
- మే 15 నుంచి నెల పాటు ప్రభుత్వ పథకాలపై ప్రచారం
- మాతృభూమి కోసం పనిచేయాలని ఎంపీలకు సూచన
న్యూఢిల్లీ: ఎన్ని ఎలక్షన్లలో మనం గెలిస్తే.. ప్రతిపక్షాలకు అంతగా టార్గెట్ అవుతామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ వరుసగా విజయాలు సాధిస్తుండటం వల్లే తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దాడికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ.. ప్రభుత్వంపై పలు అంశాలకు సంబంధించి విమర్శలు కురిపిస్తున్న ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
సామాజిక న్యాయానికి ఊతమిచ్చేలా..
ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి వరకు మధ్య కాలంలో సామాజిక న్యాయానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ ఎంపీలకు ప్రధాని సూచించారు. మే 15 నుంచి నెల రోజుల పాటు ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో ప్రభుత్వ తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పలు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని మోడీ సూచించారని కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ మీడియాకు తెలిపారు.
మాతృభూమి కోసం పనిచేయాలని పార్టీ లీడర్లను ఆదేశించారన్నారు. రసాయనాల వాడకం విపరీతంగా పెరగడంతో మాతృభూమి కన్నీరు పెడుతోందని, వాటి నుంచి విముక్తి కల్పించాలని కోరుకుంటోందని, చెట్లు నాటడం, పంటలను విస్తరించడం, ఇతర మార్గాల ద్వారా మానవాళిని కాపాడాలని పిలుపునిచ్చారన్నారు. రాజకీయ నాయకులకు సామాజిక బాధ్యత ఉంటుందని, అందువల్ల రాజకీయాలకు అతీతంగా పనులు చేయాలని సూచించారన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన భేటీ బచావో కార్యక్రమం.. స్త్రీ, పురుష నిష్పత్తిని పెంపొందించడానికి ఎంతో తోడ్పడిందని చెప్పారన్నారు.
కొత్త విషయాలు నేర్చుకోండి
కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి ఎంపీలు ఎక్స్పర్ట్స్ సేవలను వాడుకోవాలని మోడీ సూచించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ప్రతిపక్షాల నిరసనలను గురించి మోడీ ప్రస్తావిస్తూ, గుజరాత్ ఎన్నికల సమయంలో ఇలాంటి ఆందోళనలు మరింత ఉధృతంగా సాగాయని, అయినా బీజేపీ మరిన్ని ఎన్నికల్లో గెలుపొందిందని గుర్తుచేశారని చెప్పారు.
ఇకపైనా పార్టీ మరింత తీవ్రమైన దాడులను ఎదుర్కొంటుందని వెల్లడించినట్టు తెలిపారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత జరిగిన తొలి బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఇదే. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో సాధించిన ఈ విజయాలపై పార్టీ శ్రేణులను మోడీ ప్రశంసించారు.