
రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘ఖిలాడి’ మూవీ ఫిబ్రవరి 11న తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. నిన్న ట్రైలర్‌ని కూడా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కోనేరు సత్యనారాయణ ఇలా ముచ్చటించారు. ‘కథ బాగుంటేనే సినిమా హిట్టవుతుంది. అందుకే నేను కథనే ఎక్కువ నమ్ముతాను. ‘రాక్షసుడు’ విషయంలో అలాగే నమ్మాను. సక్సెస్ వచ్చింది. ఈ సినిమా కూడా కొత్త పాయింట్‌తో రానుంది. కథ వినగానే రవితేజకి బాగుంటుందన్నాను. ఆయనకూ నచ్చింది. సినిమా ఎంతో స్టైలిష్‌గా ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ అద్బుతమైన సంగీతాన్నిచ్చారు. హీరోయిన్లు కూడా చక్కగా నటించారు. కమర్షియల్ సినిమానే అయినా ఫ్యామిలీ అంతా చూడొచ్చు. ఆల్ ఇండియా లెవెల్‌లో తీసుకెళ్దామని పెన్ స్టూడియోస్‌తో కలిశాం. హిందీలోనూ విడుదల చేస్తున్నాం. అనుకున్న డేట్‌కి సినిమా పూర్తవుతుందా అని నాకు, రవితేజ గారికి డౌట్ ఉండేది. కానీ చెప్పిన టైమ్‌కి రెడీ చేశాడు రమేష్ వర్మ. అవుట్‌పుట్ చూడగానే నచ్చేసి దర్శకుడికి కారు గిఫ్ట్‌గా ఇచ్చాను. ఇతర వ్యాపారాలు, విద్యా సంస్థలు ఉన్నా నా కొడుకు హవీష్ కోసమే సినిమా నిర్మాణంలోకి వచ్చాను. ప్రస్తుతం హవీష్ ‘సంజయ్ రామస్వామి’ మూవీ చేస్తున్నాడు. తరువాత మా బ్యానర్‌లోనే మరో సినిమా ఉంది. వంద కోట్లతో ‘యోధ’ అనే ప్యాన్ ఇండియన్ మూవీ అనుకుంటున్నాం. హైదరాబాద్‌లో వంద ఎకరాల్లో వరల్డ్ క్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్ యూనివర్సిటీని కట్టాలని అనుకుంటున్నాను.’