నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా.. సొంతిల్లు లేదు!.

నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా.. సొంతిల్లు లేదు!.
  • సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్  కుటుంబసభ్యుల దీనస్థితి 
  • గత ప్రభుత్వంలో డబుల్  బెడ్రూమ్  ఇల్లు ఇస్తామని చెప్పి ఇయ్యలే
  • ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటున్న మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీ

సూర్యాపేట, వెలుగు: ఒకసారి ఎమ్మెల్యే అయితేనే పది తరాలకు సరిపడా ఆస్తులు పోగేసుకునే నేతలున్న కాలమిది. అలాంటిది హైదరాబాద్ రాష్ట్ర తొలి అసెంబ్లీ ఎన్నికల నుంచి ఉమ్మడి ఏపీలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్​కు సొంత ఇల్లు కూడా లేదు. శిథిలావస్థకు చేరిన ఇంటిలోనే ఆయన కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అప్పట్లో  మల్సూర్​ అసెంబ్లీ సమావేశాలకు బస్సులోనే వెళ్లి వచ్చేవారు.  ఎప్పుడూ చంకలో సంచితో తిరిగేవారు. అందులో ఎమ్మెల్యే స్టాంపు పెట్టుకునేవారు. ఎక్కడైనా ప్రజలు ఎదురొచ్చి కలిస్తే అక్కడే  ఎమ్మెల్యే  స్టాంపు వేసి సంతకం పెట్టేవారు. వెంటనే వెళ్లి అధికారులను కలవాలని చెబితే సమస్యలను పరిష్కరించేవారు. రెండు గుంటల తన సొంత స్థలాన్ని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇచ్చారు. గ్రామస్తుల కోరిక మేరకు చివరకు సర్పంచి పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. పదవిలో ఉండగానే 1999లో చనిపోయారు. తుదివరకు సాధారణ జీవితం గడిపిన ఆయన సొంత ఇంటిని కట్టుకోలేదు. 

సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండకు చెందిన మాజీ ఎమ్మెల్యే మల్సూర్  కుటుంబ సభ్యులకు గత ప్రభుత్వం డబుల్  బెడ్రూమ్  ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చినా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్  ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేసుకున్నా.. తొలి విడతలో ఎంపిక చేయలేదు. ఇల్లు ఇస్తామని, సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పిన నేతలు, ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.