వీడియో: ఎద్దుల బండెక్కిన మంత్రులు.. కదలకుండా మారాం చేసిన ఎద్దులు

వీడియో: ఎద్దుల బండెక్కిన మంత్రులు.. కదలకుండా మారాం చేసిన ఎద్దులు

బండి దిగి కాలినడకన ముందుకు సాగిన మంత్రులు

హైదరాబాద్: మంత్రులెక్కిన ఎద్దుల బండి.. ముందుకు కదలకుండా మారాం చేసింది. దీంతో చేసేదేమీ లేక మంత్రులు ఎద్దుల బండి దిగి కాలినడకన ముందుకు సాగారు. ఎద్దుల బండిపై మంత్రులను అట్టహాసంగా ఊరేగించాలన్న ప్రయత్నాలు సఫలం కాకపోవడం ఒకింత నిరాశకు గురి చేసింది. ఇబ్రహీంపట్నంలో రైతు వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా చోటు చేసుకుందీ ఘటన. వివరాల్లోకి వెళితే.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి  పనులను ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డిలు హాజరయ్యారు.  ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగుడా గ్రామంలో రైతు వేదిక ప్రారంభోత్సవాన్ని వేడుకను ఘనంగా నిర్వహించాలని  గ్రామ సర్పంచ్ బూడిద రాంరెడ్డి తదితరులు భారీ ఏర్పాట్లు చేశారు. మంత్రులను ఎడ్ల బండిపై ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు ఎద్దుల బండిని, ఎద్దులను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు ఎంతో హుషారుగా ఎద్దుల బండి ఎక్కారు.  రైతు వేదిక దగ్గరకు ఎద్దుల బండిపై వెళ్లేందుకు పయనమయ్యారు. కానీ అక్కడకు వచ్చిన భారీ జనాన్ని, ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టంలకు ఎద్దులు భయపడ్డాయో ఏమో గాని నాలుగడుగులు వేయగానే.. ఎద్దులు ముందుకెళ్లకుండా మారాం చేశాయి. అక్కడున్న వారు ఎద్దులను, బండిని ముందుకు తీసుకెళ్లేందుకు ఎంత అదిలించినా అవి కదలకుండా మారాం చేశాయి. పరిస్థితిని గుర్తించిన మంత్రులు చేసేది ఏమీ లేక ఎద్దుల బండి దిగారు. నడుచుకుంటూ రైతు వేదికకు చేరుకొని ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.