గత సర్కార్​ నిర్వాకం..రైతుకు అప్పు పుడ్తలే

గత సర్కార్​ నిర్వాకం..రైతుకు అప్పు పుడ్తలే
  •     క్రాప్ లోన్లు మాఫీ చేయకపోవడంతో భారీగా పెరిగిన మిత్తీలు
  •     రూ.60 వేలు తీసుకుంటే లక్షన్నర దాటింది
  •     లక్షల రైతుల ఖాతాలను  మొండిబాకీల కింద వేసిన బ్యాంకర్లు
  •     పంటరుణాల టార్గెట్ అందుకోని బ్యాంకులు 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : గత బీఆర్ఎస్​ ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలో లక్షల మంది రైతులకు బ్యాంకుల పంటరుణాలు అందకుండా పోతున్నాయి. పంట రుణాలు మాఫీ చేస్తామన్న హామీ నెరవేర్చకపోవడంతో బ్యాంకుల్లో రైతులు తీసుకున్న క్రాప్​ లోన్లపై మిత్తీలు భారీగా పెరిగిపోయాయి. రూ.60 వేలు రుణం తీసుకున్న వారికి రూ1.50లక్షలు దాటింది. దీంతో రైతుల ఖాతాలను మొండిబాకీల కింద జమకట్టి బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు. దీంతో గత ఆర్థిక సంవత్సరం టార్గెట్​లో 67 శాతం క్రాప్​లోన్లు మాత్రమే ఇచ్చారు. 

యాసంగి షురూ అయినా రైతులకు10 శాతం కూడా రుణాలు మంజూరు చేయలేదు. పంట సీజన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా కనీసం 25శాతం కూడా ఇవ్వకపోవడం రైతుల దుర్భర స్థితిని తెలియజేస్తున్నది. రైతులకు పంట రుణాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంకు నిబంధనలు చెప్తున్నా బ్యాంకులు అమలు చేయడం లేదు. స్టేట్​లెవెల్​బ్యాంకర్స్​కమిటీ (ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ) సమావేశాలు నిర్వహించి బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వాలని సర్కారు లక్ష్యాన్ని నిర్ధేశించి మరి చెప్పినా ఫలితం ఉండట్లేదు.

యాసంగి పంట రుణాలు అందట్లే..

2023–24 లో రైతులకు పంట రుణాల కింద రూ.73,438 కోట్లు ఇవ్వాలని ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ మీటింగ్​లో టార్గెట్​నిర్దేశించారు. వానకాలం, యాసంగి రెండు సీజన్‌‌‌‌‌‌‌‌లు కలిపి బ్యాంకులు రూ.49,501 కోట్ల పంట రుణాలు మాత్రమే ఇచ్చినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఈ నెలతో యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌, ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌  కూడా ముగియనుంది. రెండు సీజన్‌‌‌‌‌‌‌‌లు కలిపి టార్గెట్‌‌‌‌‌‌‌‌లో 67 శాతం లోన్లు మాత్రమే ఇచ్చారు. టార్గెట్‌‌‌‌‌‌‌‌లో సగం వానాకాలంలో ఇస్తే యాసంగిలో పట్టుమని 10 శాతం కూడా రుణాలు మంజూరు చేయడం లేదని లెక్కలు చెబుతున్నాయి.

మాఫీ చేయకపోవడంతో పెరిగిన వడ్డీ భారం

పంట రుణాలు ఏడాది లోపు చెల్లిస్తే రైతులకు 4 శాతం వరకు మాత్రమే బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తారు.  రూ.1.60 లక్షలోపు రుణమైతే ప్రభుత్వం వడ్డీలేని రుణంగా పరిగణించి రైతు కట్టిన 4 శాతం వడ్డీ తిరిగి చెల్లిస్తుంది. కానీ ఏడాదిలోపు చెల్లించక పోతే పంట రుణాలకు అమలయ్యే 7 శాతం వడ్డీ కూడా రెట్టింపు అవుతుంది. ఏడాదికి 13 నుంచి 14% వరకు  వడ్డీలు వసూలు చేస్తారు. అంతే కాదు ప్రతి ఆరు నెలలకు వడ్డీ లెక్కించడంతో  మిత్తీ భారీగా పెరిగిపోతుంది. గత ప్రభుత్వం రుణమాఫీపై నిర్లక్ష్యంగా వ్యవహరించరించడంతో  పంటరుణాలు మెండిబాకీలుగా మారాయి.

 దీంతో లక్షలాది మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఇలా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కారు పుణ్యమా అని లక్షలాది మంది రైతులు బ్యాంకుల్లో అప్పు తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. కొత్త సర్కారు త్వరలో మార్గదర్శకాలు రూపొందించి పంట రుణాలపై నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో అది కార్యరూపం దాల్చలేదు. కోడ్‌‌‌‌‌‌‌‌ ముగిసిన తర్వాత రైతుల అప్పులను ప్రభుత్వం తీసుకుని కిస్తీల రూపంలో కట్టుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నది. వానాకాలం వరకు రైతుల సమస్యలకు పరిష్కారం లభించనుందని అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ వర్గాలు అంటున్నాయి.

బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో..

గత సర్కారు లక్ష రూపాయల వరకు పంటరుణాలు మాఫీ చేస్తమని హామీ ఇచ్చి.. బ్యాంకులకు చెల్లించలేదు. దీంతో లోన్లకు మిత్తీలు భారీగా పెరిగి పోయాయి. అప్పట్లో రైతులు రూ.60వేలు తీసుకుంటే వడ్డీతో కలిపి లోన్ రూ.1.50 లక్షలు దాటింది. బ్యాంకులకు వెళ్తే పంటకు ఇవ్వాల్సిన లోన్‌‌‌‌‌‌‌‌ లిమిట్‌‌‌‌‌‌‌‌ కూడా దాటిపోయిందంటూ.. పాత బాకీలు క్లియర్ ​చేయమని అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. 

అటు లోన్​మాఫీకాక ఇటు బ్యాంకులు రుణాలు ఇయ్యక వానాకాలం పంట పెట్టుబడులకే వడ్డీవ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చామంటున్నరు. వడ్డీలు ఎక్కువ కావడంతో వాటిని తీర్చడం కష్టమవుతోందని చెప్తున్నారు. ఇప్పుడు యాసంగికి కూడా పెట్టుబడి కోసం బ్యాకులు లోన్లు ఇవ్వడం లేదని మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకోక తప్పేటట్టు లేదని వాపోతున్నారు.