70శాతం కొన్నామన్న మంత్రి .. 24శాతమే అన్న అధికారులు

70శాతం కొన్నామన్న మంత్రి .. 24శాతమే అన్న అధికారులు
  • 70% కొన్నామన్న మంత్రి .. 24% అన్న సివిల్​ సప్లయ్స్​

నారాయణ్ ఖేడ్ / మెదక్ (అల్లాదుర్గం), వెలుగు: వడ్ల కొనుగోళ్లపై రాష్ట్ర సర్కార్ రెండు లెక్కలు చెబుతోంది. అధికారులు ఓ మాట చెబితే, మంత్రి మరో మాట చెప్పారు. మంగళవారం నారాయణఖేడ్ లోని క్యాంప్ ఆఫీసులో మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వానాకాలానికి సంబంధించి ఇప్పటి వరకు 70 శాతం వడ్లను కొన్నామని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు 24 శాతం వడ్లనే కొన్నట్లు సివిల్ సప్లయ్స్ అధికారులు ప్రకటించారు. వడ్ల కొనుగోళ్లపై మంగళవారమే స్టేటస్ రిపోర్టు రిలీజ్ చేశారు. ఈ నెల 30 వరకు 6,385 కొనుగోలు కేంద్రాల ద్వారా 25.32 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్లు అందులో వెల్లడించారు.

అంటే సర్కార్ వడ్ల సేకరణ లక్ష్యం 1.03 కోట్ల టన్నుల్లో.. ఇది కేవలం 24.35 శాతమే. కాగా, ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వడ్లకు రైతులకు రూ.4,958 కోట్లు చెల్లించాల్సి ఉండగా... ఇప్పటి వరకు రూ.2,375 కోట్లు మాత్రమే చెల్లించామని, ఇంకా రూ.2,583 కోట్లు బకాయిలు ఉన్నాయని అధికారులు రిపోర్టులో పేర్కొన్నారు. ఈఅధికారులేమో 24 శాతమే వడ్లు కొన్నామని చెబుతుంటే, మంత్రేమో 70 శాతం కొన్నామని చెబుతుండడంపై జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
ప్రతిపక్షాలవి ఉత్త మాటలు: హరీశ్ 
ప్రెస్ మీట్ లో ప్రతిపక్షాలు, కేంద్రంపై హరీశ్ రావు విరుచుకుపడ్డారు. ‘‘వడ్ల కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు ఉత్త మాటలు మాట్లాడుతున్నాయి. వాళ్లకు మాట్లాడే నైతిక హక్కు లేదు. కేంద్ర మంత్రులు పీయూష్​గోయల్, కిషన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకు, చేతలకు పొంతన లేదు. కేంద్ర విధానాలతోనే వడ్ల కొనుగోళ్లు లేటవుతున్నాయి” అని అన్నారు. త్వరలో బసవేశ్వర లిఫ్ట్​ఇరిగేషన్​ద్వారా 1.75 లక్షల ఎకరాలకు సాగు నీరందించి నారాయణ్​ఖేడ్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. అనంతరం హరీశ్ ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లి పరిశీలించారు. రోగులకు ఇస్తున్న ఫుడ్ బాగ లేకపోవడంతో సిబ్బందిని మందలించారు.
మంత్రికి నిరసన సెగ 
మంత్రి హరీశ్ రావుకు నిరసన సెగ తగిలింది. మంత్రి వస్తున్నారని తెలుసుకొని, వడ్ల కొనుగోళ్లలో జాప్యంపై మంగళవారం మెదక్ జిల్లా అల్లాదుర్గం వద్ద నేషనల్ హైవేపై రైతులు రాస్తారోకో చేపట్టారు. వడ్లను రోడ్డు మీద పోసి నిప్పంటించారు. వడ్లు కొనేదాకా కదిలేది లేదని, రోడ్డుపైనే కూర్చున్నారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. అదే టైమ్ లో నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న హరీశ్ రావు కాన్వాయ్ అక్కడికి చేరుకుంది. ట్రాఫిక్ జామ్ కావడంతో కాన్వాయ్ ని వెనక్కి పంపే ప్రయత్నం చేశారు. అయితే మీడియాను చూసిన హరీశ్ రావు.. 
కారు దిగి రైతుల వద్దకు వెళ్లారు. వడ్లను వెంటనే కొనాలని ఫోన్ లో అధికారులను ఆదేశించారు. రెండు గంటల్లో వడ్లు కొంటరని, లేకుంటే తనకు ఫోన్ చేయండని మంత్రి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.