సిటీలో అస్తవ్యస్తంగా రైతు బజార్లు, ఫిష్, పూల మార్కెట్లు

సిటీలో అస్తవ్యస్తంగా రైతు బజార్లు, ఫిష్, పూల మార్కెట్లు
  • డైలీ క్లీన్ చేయకపోవడంతో పేరుకుపోతున్న చెత్త
  • రెండ్రోజులుగా కురుస్తున్న వానలకు కంపు కొడుతున్న పరిస్థితి

హైదరాబాద్, వెలుగు:గ్రేటర్​పరిధిలోని మార్కెట్లు క్లీన్​గా ఉండటం లేదు. రైతు బజార్లు, ఫిష్ మార్కెట్లు, పూల మార్కెట్లు ఇలా ఎక్కడికి వెళ్లినా మురుగు, బురద, వ్యర్థాలతో నిండిపోయి కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వానలకే మార్కెట్లన్నీ కంపుకొడుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పూలు, పండ్లు, కూరగాయలు, చేపలు కొందామని వస్తున్న కొందరు కంపును తట్టుకోలేక కొనకుండానే బయటికి వెళ్లిపోతున్నారు. ఏ రోజుకారోజు క్లీన్​ చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణం. రైతులు పంటను అమ్ముకోగా పాడైపోయిన కూరగాయలు, ఆకుకూరలను, షాపుల్లోని వ్యర్థాలను మార్కెట్లోనే కుప్పలుగా పోస్తున్నారు. రెండు మూడ్రోజులైనా వాటిని తరలించకపోవడంతో పరిసరాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. వానలు కురిసిన టైంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. రైతుబజార్లు, మార్కెట్లలో కెపాసిటీకి మించి అమ్మకందారులు ఉండటంతో సమస్య తీవ్రమవుతోంది. కేటాయించిన షాపుల్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

అన్నిచోట్లా అంతే..

ఆర్​కేపురం, ఫలక్​నుమా, అల్వాల్, మాదన్నపేట, ఎల్లమ్మబండ, మెహిదీపట్నం, వనస్థలిపురం, గుడిమల్కాపూర్, కూకట్​పల్లి, సరూర్ నగర్, ఎర్రగడ్డ తదితర రైతుబజార్లు, ఫిష్, ఫ్రూట్ మార్కెట్లతోపాటు గుడిమల్కాపూర్ పూల మార్కెట్​లో చెత్త, చెదారం పేరుకుపోతోంది. ఒకటి రెండు మార్కెట్లు మాత్రమే కొంచెం క్లీన్​గా ఉంటున్నాయి. వానలు కురిసే టైంలో మార్కెట్లకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. గుడిమల్కాపూర్ పూల మార్కెట్​లో పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా బురదే కనిపిస్తోంది. నడిచేందుకు వీలుండటం లేదు. బేగంబజార్​లోని రోడ్లను పూర్తిగా తవ్వేయడంతో చిత్తడిగా మారాయి. ఇక్కడి ఫిష్ మార్కెట్ ఇటీవల నిర్మించినప్పటికీ, బయటనే అమ్మకాలు జరుగుతున్నాయి. వ్యర్థాలు పేరుకుపోయి పరిసరాలన్నీ కంపుకొడుతున్నాయి.

రైతులు ఉంటేగా?

ఒకప్పుడు రైతులతో ఉండే రైతుబజార్లు ప్రస్తుతం ఏజెంట్లతో నిండిపోతున్నాయి. రైతులు తెచ్చిన కూరగాయలను ఎంతో కొంతకు కొనుగోలు చేసి రైతుల స్థానంలో మధ్యవర్తులే అమ్ముతున్నారు. రైతులైతే ఎప్పటికప్పుడు క్లీన్​గా ఉంచుకునే వారు. కానీ ఏజెంట్లు ఉంటుండటంతో క్లీనింగ్​ని పట్టించుకోవడంలేదు. సిటీ అంతటా ఇదే పరిస్థితి ఉంది. ఇక ఫ్లవర్ మార్కెట్లో షాపుల ముందు అంతా టేబుల్స్ వేసి అమ్ముతున్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే కొనుగోలుదారులు మార్కెట్లకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇంత దారుణంగానా?

పూలు కొనేందుకు గుడిమల్కాపూర్ మార్కెట్​కి  వస్తే ఇక్కడ అంతా బురదగా ఉంటోంది. చెప్పుల వెంట బురద ఎగిరి బట్టలపై పడుతోంది. మార్కెట్​లో తిరిగే పరిస్థితి లేదు. చిన్నవానకే ఇలా అయితే వానా కాలంలో ఇంకెలా ఉంటుందో. ఇంత దారుణంగా ఉంటే మార్కెట్ కు ఎలా వస్తాం. అధికారులు సౌకర్యాలు కల్పించాలి.
– రాజేశ్, గుడిమల్కాపూర్​

ఎక్కడ చూసిన చెత్తనే

కూరగాయలు కొందామని ఎర్రగడ్డ రైతుబజార్​కి వస్తే ఎక్కడ చూసినా చెత్తనే కనిపిస్తోంది. మార్కెట్లు క్లీన్​గా లేకపోతే ఎలా కొనాలి. రైతు బజార్లలో కూరగాయలు తాజాగా ఉంటాయని ఇంటి దగ్గర షాపులు కాదని ఇక్కడి దాకా వచ్చాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే బాగుంటుంది. – ప్రవీణ, ఎర్రగడ్డ