ఓటుకు పైసలు వద్దు.. పని చేసేటోళ్లే కావాలె

ఓటుకు పైసలు వద్దు.. పని చేసేటోళ్లే కావాలె
  • ఓటుకు పైసలు ఇచ్చెటోళ్లు కాదు.. 
  • పనులు చేసేటోళ్లే కావాలె
  • ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోలే..
  • ఎలక్షన్ వచ్చినంక అందరూ వస్తున్నరు
  • మా సమస్యలు పరిష్కరించేవాళ్లకే ఓటు 
  • మునుగోడు ఓటర్ల మనోగతం

నల్గొండ, వెలుగు: ఎన్నికల్లో ఓటుకు ఇంత అని పైసలు ఇచ్చేటోళ్లు తమకు వద్దని, పనులు చేసే లీడర్లే కావాలని మునుగోడు జనాలు అంటున్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడే లీడర్లకు తమ ఊర్లు, సమస్యలు గుర్తుకు  రావడం బాధాకరమంటున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎక్కడిడెక్కడి నుంచో లీడర్లందరూ నియోజకవర్గానికి వచ్చి అది చేస్తాం..ఇది చేస్తామని చెబుతున్నారని, ఎనిమిదేండ్ల నుంచి కష్టాలు పడుతుంటే ఒక్కసారి కూడా స్పందించిన పాపాన పోలేదంటున్నారు. ఓట్లు వేయడానికి డబ్బులు ఆశ చూపుతున్నారని, సమస్యల పరిష్కారం గురించి అడిగితే మాత్రం ముందైతే ఓటు వేయండి ..తర్వాత చూద్దాం అంటున్నారని వాపోతున్నారు. ఉప ఎన్నిక రాగానే ఇన్నాళ్లు పెండింగ్​లో ఉన్న భగీరథ పైప్​లైన్ల కనెక్షన్లు ఇస్తున్నారని, గుంతలు పడ్డ రోడ్లకు రిపేర్లు చేస్తున్నారని చెబుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే లేకపోవడం వల్లే అభివృద్ధి జరగలేదని కొందరు, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండడంతో ప్రభుత్వం కక్ష కట్టిందని మరికొందరు ఇలా ఎవరికి వారు మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప ఏ ఒక్కరు తమ గోడును పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు.  ఓటుకు నోటు ఇచ్చి పోతే అయిపోదని, సమస్యల పరిష్కారం గురించి పట్టించుకోకపోతే ఒప్పుకోమంటున్నారు. 

పని చేసేటోళ్లు కావాలె

మా ఊరికి కొత్తకొత్త లీడర్లు వస్తున్నరు..పోతున్నరు. తెల్లారేసరికి ఇంటి ముందు కనిపిస్తున్నరు. అవి చేస్తం..ఇవి చేస్తం అని చెబుతున్నరు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇట్ల చెప్తనేఉంటరు కదా. ఇంతవరకు మా ఊరికి ఎవరూ చేసిందేమీ లేదు. పైసలు కాదు ముఖ్యం. పని చేసేటోళ్లు కావాలె. 
- పగిళ్ల నరసమ్మ, తెరటుపల్లి గ్రామం

చండూరు సంగతేంది? 

చండూరు మున్సిపాలిటీ చేసి అభివృద్ధి చేయకుండా వదిలేసిన్రు. పందుల సమస్య ఉంది. డ్రైనేజీలు సక్కగ లేవు. ఇంటింటికి భగీరథ నీళ్లు ఇస్తామని చెప్పి నల్లా కనెక్షన్లు కూడా సక్రమంగా ఇవ్వలేదు. వీధిలైట్లు లేక రాత్రి పూట బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. డ్రైనేజీలు, నిర్మించకపోవడంతో మురుగునీరంతా రోడ్ల పైకే వస్తోంది.
- ఏశాలవెంకట్,చేనేత కార్మికుడు చండూరు

కష్టాలు తప్పుతలేవు? 

మా ఊరిలో సీసీ రోడ్డు, కాల్వలు లేవు. వేరే ఊర్లకు వెళ్లేందుకు లింకు రోడ్లు సరిగ్గా లేవు. స్కూల్​లో కనీస సౌకర్యాలు లేవు. దీంతో పిల్లలందరూ ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తున్నారు. బస్సు కూడా సరిగ్గా రాకపోవడంతో కష్టాలు తప్పుత లేవు.  జనాలంతా తిప్పలు పడుతున్నా పట్టించుకునేవాళ్లు లేరు.
- చాపల గోపి, మర్రిగూడ మండలం లెంకలపల్లి

పైసలకు అమ్ముడుపోయేది లేదు

మా వార్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ పూర్తిగా రాలేదు.  దీంతో మంచినీళ్లు వస్తలేవు. వీధుల్లో పందులు తిరుగుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినంకనే అక్కడక్కడ పనులు చేస్తున్నరు. ప్రచారానికి వస్తే రూ.300 నుంచి 500 ఇస్తమంటున్నరు. ఓటుకు కూడా బాగానే ఇస్తారట. పైసలకు అమ్మడుపోయే ప్రసక్తే లేదు.  
- జి.శేఖర్ చండూరు, ఏడో వార్డు

ఎలక్షన్లు రాగానే మండలమా? 

మునుగోడు అభివృద్ధి చేయలేదనే రాజీనామా చేసిన అని రాజగోపాల్​రెడ్డి చెప్తున్నడు. ప్రభుత్వం గట్టుప్పుల్​ అభివృద్ధికి నిధులే ఇవ్వలే. ఎలక్షన్లు రాగానే మండలం ప్రకటించింది. ఎందుకిట్లా చేసిందో అందరికీ తెలుసు. రోడ్లు, అభివృద్ధి పనులు చేయలే. వాటి సంగతేంది. 
-గోలి రాయప్ప, చేనేత కార్మికుడు, కమ్మ గూడెం, గట్టుప్పుల్​ మండలం

రోడ్లు, సౌలత్​లు మంచిగ లేవు 

మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో సరైన వైద్య సదుపా యాలు లేవు. ఈ సర్కారు ఇంటర్ కాలేజీ కూడా పెట్టలేదు. కొన్నిచోట్లకైతే బస్సులు కూడా లేవు. ఇగ రోడ్ల సంగతి సరేసరి. ఈ సమస్యలపై మాట్లాడే వారే కరువైన్రు. వీటిని పట్టించుకునే పార్టీలకే మద్దతిస్తాం.
- జిట్టగోని యాదగిరి, మునుగోడు