ఇగ పెట్రోల్,డీజిల్ కార్లు ఉండవు కావొచ్చు..!

ఇగ పెట్రోల్,డీజిల్ కార్లు ఉండవు కావొచ్చు..!

ఢిల్లీలో గాలి కాలుష్యం భారీగా పెరిగిపోయింది. వాహనాల నుంచి వెలువడే పొగను కాలుష్యానికి ముఖ్య కారణం అవుతోంది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ వాహనాల బదులుగా ఎలక్ట్రానిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా 2022లో ఢిల్లీ ఈవీ పాలసీని తీసుకొచ్చింది. ఈవీ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడమే ఈ పాలసీ ఉద్ధేశం. అంతేకాకుండా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ‘స్విచ్ ఢిల్లీ’ క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు. తాజాగా ఈవీ పాలసీలో భాగంగా ఢిల్లీవాసులు కొత్త రికార్డ్ సృష్టించారు. ఒక్క డిసెంబర్ నెలలోనే 7,046 ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు.

ఈవీ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత 2022 ఇప్పటివరకు మొత్తం 93,239 వాహనాలు అమ్ముడయ్యాయి. గతంతో పోల్చితే ఈవీ కొనుగోలు 85 శాతం పెరిగింది. ఈవీ పాలసీల్లో భాగంగా ఢిల్లీలో ఇప్పటి వరకు 2,300 పైగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 200లకుపైగా బ్యాటరీ స్వాపింగ్ (బ్యాటరీ మార్చుకునే) స్టేషన్లు అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం రూ. 1,500 కోట్లు ఖర్చు చేసింది. 2024 కల్లా ఎలక్ట్రానిక్ వాహనాల సంఖ్య 25 శాతానికి పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. వీటితో పాటు 2025 నాటికి 10,000 ఈవీ బస్సులను ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు.