తమిళనాడు జనం అద్భుతం చేసి చూపిస్తారు

తమిళనాడు జనం అద్భుతం చేసి చూపిస్తారు

2021 అసెంబ్లీ ఎన్నికలపై రజనీకాంత్ కామెంట్
ప్రజల కోసం కమల్తో దోస్తీకి సిద్ధం
సీఎం ఎవరనేది ఎన్నికలప్పుడే నిర్ణయిస్తామన్న సూపర్​స్టార్

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర పైనే సమయం ఉంది. కానీ అక్కడి రాజకీయాలు మాత్రం ఇప్పటినుంచే వేడెక్కుతున్నాయి. అవసరమైతే రజనీకాంత్​తో కలిసి పని చేస్తానని ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ చీఫ్ కమల్ హాసన్ కామెంట్ చేయడం.. తాను కూడా సిద్ధమేనని రజనీకాంత్ వ్యాఖ్యానించడంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కీలక కామెంట్స్ చేశారు. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు అద్భుతాన్ని సృష్టించబోతున్నారని అన్నారు. కమల్​తో కలిసి పని చేయడంపై సంసిద్ధత వ్యక్తం చేసిన ఆయన.. కూటమికి సంబంధించిన విషయాలు, పవర్ షేరింగ్, ఎన్నికల్లో గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి కావాలి?  అనే వాటిపై ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘2021లో తమిళనాడు ప్రజలు రాజకీయాల్లో 100 శాతం అద్భుతాలు క్రియేట్ చేస్తారు” అని కామెంట్ చేశారు. ద్రవిడ భూమి అయిన తమిళనాడులో రజనీకాంత్ ‘స్పిరిచ్యువల్ పాలిటిక్స్’ పని చేయవని అధికార ఏఐఏడీఎంకే నేతలు చేసిన కామెంట్స్​పై ఆయన ఇలా స్పందించారు. చెన్నైలో మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి ఎవరు?

కమల్​హాసన్​తో కలిసి పని చేస్తే కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘అలాంటి అంశాలన్నింటినీ ఎన్నికల టైమ్​లోనే చర్చిస్తాం. అలాగే నేను పార్టీ ప్రారంభించాక, పార్టీలోని నేతలతో కూటమి గురించి, ఇతర అంశాల గురించి చర్చించాల్సి ఉంది. అప్పటివరకు ఈ అంశాలపై మాట్లాడటం నాకు ఇష్టం లేదు” అని రజనీకాంత్ కామెంట్ చేశారు.

పిల్లి, ఎలుక కలిసినట్లే

కమల్, రజనీ కలిసి పని చేస్తామనడం.. ఎలుక, పిల్లి  కలిసి నివసించినట్లే ఉంటుందని ఎఐఏడీఏంకే ఎగతాళి చేసింది. కమల్ హాసన్ హేతువాదం, కమ్యూనిజం గురించి మాట్లాడుతుంటే, రజనీ మాత్రం స్పిరిచ్యువల్ పాలిటిక్స్​గురించి మాట్లాడుతున్నారని కామెంట్ చేసింది. ఈ మేరకు ఏఐఏడీఎంకే పార్టీ అధికార పత్రిక ‘నమతు అమ్మ’ ఓ ఆర్టికల్ రాసింది. కమల్​తో కలిసి పని చేయడం వల్ల రజనీకాంత్ కు రాజకీయంగా ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొంది. అన్నాడీఎంకేకు 1.5 కోట్ల మంది క్యాడర్ ఉందని చెప్పింది. రజనీకాంత్​ముందు కమల్ హాసన్ ఓడిపోయారని పేర్కొంటూ… 1977లో వచ్చిన ‘పతినారు వయదినిలే’ సినిమాలో రజనీకి కమల్ మసాజ్ చేస్తున్న ఫోటోను ప్రచురించింది.

0+0=0

రజనీకాంత్+కమల్ హాసన్= 0+0 =0’ అని తమిళనాడు రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.బి.ఉదయకుమార్ ఎగతాళి చేశారు. వాళ్లు ఎవరికివాళ్లే పెద్ద జీరోలని, జీరో మరో జీరోతో కలిస్తే ఫలితం కూడా జీరోనే వస్తుందని, మరొకటి రాదని కామెంట్ చేశారు. ‘‘వాళ్లు కలిసి వచ్చినా .. మేమేం భయపడం. మా పార్టీ ఎవరెస్ట్ వంటిది. మమ్మల్ని ఎవరూ టచ్ చేయలేరు. ఏఐఏడీఎంకే ఓటు బ్యాంక్ చాలా స్ర్టాంగ్. మేం డీఎంకే పార్టీ గురించే ఆలోచించాలి. వాళ్లు మాత్రమే మా ఓటు బ్యాంకుపై ప్రభావం చూపగలరు’’ అని ఫిషరీస్ మంత్రి డి.జయకుమార్ అన్నారు.

మరిన్ని వార్తల కోసం