సింగరేణి ఎన్నికలపై సందిగ్ధం

 సింగరేణి ఎన్నికలపై సందిగ్ధం
  • బొగ్గు ఉత్పత్తికి విఘాతం అంటున్న మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌
  • ఎన్నికలకు పట్టుబడుతున్న కార్మిక సంఘాలు

గోదావరిఖని/కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌:  సింగరేణి సంస్థలో ‘గుర్తింపు సంఘం’ ఎన్నికల విషయంలో దోబూచులాట మొదలైంది. సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేందుకు సెంట్రల్‌‌ ‌‌డిప్యూటీ లేబర్‌‌ ‌‌కమిషనర్‌‌ ‌‌శ్రీనివాసులును ఎలక్షన్‌‌ ‌‌ఆఫీసర్‌‌‌‌గా నియమించగా, ఆయన ఈ నెల 13న రిజిస్టర్డ్‌‌ ‌‌యూనియన్ల లీడర్లతో హైదరాబాద్‌‌‌‌లో మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. ఏప్రిల్‌‌‌‌ 2న ఎన్నికల షెడ్యూల్‌‌‌‌ విడుదల చేయాలని ఈ మీటింగ్‌‌‌‌లో నిర్ణయం తీసుకున్నారు. మే నెలలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని భావించారు. అయితే జూన్‌‌ ‌‌నెల వరకు బొగ్గు ఉత్పత్తి అధికంగా చేపట్టాల్సి వస్తున్నందున ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని సింగరేణి మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇటీవల హైకోర్టును ఆశ్రయించింది. దీంతో సింగరేణి ఎన్నికలపై సందిగ్ధం ఏర్పడింది. ఓ వైపు కేంద్ర కార్మిక శాఖ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే.. మరోవైపు సింగరేణి సంస్థ ఎన్నికల నిర్వహణకు మోకాలడ్డుతున్నది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్‌‌‌‌, మే నెలల్లోనే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. అయితే రాష్ట్రంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీపై వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో దాని అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్‌‌‌‌కు ఓటమి తప్పదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సింగరేణి ద్వారా కోర్టులో పిటిషన్‌‌ ‌‌వేయించినట్టు కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌లో ప్రచారం జరుగుతోంది. 6 జిల్లాల్లోని 11 ఏరియాల్లో విస్తరించిన సింగరేణి సంస్థలో 43వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరి ప్రభావం ఐదు పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాలపై ఉంటుందనే భయమే ఇందుకు కారణమంటున్నారు. 

ఎన్నికల కోసం సాగతీత

చివరిసారిగా 2017 అక్టోబర్ 5న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 11 డివిజన్లలో తొమ్మిది డివిజన్లలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ విజయం సాధించింది. రెండు డివిజన్లలో గెలిచిన ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘంగా సరిపెట్టుకుంది. ఎన్నికల సమయంలో గుర్తింపు సంఘం కాలపరిమితి నాలుగేండ్లు ఉంటుందని భావించారు. ఫలితాల అనంతరం రెండేళ్ల కాలపరిమితితోనే గుర్తింపు హోదా ఉంటుందని కార్మికశాఖ జారీ చేసిన లెటర్లో పేర్కొంది. దీంతో టీబీజీకేఎస్ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే కార్మిక శాఖ ఇచ్చిన లెటర్‌‌‌‌ ప్రకారం గుర్తింపు సంఘం పదవీకాలం 2019 అక్టోబర్ 5తో ముగిసింది. కానీ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌‌‌‌ మాత్రం తమకు 2018 ఏప్రిల్‌‌‌‌లో అధికారికంగా గుర్తింపు హోదా పత్రాన్ని కేంద్ర కార్మికశాఖ అందించిందని, అప్పటి నుంచి 2022 ఏప్రిల్ నాటికి నాలుగేళ్ల పదవీకాలం పూర్తవుందని పేర్కొంది. అయితే ఎన్నికలు జరిగిన నాటి నుంచి లెక్కిస్తే  2021 అక్టోబర్ నాటికే నాలుగేళ్లు పూర్తయ్యాయని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష కార్మిక సంఘాలు డిమాండ్‌‌‌‌ చేశాయి. కార్మిక సంఘాలు కేంద్ర కార్మికశాఖ కమిషనర్‌‌‌‌కు అనేకసార్లు లెటర్లు రాయడం, కేంద్ర బొగ్గుగని శాఖ మంత్రిని కలవడంతోపాటు  సింగరేణిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. దీంతో స్పందించిన కేంద్ర కార్మికశాఖ 2021 ఫిబ్రవరిలో సింగరేణిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కార్మిక సంఘాల వార్షిక నివేదికలతో పాటు సభ్యత్వ నమోదు సంఖ్యను స్వీకరించింది. ఆ సమయంలో సింగరేణి మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌, రాష్ట్ర సర్కార్ నుంచి ఎన్నికల నిర్వహణపై ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో కేంద్ర కార్మికశాఖ సైలెన్స్‌‌‌‌ అయింది. 

మొదటి నుంచి అడ్డు చెప్పడమే..

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను కేంద్ర కార్మికశాఖ పర్యవేక్షణలో నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు రాష్ట్ర సర్కార్, సింగరేణి మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ అంగీకారం అవసరం. అయితే రాష్ట్ర సర్కార్ కనుసన్నల్లో సింగరేణి యాజమాన్యం నిర్వహణ నడుస్తోంది. దీంతో సర్కార్ పెద్దలు చెప్పిన తీరులోనే సీఎండీ శ్రీధర్ కంపెనీ నిర్వహణ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సింగరేణిలో గుర్తింపు ఎన్నికల విషయంలో జరుగుతున్న జాప్యంపై సంస్థ సీఎండీ, ఆర్ఎల్సీ, సీఎల్సీలను ప్రతివాదులుగా చేస్తూ ఏఐటీయూసీ యూనియన్ 2022 ఆగస్టు 4న  హైకోర్టును ఆశ్రయించింది. మూడుసార్లు వాదనలు విన్న హైకోర్టు మూడు నెలల్లో సింగరేణి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ చేపట్టాలని అదే ఏడాది అక్టోబర్ 28న ముగ్గురు ప్రతివాదులను ఆదేశించింది. మరోవైపు కేంద్ర కార్మికశాఖ సింగరేణిలో ఎన్నికల కోసం రిటర్నింగ్ అధికారిగా డిప్యూటీ చీఫ్ లేబర్‌‌‌‌ కమిషనర్(డీఎల్సీ) శ్రీనివాసులును నియమించింది. అయితే ఎన్నికల నిర్వహణ ఇప్పుడు వద్దంటూ సింగరేణి మోకాలడ్డుతుండటం కార్మిక సంఘాలకు మింగుడుపడటం లేదు.