ రీకాల్ పీరియడ్: అన్నిరకాల వస్తువులపై 30 రోజులకు (ఒకే రకమైన గుర్తింపు కాలం) ఒకేసారి ఒకే విధంగా ఖర్చు చేస్తారో అంచనా వేసే పద్ధతి.
ఎంఆర్పీ – మిక్స్డ్ రీకాల్ పీరియడ్: కేవలం ఐదు రకాల వస్తువులపై 365 రోజులకు ఒకసారి మిగిలిన వస్తువులపై 30 రోజులకు ఒకసారి ఖర్చును అంచనావేసే పద్ధతి.
1993లో యూఆర్పీ పేదరికం – 36శాతం, 2004–05లో యూఆర్పీ పేదరికం – 27.5శాతం. అంటే 11 సంవత్సరాల్లో పేదరికం 8.5శాతం తగ్గింది.
ఎస్పీ గుప్తా అంచనాలు: ఇతని అంచనాల ప్రకారం సంస్కరణల ముందు వృద్ధిరేటు 5.6శాతంగా ఉండి పేదరికం 3.1శాతానికి తగ్గింది. సంస్కరణ తర్వాత వృద్ధిరేటు 5.7శాతం కంటే అధికంగా ఉన్న పేదరికం కేవలం 1శాతం మాత్రమే తగ్గింది. దీని ప్రకారం సంస్కరణల ఫలితాలు అధిక ఆదాయాల వర్గాల వారికి మాత్రమే లాభం చేకూర్చుతున్నాయని పేర్కొన్నారు.
మహేంద్రదేవ్, రవి అంచనాలు: వీరి నిర్వచనం ప్రకారం దారిద్ర్యరేఖలో 75శాతం కంటే తక్కువ వ్యయం చేసేవారు వెరీ పూర్ కిందకు వస్తారు.
- సంస్కరణలకు ముందు పేదరికం తగ్గుదల 0.88శాతం
- సంస్కరణల తర్వాత పేదరికం తగ్గుదల 0.48శాతం
దేశంలో (గ్రామాలు, పట్టణాలు) పేదరికం సంస్కరణల ముందు కంటే సంస్కరణల తర్వాతనే పేదరికం తగ్గుదల రేటు తక్కువగా ఉంది.
ALSO READ :మేడిగడ్డలో ఏం జరుగుతున్నది?.. :కోదండరాం
టెండూల్కర్ గ్రూప్: ఆర్థిక సంస్కరణల అనంతర కాలంలో మొత్తం పేదరిక నిష్పత్తి 1993–94లో 45.3శాతం ఉండగా ఇది 2011–12 నాటికి 12.9శాతానికి తగ్గింది. ఈ కాలంలో పేదరికంలో ఉన్న వారి సంఖ్య 403.7 మిలియన్ల నుంచి 269.3 మిలియన్లకు తగ్గింది.
రంగరాజన్ ఎక్స్పర్ట్ గ్రూప్: ప్రధాన మంత్రి సూచనల మేరకు ప్లానింగ్ కమిషన్ ఈ కమిటీని 2012లో నియమించింది. సురేష్ టెండూల్కర్ సూచనల పేదరిక అంచనాలపై అనేక విమర్శలు రావడంతో రంగరాజన్ కమిటీని నియమించారు. సురేష్ టెండూల్కర్ కొలమాన పద్ధతిని సమీక్షించడం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ నివేదికను 2014లో ప్రధాని మోదీ ప్రభుత్వం ఆమోదించకపోవడం వల్ల సురేష్ టెండూల్కర్ నివేదికనే ప్రస్తుతం కొనసాగుతోంది.
ఎస్పీ గుప్తా, సుందరం, టెండూల్కర్ మొదలైనవారు పేదరికంపై అధ్యయనం చేసి ఆర్థిక సంస్కరణల వల్ల పట్టణ ప్రాంతంలో పేదరికం స్వల్పంగా తగ్గిన, గ్రామీణ పేదరికం, జాతీయ పేదరికం తగ్గిందని పేర్కొన్నారు.
సంస్కరణలు జాతీయ వృద్ధిరేటును పెంచినప్పటికి అది పేదరిక నిర్మూలనకు పెద్దగా తోడ్పడలేదు. ఉద్యోగిత వృద్ధి, పేదరికం రేటు మధ్య ధనాత్మక సంబంధం ఉంటుంది. సంస్కరణలకు ముందు జాతీయాదాయ వృద్ధిరేటు తక్కువగా ఉన్న ఉపాధి వృద్ధిరేటు ఎక్కువగా ఉండటంతో పేదరికం తక్కువగా ఉంది. సంస్కరణల తర్వాత వృద్ధిరేటు ఎక్కువగా ఉన్న, ఉద్యోగిత వృద్ధి తక్కువగా ఉండటంతో పేదరికం తగ్గలేదు. సంస్కరణలు శ్రామికులపై ప్రతికూల ప్రభావాన్నే చూపాయి.
ఆర్థిక అసమానతలు: భారత ప్రభుత్వం 1960లో మహల్నోబిస్ అధ్యక్షతన ఆదాయ పంపిణీ, ప్రజల జీవనస్థాయిని అధ్యయనం చేయడానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. వీరి నివేదిక ప్రకారం ప్రజల ఆదాయం కంటే వినియోగ వ్యయం ఎక్కువగా ఉంది. ఇది ప్రజల జీవనస్థాయిని కుంటుపరిచింది. ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం సంస్కరణల అనంతరం 1992–2000 సంవత్సరాల మధ్య ప్రజల వినియోగ వ్యయంలో అసనమాతలు క్రమంగా క్షీణించాయి.
మానవాభివృద్ధి సూచన 2011 ప్రకారం 2000–2011 మధ్యకాలంలో గిని గుణకం విలువ భారతదేశంలో 36.8గా నమోదైంది. ఆదాయ అసమానతలలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సింగపూర్ తదితర దేశాల కంటే భారతదేశం కొంచెం మెరుగైన స్థితిలో ఉంది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి.
ఆర్థిక అసమానతల నివేదిక : గత సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 82శాతం సంపద ఒక శాతం పెరగగా, 3.7 బిలియన్ల జనాభాలో సగం మందికి వారి సంపదలో పెరుగుదల కనిపించలేదు. బిలియనీర్ల సంపద 2010 నుంచి సంవత్సరానికి సగటున 13శాతం పెరిగింది. సాధారణ కార్మికుల వేతనాల కంటే 6 రెట్లు వేగంగా, ఇది వార్షిక వృద్ధిరేటులో 2శాతం పెరిగింది.
భారత్లోని విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో దేశంలోని మొత్తం సంపదలో 22.3శాతం ఉన్న హిందువు ఉన్నత కులాల చేతిలో 41శాతం సంపద ఉందని పేర్కొంది. అయితే దేశం మొత్తం సంపదలో 3.7శాతం తక్కువ వాటాను 7.8శాతం గల షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారి చేతిలో ఉంది.