గ్రేటర్ వరంగల్​కు సమ్మర్ సవాల్

 గ్రేటర్ వరంగల్​కు సమ్మర్ సవాల్
  •     నగరంలో పెండింగ్ పనులకు ఎండాకాలమే టార్గెట్
  •     సరైన యాక్షన్ లేకపోతే  సమస్యలు పెరిగే అవకాశం
  •     పూర్తి స్థాయి కమిషనర్ లేక 20 రోజులు
  •     వరంగల్ కలెక్టర్ ప్రావీణ్యకు ఇన్​చార్జిగా బాధ్యతలు
  •     సన్నద్ధత లేకపోతే మున్ముందు తప్పని ఇబ్బందులు

హనుమకొండ, వెలుగు : గ్రేటర్​ వరంగల్​ మున్సిపల్​ కార్పొరేషన్​ అధికారులకు సమ్మర్​ సవాల్​ విసురుతోంది. నగరంలో చేపట్టాల్సిన కొన్ని ప్రాజెక్టులకు ఎండాకాలమే టార్గెట్​ కాగా.. సమ్మర్ నేపథ్యంలో ఇంకా కొన్ని సమస్యలపై అధికారులు పోరాటం చేయాల్సి ఉంది. నాలాల డెవలప్​ మెంట్ పనులతో పాటు ఎండాకాలంలో తలెత్తే తాగునీటి సమస్యలు, లీకేజీలపై అధికారులు దృష్టిపెట్టాల్సి ఉంది.  

ఎండలు ఎక్కువైతే సరైన ఆహారం దొరక్క కోతులు, కుక్కల బెడద కూడా ఎక్కువై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రేటర్​ వరంగల్ మున్సిపల్​ కార్పొరేషన్​ కు పూర్తి స్థాయి కమిషనర్​ లేకపోవడం కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే బల్దియా ఇన్​చార్జి కమిషనర్​ గా  కలెక్టర్​ ప్రావీణ్యకు ప్రభుత్వం గురువారం అదనపు బాధ్యతలు అప్పగించగా..  వరంగల్  జిల్లా పాలనా వ్యవహారాలతో పాటు గ్రేటర్ సమస్యలు ఆమెకు సవాల్​ గా మారనున్నాయి.

పెండింగ్​ పనులకు సమ్మరే టార్గెట్​

ఇప్పటినుంచే ఎండలు దంచికొడుతుండగా చాలాచోట్లా పైపులైన్​ లీకేజీలు, వాల్వ్​ రిపేర్లతో  ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటితో పాటు ముఖ్యంగా బల్దియా పన్నుల వసూళ్లలో చాలా   వెనుకబడి ఉండగా.. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఫోకస్​ పెట్టి వసూళ్లు చేయించాల్సి ఉంది. అంతేగాకుండా నగరంలో దోమల సమస్యతో పాటు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, ముఖ్యమైన పనులు స్పీడప్​ చేయించడం, అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తూ సమస్యలు సాల్వ్​ చేయడంపై కమిషనర్​ ఫోకస్​ పెట్టాలి.

కానీ పూర్తిస్థాయి కమిషనర్​ లేకపోవడం వల్ల గ్రేటర్ పాలన వ్యవహారాలు గాడితప్పాయనే విమర్శలున్నాయి.  వర్షాకాలంలో వరదలు ముంచెత్తకుండా నాలాలు డెవలప్​ చేయాల్సి ఉంది. వాటికి సంబంధించిన పనులు వానలు స్టార్ట్​ అయ్యేలోగానే పూర్తి చేయాల్సి ఉండగా.. ఇప్పుడిప్పుడే ఆ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఒకట్రెండు రోజుల్లో నాలా ఆక్రమణలు కూల్చివేసే అవకాశం ఉంది.  పారదర్శకంగా పనులు చేపట్టడంలో కమిషనర్​ పాత్ర కీలకం. 

కోతులు, కుక్కల భయం 

ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతుండగా తాగునీరు, ఆహారం లభించక వరంగల్ నగరంలో కోతులు, కుక్కల సమస్య తీవ్రం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే సిటీలో కుక్కకాట్లు పెరుగుతుండగా, గతేడాది సమ్మర్ లో  పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రం నుంచి కాజీపేటకు వలస వచ్చిన ఓ కుటుంబంలో  ఏడేండ్ల బాలుడిని వీధి కుక్కలు కరిచి  చంపేశాయి. నగరంలో ఎంతో మందిని కరిచి, గాయపరిచాయి. ఇదిలాఉంటే ఎండాకాలంలో కోతుల సమస్య కూడా తీవ్రంగా ఉంటుంది. కోతులకు ప్రత్యేకంగా మంకీ ఫుడ్​ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నా..

అవి ఎక్కడా అందుబాటులోకి రాలేదు. దీంతో ఎండాకాలం కోతులకూ ఆహారం  లభించక దాడులకు పాల్పడే ప్రమాదం ఉంది. ఇదివరకు వరంగల్ ఉర్సుగుట్ట సమీపంలోని ఓ హాస్టల్​ లో బాలికను కోతులు వెంబడించగా.. ఆమె బిల్డింగ్​ పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. ఇలా కుక్కలు, కోతుల దాడులు ఎండాకాలంలో ఎక్కువయ్యే అవకాశం ఉండగా.. వాటికోసం ముందస్తు యాక్షన్​ చేపట్టాల్సి ఉంటుంది.  వీటన్నింటినీ కమిషనర్ పర్యవేక్షణ చేయాల్సి ఉండగా.. సరైన ప్లానింగ్​ లేకపోతే మూగజీవాల దాడులు ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంది. 

కలెక్టర్​ ప్రావీణ్యకు 'అదనపు' భారం

ఫిబ్రవరి 9 వరకు బల్దియా కమిషనర్​ గా కొనసాగిన షేక్​ రిజ్వాన్​ బాషా 15 రోజులపాటు సెలవుపై వెళ్లారు. ఆ తరువాత హనుమకొండ అడిషనల్​ కలెక్టర్​ రాధికా గుప్తాకు ఇన్​చార్జి కమిషనర్​ గా బాధ్యతలు అప్పగించారు. తిరిగి షేక్​ రిజ్వాన్​ బాషా విధుల్లో చేరేలోగా.. ఫిబ్రవరి 23న ఆయనను జనగామ కలెక్టర్​ గా బదిలీ చేశారు.  తరువాత పూర్తి స్థాయి కమిషనర్​ గా ఎవరినీ నియమించలేదు. ఈ క్రమంలోనే గతంలో గ్రేటర్​ కమిషనర్​ గా పని చేసిన వరంగల్ ప్రస్తుత కలెక్టర్​ ప్రావీణ్యకు ఇన్​ఛార్జ్​ కమిషనర్​ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది.

దీంతో ఆమె వరంగల్​ బాధ్యతలతో పాటు గ్రేటర్​ బాధ్యతలు కూడా చూసుకోవాల్సి ఉంది.  ఇప్పటికే ఎంపీ ఎలక్షన్స్ హడావుడి మొదలవగా, అటు వరంగల్, గ్రేటర్​ వరంగల్ పాలనతో పాటు సమస్యలపై ఫోకస్​ పెట్టడం, పనులను పర్యవేక్షించడం, ఆఫీసర్లను కోఆర్డినేట్​ చేయడం, తదితర వ్యవహరాలన్నీ  కలెక్టర్​ ప్రావీణ్యపై అదనపు భారాన్ని పెంచే అవకాశం ఉంది. దీంతో  గ్రేటర్​ కు  పూర్తిస్థాయి కమిషనర్​ ను నియమిస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 వాస్తవానికి  ఉమ్మడి వరంగల్ లో గ్రేటర్ సిటీనే కీలకం కాగా ఇక్కడ పూర్తి స్థాయి కమిషనర్​ ఉంటేనే పాలనావ్యవహారాలతో పాటు డెవలప్​ మెంట్​ యాక్టివిటీస్​ పై ఫోకస్​ పెట్టే అవకాశం ఉంటుంది. 'కుడా' వ్యవహారాలను కూడా వైస్​ ఛైర్మన్​ గా కమిషనరే చక్కదిద్దే ఛాన్స్​ ఉంటుంది. దీంతో పూర్తిస్థాయి కమిషనర్​ ను నియమించి, గ్రేటర్​ సిటీపై ఫోకస్​ పెట్టాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.