
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) ఆరేండ్ల కిందట.. 2017 విమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో ఇండియా ఫైనల్ చేరడం మన దేశ విమెన్స్ క్రికెట్‌లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. నాడు అసాధారణంగా పోరాడిన మన అమ్మాయిలు.. అదే ఊపును కొనసాగించి విమెన్స్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి అడ్డు పడతారని అంతా ఆశించారు. కానీ, ఆరేండ్లు గడిచిపోయాయి. ఈ టైమ్‌లో ఆస్ట్రేలియా రెండు టీ20 వరల్డ్‌కప్స్, ఓ వన్డే వరల్డ్ కప్, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ నెగ్గితే.. ఇండియా తొలి ఐసీసీ కప్ కోసం ఇంకా వేచి చూస్తూనే ఉంది. 2017 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, 2018 టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. గత టీ20 వరల్డ్‌కప్, కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ఇప్పుడు సౌతాఫ్రికా గడ్డపై అదే ఆస్ట్రేలియా చేతిలో సెమీఫైనల్లోనే ఓడి తీవ్రంగా నిరాశ పరిచింది. 2017లో లండన్‌లో ఇండియాను పట్టుకున్న ‘నాకౌట్ ఫీవర్’ 2023లో కేప్‌టౌన్ వరకూ కొనసాగింది. వరుసగా ఐదు మెగా ఈవెంట్లలో నాకౌట్ గండాన్ని దాటలేకపోయిన అమ్మాయిల ఆట అభిమానులను వేదనకు గురి చేస్తోంది. ఓవైపు విమెన్స్ ప్రీమియర్ లీగ్‌తో అమ్మాయిల ఆట అందలం ఎక్కబోతుందని ఆనందపడాలో... ఇలా మెగా టోర్నీల్లో మన జట్టు ‘నాకౌట్’ అవుతున్నందుకు బాధ పడాలో అర్థం కాని పరిస్థితి. మెగా టోర్నీల్లో అమ్మాయిలు సత్తా చాటి కప్పు కొట్టాలంటే టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐ తక్షణమే మేల్కొనాలి. జట్టును వెంటాడుతున్న ప్రధాన సమస్యలకు పరిష్కారం కనుగొనాలి.
మిస్ ఫీల్డింగ్, చెత్త క్యాచింగ్‌తో తిప్పలు
సెమీస్‌లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రధాన తేడా ఫీల్డింగే. మెన్స్ క్రికెటర్ల మాదిరిగా ఆసీస్ అమ్మాయిలు గ్రౌండ్‌లో డైవ్స్ చేస్తూ బౌండ్రీలను నిలువరిస్తే.. ఇండియన్స్ చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లను కూడా పట్టలేకపోయారు. ఇండియా పేలవ ఫీల్డింగ్ కారణంగా ఆసీస్ కనీసం 25–30 రన్స్ ఎక్కువ చేసింది. క్రీజులో సెట్ అయిన బెత్ మూనీ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను షెఫాలీ డ్రాప్ చేస్తే, కీపర్ రిచా ఘోష్.. మెగ్ లానింగ్‌ను స్టంపింగ్ చేయలేకపోయింది. ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకున్న మెగ్ డెత్ ఓవర్లలో దంచికొట్టి ఆసీస్‌కు భారీ స్కోరు అందించింది. ‘సీనియర్లకంటే అండర్19 వరల్డ్ కప్ నెగ్గిన యంగ్ స్టర్స్ చాలా ఫీట్‌గా, ఫీల్డ్‌లో చురుగ్గా ఉన్నారు. సీనియర్లలో చాలా మంది యో యో టెస్టులో పాస్ అవ్వరని నేను బెట్ కాస్తా. అసలు ఫిట్‌నెస్సే లేని వాళ్లు గ్రౌండ్‌లో బాగా ఫీల్డింగ్ చేస్తారని ఆశించలేం’ అని ఇండియా మాజీ కెప్టెన్ డయనా ఎడుల్జీ విమర్శించింది.
స్పిన్నర్లు మళ్లీ ముంచారు
ఒకప్పుడు టీమ్‌కు అతి పెద్ద బలంగా ఉన్న స్పిన్నర్లు ఇప్పుడు వీక్‌నెస్‌గా మారారు. ఈ వరల్డ్ కప్‌లో మన స్పిన్నర్లు ఫెయిలయ్యారు. రాజేశ్వరి గైక్వాడ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీప్తి శర్మ, రాధా యాదవ్ కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ల్లో రాణించలేకపోయారు. రీఎంట్రీలో సీనియర్ పేసర్ శిఖా పాండే ఆకట్టుకోలేకపోయింది. యంగ్ పేసర్ రేణుకా సింగ్ పెర్ఫామెన్స్ ఒక్కటే ఊరట కలిగించే అంశం. పేస్ బౌలింగ్‌లో జట్టుకు సరైన ఆప్షన్స్ కూడా కనిపించలేదు. లెఫ్టార్మ్ పేసర్ అంజలి శర్వాణికి ఒక్క చాన్స్ కూడా ఇవ్వలేదు. మేఘనా సింగ్‌ను రిజర్వ్ బెంచ్‌పైనే ఉంచారు. ఈ ఇద్దరూ నాణ్యమైన పేసర్లే. వీరికితగినన్ని అవకాశాలు రావాలి. విమెన్స్ ప్రీమియర్ లీగ్‌తో మరికొందరు టాలెంటెడ్ ప్లేయర్లు వెలుగులోకి వస్తే జట్టు రాత మారొచ్చు.
టీ20లకు సరిపోని స్ట్రయిక్ రేట్
ఈ టోర్నీలో షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, యస్తిక భాటియా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ స్ట్రయిక్ రేట్ 110 కంటే తక్కువ ఉంది. మోడ్రన్ గేమ్‌లో 130 కంటే తక్కువ స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తే ఫలితం ఉండదు. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మంచి స్ట్రయిక్ రేట్ (138.5) చూపెట్టినా.. నిలకడగా రాణించలేదు. షెఫాలీ చాన్నాళ్లుగా పేలవ ఫామ్‌లో ఉంది. షెఫాలీ షార్ట్ బాల్ వీక్‌నెస్‌ను ఉపయోగించుకొని బౌలర్లు ఆమెను ఔట్ చేస్తున్నారు. బౌండ్రీలపైనే ఆధారపడుతున్న వర్మ.. ఎక్కువ డాట్ బాల్స్ ఆడుతోంది. ఆమెను పక్కనబెట్టి.. తెలుగమ్మాయి సబ్బినేని మేఘనను రెగ్యులర్ ఓపెనర్‌గా దింపాల్సిన సమయం వచ్చిందనిపిస్తోంది. విమెన్స్ టీ20ల్లో కూడా ఇప్పుడు పవర్ -హిట్టింగ్ కీలకంగా మారింది. యంగ్‌స్టర్ రిచా ఘోష్ ఆ బాధ్యతను తీసుకునేలా ఉంది. కాబట్టి ఆమెను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా పంపించి, తానియా భాటియా లాంటి వాళ్లకు వికెట్ కీపింగ్ అప్పగిస్తే మంచి ఫలితం ఉండొచ్చు. ఇక, ఎంతో అనుభవం ఉన్న దీప్తి శర్మ ఈ ఫార్మాట్‌కు తగినట్టుగా తన బ్యాటింగ్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.