ఇవాళ నాగోబా జాతరలో దర్బార్.. హాజరుకానున్న మంత్రులు

ఇవాళ నాగోబా జాతరలో దర్బార్.. హాజరుకానున్న మంత్రులు

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా దర్బార్ జాతర కన్నుల పండువగా జరుగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. నాగోబా జాతరలో భాగంగా ఇవాళ నిర్వహించే దర్బార్ కు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హాజరుకానున్నారు.  ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం గిరిజన దర్బార్​లో మంత్రులు పాల్గొననున్నారు. నాగోబా జాతర, దర్బార్‌ సందర్భంగా ఆదిలాబాద్‌ జిల్లాలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేట్‌ విద్యాసంస్థలకు ఇవాళ జిల్లా కలెక్టర్‌ పట్నాయక్‌ సెలవు  ప్రకటించారు.   

 గిరిజనుల సమస్యలపై చర్చ

ఏటా గిరిజనుల సమస్యలపై నాగోబా దర్బార్ లో చర్చిస్తారు. స్వాతంత్ర్యానికి ముందు నుండి నాగోబా జాతరలో దర్బార్ నిర్వహించే సంప్రదాయం ఉంది. అదే ఆనవాయితీని ఇప్పటికే పాటిస్తున్నారు. దర్బార్ లో పోడుభూముల సమస్యలతో పాటు ఆదివాసీలకు మౌలిక సదుపాయాలపై చర్చ జరపాలని తుడుందెబ్బ డిమాండ్ చేస్తోంది. 

భక్తులతో కిక్కిరిసిన కేస్లాపూర్‌

మరోవైపు.. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న గిరిజనులతో జాతర పరిసరాలు కిక్కిరిసిపోయాయి. దాదా బగ మంతి.. నన్‌ ఇన్కే నాగోబా పేన్‌ లాసి కేస్లాపూర్‌ సొంజెర్‌.. దీర నన్‌ గిరే వాంతోన్‌.. అంటూ తరలివస్తున్న భక్తజనంతో కేస్లాపూర్‌ జనసంద్రంగా మారింది. నిన్న ఉదయం మెస్రం వంశీయులు పెర్సా పేన్, బాన్ పేన్​కు పూజలు నిర్వహించారు. ముందుగా గోవడ్ నుంచి సంప్రదాయ వాయిద్యాల నడుమ బాన్ ఆలయానికి చేరుకున్నారు. మెస్రం కొత్త కోడళ్లు కోనేరు నుంచి నీళ్లు తీసుకురాగా, మెస్రం ఆడపడుచులు బాన్ ఆలయం ముందున్న పాత పుట్టలను తొలగించి కొత్త పుట్టలు తయారు చేశారు. అనంతరం నాగోబా ఆలయం వెనుక ఉన్న మెస్రం పెద్దదేవుడు పెర్సా పేన్​ను భక్తిశ్రద్ధలతో పూజించారు.