సీటు కోసం కార్పొరేటర్ ను హత్యచేసింది కుటుంబసభ్యులే

సీటు కోసం కార్పొరేటర్ ను హత్యచేసింది కుటుంబసభ్యులే
  • నిందితులు స్వయానా సోదరి, ఆమె కుమారుడు
  • సహకరించారనే అనుమానంతో మరో ఐదుగురి అరెస్ట్
  • ఎన్నికల్లో పోటీ కోసమే చంపించినట్లు అనుమానాలు

బెంగళూరు: కర్ణాటకలో అధికార బీజేపీ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ దంపతుల జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. ఏడాదిన్నర వ్యవధిలో దంపతులిద్దరూ దారుణంగా హత్యకు గురికావడం కలకలం సృష్టించింది. పోలీసులు జంట హత్యల కేసును సవాల్ గా తీసుకుని విచారించగా..  రెండేళ్ల వ్యవధిలో ముందుగా భర్తను.. ఆ తర్వాత ఆయన భార్యను చంపిన కేసులో కుటుంబ సభ్యులే నిందితులుగా తేలింది. వీరిని అడ్డు తొలగించుకుంటే తమలో ఒకరికి కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం వస్తుందనే ఉద్దేశంతోనే వీరిని చంపించినట్లు అనుమానాలున్నాయి. కేసు లోతుగా దర్యాప్తు జరిపితే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. సంచలనం సృష్టించిన కార్పొరేటర్ దంపతుల జంట హత్యల కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. 
చలవాదిపాళ్య బీజేపీ కార్పొరేటర్ గా ఉన్న కదిరేశ్ 2018లో దారుణహత్యకు గురయ్యారు. అప్పట్లో కర్ణాటకలో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న తరుణంలో ఈ హత్య జరగడ దుమారం రేపింది. బీజేపీ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు స్థానిక రౌడీ షీటర్ అతుశ్ పై అనుమానంతో బీజేపీ బెంగళూరు దక్షిణ విభాగం అధ్యక్షుడు ఎన్ఆర్ రమేష్ పోలీసు కమిషనర్  కమల్ పంత్ ను కలసి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో తాజాగా అంటే ఈనెల 24వ తేదీన గురువారం రోజున కదిరేష్ భార్య రేఖను దుండగులు దారుణంగా చంపేశారు. ఆమె ఇంటి ముందే దుండగులు దాడి చేసి చంపి పరారు కావడం సంచలనం సృష్టించింది. 
కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న తరుణంలో ఆ పార్టీ వారిపైనే దాడులు చేయడమే కాదు.. చంపేయడం కలకలం రేపింది. బీజేపీ అధికార పార్టీ కావడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. సీసీ కెమెరాల పుటేజీలు.. ఫోన్ కాల్ వ్యవహారాలను ట్రేస్ చేసి నిందితుల కోసం గాలిస్తుండగా.. కుటుంబ సభ్యులపైనే అనుమానాలు కలిగాయి. బలమైన ఆధారాలు లభించడంతో రేఖ సోదరి మాలాతోపాటు ఆమె కుమారుడు అరుళ్ ను, వారికి సహకరించిన మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తమ కుటుంబంలో ఉన్న ముగ్గురు మహిళల్లో ఎవరో ఒకరు కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తే.. రేఖ అడ్డుగా ఉందని, అందుకే ఆమెను చంపించినట్లు పోలీసులకు ఇంటరాగేషన్ లో  చెప్పినట్లు సమచారం. అయితే బీజేపీ శ్రేణులు మాత్రం రౌడీ షీటర్ అతుష్ పై అనుమానం వ్యక్తం చేయడంతో అతని కోసం గాలింపు చేపట్టారు. చనిపోయిన రేఖ సోదరి మాలా, ఆమె కుమారుడు అరుళ్ తోపాటు.. వీరికి సహకరించిన పీటర్, సూర్య, స్టీఫెన్ లను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.