నత్తనడకన ‘మన ఊరు–మన బడి’

నత్తనడకన  ‘మన ఊరు–మన బడి’

పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించాలని ప్రారంభించిన మన ఊరు - మన బడి పథకం నత్తనడకన సాగుతోంది. ఈ పథకం ద్వారా స్కూల్స్​ను బాగుచేసి  విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి కరీంనగర్​ జిల్లావ్యాప్తంగా 2,508 స్కూల్స్​ఉండగా, సుమారు 2,30,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో మొదటి విడతగా 878 బడులను ఎంపిక చేశారు. కరీంనగర్​లో 647 స్కూల్స్ ఉండగా 230 స్కూల్స్, పెద్దపల్లిలో 549 స్కూల్స్​కు గాను 191, జగిత్యాలలో 783 స్కూల్స్​కు 274, రాజన్న సిరిసిల్లలో 534 స్కూల్స్ ఉండగా 183 స్కూల్స్ మొదటి విడగా డెవలప్​మెంట్ కోసం ఎంపిక చేశారు.

మొదటి దశలో ఎంపిక చేసిన స్కూల్స్​లో పనులు ప్రారంభించినా ఎక్కడా 10 శాతం కూడా పనులు పూర్తికాలేదు. పథకం ప్రారంభంలో స్కూల్స్ డెవలప్​మెంట్ కోసం స్పాన్సర్స్ సాయం చేయాలని ప్రభుత్వం కోరినా ఎవరి నుంచి కూడా సరైన స్పందన రాలేదు. దీనికి తోడు ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ కోసం ప్రత్యేక నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. 

చేసిన పనులకు బిలులు రాలే..

మన ఊరు మనబడి పథకంలో భాగంగా పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. ప్రభుత్వం రూ.30 లక్షల లోపు ఉన్న పనులను మైనర్ వర్క్స్ కింద స్థానిక కాంట్రాక్టర్లకు అప్పగించారు. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లతోపాటు పలువురు సర్పంచ్​లు కూడా పనులు చేశారు. అయితే వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటికీ రాకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు ఇటీవల ఆయా స్కూళ్లకు తాళాలు వేసుకున్నారు.