పైప్​లైన్ బద్దలై ఎగజిమ్మిన నీళ్లు.. మహిళకు గాయాలు

పైప్​లైన్ బద్దలై ఎగజిమ్మిన నీళ్లు.. మహిళకు గాయాలు
  • మహారాష్ట్రలోని యవత్​మల్​లో ఘటన

యవత్​మల్ (మహారాష్ట్ర): భూకంపం వచ్చినట్లు పెద్ద సౌండ్​తో రోడ్డు కింద ఉన్న పైప్​లైన్ బద్దలై నీళ్లు ఎగజిమ్మిన ఘటన మహారాష్ట్ర యవత్​మల్​జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. శనివారం జరిగిన ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న ఓ మహిళకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది. రోడ్డు కింద ఉన్న పైప్​లైన్​లో వాటర్ ప్రెషర్ ఎక్కువైంది. దీంతో పైప్​లైన్ రోడ్డును రెండు ముక్కలు చేసుకుంటూ పెద్దఎత్తున బ్రౌన్ కలర్ వాటర్ బయటికి ఎగజిమ్మింది.

అప్పుడే స్కూటీపై అటువైపుగా వెళ్తున్న మహిళ.. నీటి ప్రవాహానికి కిందపడిపోయింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. క్షణాల వ్యవధిలో ఆ రోడ్డంతా బురద నీటితో నిండిపోయింది. చుట్టుపక్కల గల్లీలకూ ఈ నీళ్లు ప్రవహించాయి. పైప్​లైన్​ ప్రెషర్​కు రోడ్డుపై పెద్ద గుంత పడింది. అధికారులు దాన్ని పూడ్చి వాటర్​ సప్లై పునరుద్ధరించే పనిలో పడ్డారు. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులోని ఇట్టమడు మెయిన్ రోడ్డులోనూ ఇలాగే జరిగింది.