
- స్లాబుల్లో మార్పులతో తగ్గనున్న రాబడి
- ప్రతి నెలా రూ.500 కోట్ల లోటు
- కేంద్రం సహకరించాలని రాష్ట్ర సర్కారు వినతి
హైదరాబాద్, వెలుగు: జీఎస్టీలో కేంద్రం కొత్తగా తెచ్చిన మార్పులతో రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం పడనున్నది. జీఎస్టీ స్లాబులను నాలుగు నుంచి రెండుకు కుదించడం, కొన్ని వస్తువులు, సేవలకు పూర్తిగా పన్ను ఎత్తేయడంతో రాష్ట్రం ప్రతి నెలా రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉన్నది. ప్రస్తుతం జీఎస్టీలో రాష్ట్రం వాటా కింద ప్రతినెలా రూ.5 వేల కోట్ల వరకు వస్తున్నది. ఈ నెల 22 నుంచి అమలయ్యే కొత్త రేట్లతో ఇది రూ.4,500 కోట్లకు పరిమితం కానున్నదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన రాష్ట్రానికి ఏటా దాదాపు రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ చేసిన అప్పులతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి.. ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడం సవాల్‌గా మారనున్నది. రాష్ట్రంలో పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందున వాటిని కొనసాగించేందుకు వీలుగా జీఎస్టీలో రాష్ట్రాల వాటాను పెంచాలని, లేదంటే కాంపన్సేషన్ సెస్ రూపంలో నష్టాన్ని భర్తీ చేయాలని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
ఉత్పత్తి.. సేవల రంగంలోనే ఎక్కువ నష్టం
కొన్ని వస్తువులపై పన్ను రేట్లు తగ్గించడంతో వినియోగదారులకు ఫైనాన్షియల్ రిలీఫ్ దక్కుతున్నా.. రాష్ట్ర ఆదాయానికి మాత్రం భారీగా గండిపడ్తున్నది. ప్రధానంగా ఉత్పత్తి, సేవల రంగాల నుంచే రాష్ట్రానికి జీఎస్టీ రూపంలో ఎక్కువ రాబడి వస్తున్నది. ఇందులో ఇన్సూరెన్స్, వెహికల్స్, సిమెంట్, ఎలక్ట్రానిక్ గూడ్స్ వంటివి ఉన్నాయి. 2022–-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ.13.27 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో సేవల రంగం 17.5% వాటా కలిగి ఉంది. ఈ రంగం (హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్పిటల్స్, రవాణా, స్థిరాస్తి) నుంచే ఎక్కువ జీఎస్టీ వస్తున్నది. దీంతో పాటు 28% ఉన్న కొన్ని వస్తువుల పన్ను రేటును తగ్గించడం లేదా పూర్తిగా మినహాయింపు ఇవ్వడంతో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లనున్నది. కొత్తగా కొన్ని వస్తువులను అధిక పన్ను స్లాబుల్లోకి చేర్చడంతో కొంత ఆదాయం పెరిగినప్పటికీ, పడిపోతున్న ఆదాయంతో పోలిస్తే అది చాలా తక్కువ. జీఎస్టీ అమలు టైమ్‌లో (2017), కేంద్రం రాష్ట్రాలకు 5 ఏండ్ల పాటు 14% వార్షిక ఆదాయ వృద్ధిని హామీ ఇచ్చింది. దీన్ని కాంపెన్సేషన్ సెస్ ద్వారా భర్తీ చేస్తున్నది. ఈ హామీ 2022తో ముగిసింది. కొత్త స్లాబులతో ఆదాయం తగ్గుతుండటంతో కాంపెన్సేషన్ సెస్ తిరిగి అమలు చేయాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే, ప్రస్తుత పన్ను స్థాయిని కొనసాగించేందుకు హానికారక, లగ్జరీ వస్తువులపై అదనపు సుంకం విధించాలని, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా రాష్ట్రాలకు బదిలీ చేయాలని కోరుతున్నది. కేంద్రం రుణాలు సేకరించి, వాటిని గతంలో మాదిరిగా పరిహార సెస్ గడువును ఐదేండ్ల కంటే పొడిగించడం ద్వారా తిరిగి చెల్లించాలని రిక్వెస్ట్ చేస్తున్నది. కనీసం ఐదేండ్ల పాటు పరిహారం హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నది.
హోటళ్లు.. రెస్టారెంట్లు
పాత స్లాబు: స్టార్ హోటళ్లలో 28% పన్ను. సాధారణ రెస్టారెంట్లలో 18% పన్ను.
కొత్త స్లాబు: అన్ని రకాల రెస్టారెంట్లకు 5% పన్ను. ఇది ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) లేకుండా ఉంటుంది. గతంలో పెద్ద హోటళ్ల నుంచి అధిక పన్ను వచ్చేది. ఇప్పుడు అందరికీ ఒకే స్లాబు ఉండటంతో ప్రభుత్వానికి రాబడి తగ్గనున్నది. ఉదాహరణకు, ఒక హోటల్ గతంలో రూ.1000 బిల్లుపై రూ.280 పన్ను చెల్లిస్తే.. ఇప్పుడు అదే బిల్లుపై రూ.50 మాత్రమే ట్యాక్స్ పే చేస్తుంది. దీంతో పన్ను రాబడి భారీగా తగ్గుతుంది.
ఎలక్ట్రానిక్ గూడ్స్
పాత స్లాబు: కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్‌పై 28% పన్ను. కొత్త స్లాబు: టీవీలు (32 అంగుళాల వరకు), వీడియో గేమ్స్, డిజిటల్ కెమెరాల వంటి వస్తువులపై 18% పన్నుకు తగ్గించారు. గతంలో ఒక టీవీపై రూ.15 వేలు పన్ను వసూలు చేసేవారు. ఇప్పుడు అదే టీవీపై రూ.10 వేలు మాత్రమే పన్ను వసూలు చేస్తారు. ఒకవేళ రాష్ట్రంలో ప్రతి నెలా ఒక లక్ష టీవీలు అమ్ముడుపోతే, రాష్ట్రానికి సుమారు రూ.50 కోట్ల నష్టం వస్తుంది.
గడిచిన 5 నెలలుగా రాష్ట్ర జీఎస్టీ ఆదాయం (రూ.కోట్లలో)
ఏప్రిల్ రూ.6,983
మే రూ.5,310
జూన్ రూ.5,111
జులై రూ.5,417
ఆగస్టు రూ.5,103
ఆటోమొబైల్స్ విడిభాగాలు
తెలంగాణలో ఆటోమొబైల్స్ రంగం వృద్ధి చెదుతున్నది. ఆటో మొబైల్ విడిభాగాలపై పన్ను రేటును 28% నుంచి 18%కి తగ్గించడంతో రాబడి పడిపోతుంది. ఇది కార్ల అమ్మకాలపై పరోక్షంగా ప్రభావం చూపుతుంది. ఒక ఆటోమొబైల్ డీలర్ నెలకు రూ.10 కోట్ల విలువైన విడిభాగాలు విక్రయిస్తే, గతంలో రూ.2.8 కోట్లు పన్ను వచ్చేది. ఇప్పుడు అదే విక్రయాలపై రూ.1.8 కోట్లు మాత్రమే వస్తుంది.