ఇంట్లో అక్రమంగా మద్యం బాటిళ్ల నిల్వ.. వ్యక్తి అరెస్ట్

ఇంట్లో అక్రమంగా మద్యం బాటిళ్ల నిల్వ.. వ్యక్తి అరెస్ట్

అక్రమంగా ఇంట్లో మద్యం బాటిళ్లు నిల్వ ఉంచి.. విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా అల్వాల్ లో జరిగింది. 

పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

అరుణ్ కుమార్ శర్మ అనే వ్యక్తి.. అల్వాల్ లోతుకుంటలో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా ఇతను డిఫెన్స్ కు సంబంధించిన మద్యం బాటిళ్లను ఉత్తరప్రదేశ్, అస్సాం, ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చి..గ్రేటర్ హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. డిఫెన్స్ మద్యం బాటిళ్లను అక్రమంగా నిల్వ ఉంచి..వాటిని అమ్ముతున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ, పోలీసులు రైడ్స్ నిర్వహించారు. 

అక్రమంగా ఇతర ప్రాంతాలకు మద్యం బాటిళ్లు సరఫరా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న అరుణ్ కుమార్ వద్ద నుంచి 102 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్ల విలువ సుమారు రూ. 4 లక్షల వరకూ ఉంటుందని చెప్పారు అధికారులు. డిఫెన్స్ లో ఉద్యోగం చేసిన అరుణ్ కుమార్ శర్మ..ఈ మధ్యే రిటైర్ అయ్యాడు.