ఏడు నెలలుగా ఆగిన పాలమూరు‌‌‌‌–రంగారెడ్డి ప్రాజెక్టు

ఏడు నెలలుగా ఆగిన పాలమూరు‌‌‌‌–రంగారెడ్డి ప్రాజెక్టు
  • ఏడు నెలలుగా ఆగిన పాలమూరు‌‌‌‌–రంగారెడ్డి ప్రాజెక్టు
  • ఎన్జీటీ స్టే వల్ల 4 నెలల కింద నిలిచిన పనులు
  • పబ్లిక్ హియరింగ్​ జరిగి 7 నెలలు దాటినా ముందడుగు పడలే
  • రాష్ట్రం నుంచి పర్యావరణశాఖకు నేటికీ అందని రిపోర్ట్​
  • ఫండ్స్​ లేక కావాలనే లేట్​ చేస్తున్నారనే విమర్శలు

నాగర్​ కర్నూల్​, వెలుగు: ఎన్జీటీ స్టే కారణంగా అక్టోబర్​లో ఆగిపోయిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇంకా మొదలుకాలేదు. ఎప్పుడు స్టార్టవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి. మొదటి నుంచీ ఈ ప్రాజెక్టును రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు షురూ చేసి,  ఐదేండ్ల తర్వాత తీరిగ్గా 2020లో ప్రజాభిప్రాయ సేకరణకు నోటీసులు ఇచ్చింది. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రావడంతో తిరిగి గతేడాది ఆగస్టులో పబ్లిక్ ​హియరింగ్​ నిర్వహించారు. ఈలోపే ఏపీ ప్రభుత్వం, కడప రైతులు.. పర్యావరణ అనుమతులు లేకుండా చేపడుతున్న పాలమూరు– రంగారెడ్డి పనులు నిలిపివేయాలంటూ  ఎన్టీటీని ఆశ్రయించడంతో స్టే వచ్చింది. కాగా, ప్రజాభిప్రాయసేకరణ​పూర్తయి ఏడు నెలలు గడుస్తున్నా ఆ రిపోర్టును ఇప్పటికీ కేంద్ర పర్యావరణ,అటవీ మంత్రిత్వ శాఖ వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేయలేదు. దీనిని బట్టి రాష్ట్ర సర్కారుకు అసలు పాలమూరు–రంగారెడ్డి పనులను ఇప్పట్లో కొనసాగించే ఉద్దేశం ఉందా? లేదంటే చేతిలో ఫండ్స్​ లేక కావాలనే లేట్​ చేస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పనులు మొదలుపెట్టిన ఆరేండ్లకు పబ్లిక్​ హియరింగ్​
మహబూబ్ నగర్​, నాగర్​ కర్నూల్​, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీటితోపాటు  హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలను తీర్చే లక్ష్యంతో 2015 జూన్​లో సీఎం కేసీఆర్​పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా లిఫ్టులు, రిజర్వాయర్లు, కెనాల్స్​, టన్నెల్స్​ పనులను 21 ప్యాకేజీలుగా విభజించారు. 18 ప్యాకేజీల పనులకు రూ.30వేల కోట్ల అంచనా వ్యయంతో   టెండర్లు పిలిచి కాంట్రాక్ట్​ సంస్థలకు అప్పగించారు.  ప్రారంభంలో 10 లక్షల ఎకరాలుగా ఉన్న ఆయకట్టును12.3 లక్షల ఎకరాలు చేసి, అంచనా వ్యయాన్ని ఊహించని స్థాయిలో 52 వేల కోట్లకు పెంచేశారు.  2017లో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆమోదించిన టీఓఆర్​(టర్మ్స్​ఆఫ్ ​రిఫరెన్స్​)కు అనుగుణంగా డీపీఆర్​ఇవ్వకుండా కాగితాలపై పూటకో అంచనాను ప్రతిపాదిస్తూ పోవడంతో సమస్య మొదలైంది. కొత్తగా ప్రతిపాదించిన పనుల కారణంగా మళ్లీ మొదటి నుంచీ అనుమతులు పొందాల్సి వచ్చింది.  దీంతో పనులు ప్రారంభించిన ఆరేండ్ల తర్వాత 2020లో రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా  ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్​ ఇచ్చింది.  ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేసి తిరిగి 2021 ఆగస్ట్​లో నిర్వహించారు. అదే నెలలో పబ్లిక్​ హియరింగ్​ పూర్తయినప్పటికీ  ఆ వివరాలను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెబ్​సైట్​లో ఇప్పటికీ సబ్మిట్ చేయలేదు.

అక్టోబర్​లో నిలిచిన పనులు
ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవన్న విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం, రాయలసీమ ప్రాంతానికి చెందిన కొందరు రైతులు పాలమూరు పనులు ఆపాలని విడివిడిగా ఎన్జీటీ చెన్నై బెంచ్​ను ఆశ్రయించారు. ఆయా పిటిషన్లను విచారించిన బెంచ్​, ఏపీ సర్కారుతోపాటు అక్కడి రైతుల అభ్యంతరాలతో ఏకీభవిస్తూ పాలమూరు పనులు వెంటనే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  దీంతో గతేడాది అక్టోబర్​లో పనులు నిలిచిపోయాయి. నార్లాపూర్, ఏదుల, వట్టెం,కర్వెన రిజర్వాయర్లతో పాటు మట్టి కట్టలు, టన్నెళ్ల నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయి. మొత్తం మీద 18 ప్యాకేజీల పరిధిలో 40 శాతం పనులు పెండింగ్ ​పడినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి గడిచిన ఆరేండ్లలో దాదాపు రూ.18వేల కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. 60శాతం పనులు జరిగినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆమేరకు ఫండ్స్​ రాక బిల్లులు నిలిచిపోయినట్లు ఆఫీసర్లు అంటున్నారు. 80 శాతం పనులు పూర్తయితేనే పంపులు, మోటర్లు ఫిట్ చేసే చాన్స్​ ఉంటుందని  చెబుతున్నారు. అసలే ఫండ్స్​ కొరతతో అల్లాడుతున్న రాష్ట్ర సర్కారు, ఎన్జీటీ ఆదేశాలతో పనులు నిలిపివేసి ఏడు నెలలుగా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును మాత్రం శరవేగంగా పూర్తిచేసి, ఇందులో చివరిదైన మల్లన్న సాగర్​ను కూడా ఇటీవలే కేసీఆర్ ​ప్రారంభించారు.  తన సొంత జిల్లాకు నీళ్లు తెచ్చుకోవడంపై ఉన్న శ్రద్ధలో సగమైనా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై పెట్టి ఉంటే ఇప్పటికే పూర్తయ్యేదని ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రతిపక్ష లీడర్లు, రైతులు విమర్శిస్తున్నారు.