ఓయూ పీజీ సెంటర్లలో పర్మినెంట్​ ఫ్యాకల్టీ కొరత

ఓయూ పీజీ సెంటర్లలో పర్మినెంట్​ ఫ్యాకల్టీ కొరత

కాంట్రాక్ట్ ఫ్యాకల్టీతోనే బోధన.. అద్దె భవనాల్లో కాలేజీలు
పలు కోర్సుల ఎత్తివేత
ఇన్ చార్జీలుగా వ్యవహరించే అధ్యాపకులకు కో ఆర్డినేటర్ హోదా
సర్టిఫికెట్ల జారీలో తలెత్తుతున్న సమస్యలు

ఓయూ, వెలుగు : గ్రామీణ ప్రాంత స్టూడెంట్లకు ఉపయోగకరంగా ఉండేలా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన పీజీ కాలేజీలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. వర్సిటీ అధికారులు వాటిని పట్టించుకోకుండా గాలికొదిలేయడంతో అడ్మినిస్ట్రేషన్​అస్తవ్యస్తంగా మారింది. పర్మినెంట్​బోధనా సిబ్బందిని నియమించకుండా కాంట్రాక్ట్, పార్ట్​టైం​అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. ఇదేకాకుండా ఇన్​చార్జ్ ప్రిన్సిపాళ్లుగా కొనసాగించినవారిని కో ఆర్డినేటర్ గా మార్చడంతో సర్టిఫికెట్ల జారీలో సమస్యలు తలెత్తుతున్నాయి. స్టూడెంట్లకు సొంత భవనాలు కూడా లేవు. హాస్టళ్లను నిర్మించినప్పటికీ అవి ప్రారంభానికి నోచుకోలేదు. కోర్సులను మాత్రమే ప్రారంభించిన అధికారులు ఇతర అంశాలను పట్టించుకోకపోవడంతో పీజీ సెంటర్లన్నీ సమస్యలకు కేరాఫ్​ అడ్రస్​గా మారాయి. 

ఖాళీగా పోస్టులు

ఓయూ పరిధిలోని చాలా పీజీ సెంటర్లకు సొంత భవనాలు లేవు. దీంతో వాటిని అద్దె భవనాల్లోనే నడిపిస్తున్నారు. నర్సాపూర్​లో 2015లో ఐదు కోర్సులతో ఏర్పాటు చేసిన పీజీ సెంటర్​అద్దె భవనంలోనే నడుస్తోంది. పర్మినెంట్ అధ్యాపకులు లేకపోవడంతో ఇక్కడ ఇప్పటికే రెండు కోర్సులను ఎత్తేశారు. మిగతా మూడు కోర్సులను కాంట్రాక్ట్, పార్ట్​-టైమ్ అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు.ఈ కాలేజీకి 31 టీచింగ్, 39 నాన్​ టీచింగ్​, 32 హాస్టల్ స్టాఫ్​ ఉద్యోగాలు మంజూరు చేసినా నలుగురు కాంట్రాక్ట్, మిగతా వారంతా పార్ట్​-టైమ్​అధ్యాపకులు, మరో పది మంది నాన్​టీచింగ్​ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. చాలా వరకు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అయితే సొంత భవనాల కోసం ప్రభుత్వం గత డిసెంబరులో 10 ఎకరాల స్థలాన్ని  కేటాయించినా నిర్మాణాలు చేపట్టలేదు. సిద్దిపేటలో 1993లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులతో పీజీ సెంటర్​ను ప్రారంభించారు. కాలేజీని మూడేళ్ల క్రితం కొత్త భవనంలోకి మార్చినా అమ్మాయిలు, అబ్బాయిల కోసం సెపరేట్​గా నిర్మించిన హాస్టల్​భవనాలను ఇంకా ప్రారంభించడంలేదు. దీంతో  దూర ప్రాంతాల స్టూడెంట్లు రాకపోకలకు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని..

1993లో ప్రారంభించిన వికారాబాద్ పీజీ సెంటర్​ను తొలుత స్థానికంగా ఉన్న  ఒక ఎయిడెడ్​ కాలేజీలో నడిపారు. తర్వాత సొంత భవనం నిర్మించారు. ఇక్కడ మొదట ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు ప్రవేశపెట్టినా స్టూడెంట్ల నుంచి స్పందన లేకపోవడంతో ఎంసీఏ కోర్పును ఎత్తేసి ఎంబీఏ కోర్సును మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇక్కడంతా కాంట్రాక్ట్​ఉద్యోగులతోనే ఎల్లదీస్తున్నారు. కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలనే డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ.. అధ్యాపకుల కొరత వల్ల కోర్సులను పెట్టేందుకు వర్సిటీ అధికారులు సాహసించడం లేదు. ఇక మీర్జాపూర్​లో 1990లో రెండు కోర్సులతో పీజీ సెంటర్​ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాడి మరో కోర్సును ప్రారంభించారు. 43 ఎకరాల విస్తీర్ణంలో కాలేజీ భవనం, హాస్టల్​భవనాలు, టీచింగ్, నాన్ ​టీచింగ్​ ఉద్యోగులకు సొంత క్వార్టర్లు నిర్మించారు. కానీ పర్మినెంట్​అధ్యాపకులను మాత్రం నియమించలేదు. కాంట్రాక్ట్, పార్ట్​-టైమ్, నాన్​ టీచింగ్​సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ఇక్కడ అబ్బాయిలకు మాత్రమే అవకాశం కల్పించడంతో అమ్మాయిలు పీజీలు చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. కో ఎడ్యుకేషన్​పెట్టాలనే డిమాండ్​ వినిపిస్తోంది. జోగిపేట, నర్సాపూర్​పీజీ సెంటర్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.

‘ఇన్​చార్జ్’ స్టాంప్​తో ఇబ్బందులు​

గతంలో రెగ్యులర్​ అధ్యాపకులు ప్రన్సిపాళ్లుగా వ్యవహరించేవారు. కానీ పీజీ సెంటర్లలో కాంట్రాక్ట్​ అధ్యాపకులనే ఇన్​చార్జి ప్రిన్సిపల్​ హోదాలో కొనసాగించారు. అయితే 2022 నుంచి ఆ హోదాను కాస్తా కో ఆర్డినేటర్​గా మార్చేశారు. టీసీ, ఇతర సర్టిఫికెట్లు, స్కాలర్​షిప్​ అప్లికేషన్లు, బస్​పాస్​లపై ప్రిన్సిపల్​కాకుండా కో ఆర్డినేటర్​ హోదా స్టాంప్​తో సంతకాలు చేయడంతో స్టూడెంట్లకు సమస్యలు ఎదురవుతున్నాయి. బస్​పాస్​లు, స్కాలర్​షిప్ అప్లికేషన్లు రిజెక్ట్​ అవుతున్నాయని స్టూడెంట్లు పేర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా  చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరింత బలోపేతం చేస్తాం

ఓయూ పరిధిలో నిర్వహిస్తున్న జిల్లా పీజీ కాలేజీలకు ప్రత్యేక వెబ్​సైట్​ఏర్పాటు చేయనున్నాం. తక్కువ అడ్మిషన్లున్న కోర్సులను మరింత బలోపేతం చేస్తాం. డిమాండ్​ఉన్న మరికొన్నికొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నిర్మాణం పూర్తయిన కొత్త భవనాల్లోకి కాలేజీలను షిఫ్ట్​చేస్తాం. సర్టిఫికెట్ల జారీలో తలెత్తున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.

- ప్రొఫెసర్​జయప్రకాష్​రావు, జిల్లా పీజీ కాలేజీల డైరెక్టర్